కుబేరుడి సాయమే, ఇంద్రజిత్తు మరణానికి కారణమయ్యింది

3.235.176.80

కుబేరుడి సాయమే, ఇంద్రజిత్తు మరణానికి కారణమయ్యింది !
కూర్పు: లక్ష్మీ రమణ 

రామాయణం ఒక రసరమ్యకావ్యం . మనిషి ఎలా ఉండాలి , ఏ ధర్మాన్ని ఆచరించాలి , విహితాలు ఏమిటి , కానివి ఏమిటి , ధర్మాచరణ ఎలా చేయాలని మానవజాతికి దిశానిర్దేశనం చేసిన కావ్యం . ఇందులోని యుద్ధఘట్టం ధర్మం వైపునే విజయం నిలుస్తుంది . అధర్మం ఎప్పటికైనా ఓటమిని చవిచూడక తప్పదని తెలియజేస్తుంది . రావణాసురుడి అన్నగారైన కుబేరుడు , రావణాసురుడి కొడుకైన ఇంద్రజిత్తు మరణానికి కారకుడవ్వడం ఆసక్తిని రేకెత్తించే కథనమే ! 

ఒక రాక్షసుడితో మానవుడు చేసిన యుద్ధం రామా రావణ యుద్ధం  . రావణాసురుడు మహా బలశాలి . మాయా యుద్ధం చేయగల నేర్పరి . దేవదానవులని మట్టిగరిపించిన లోకోత్తర వీరుడు. స్వయంగా రావణుడు అటువంటి వాడైతే , ఆయనవైపున్న వీరులు కూడా సామాన్యులుకారు. అరివీర భయంకరులైన కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, ప్రజంఘుడు, జంబుమాలి, శత్రుఘ్నుడు, తపనుడు ,నికుంభుడు , ప్రఘసుడు, విరూపాక్షుడు, వజ్రముష్ఠి, అశనిప్రభు, ప్రతపని,విద్యున్మాలి,అగ్నికేతువు, రశ్మికేతువు, సుప్తఘ్నుడు, మధ్యకోపుడు తదితరులున్నారు . అటువంటి రావణ సేనని ఎదుర్కొనేందుకు వానరసేనతో రాముడు సిద్ధమయ్యారు . వానరులు బలవంతులు, బుద్ధిమంతులు , బలపరాక్రమాలు , శౌర్య ప్రతాపాలు కలిగినవారి సందేహం లేదు . కానీ మాయా యుద్ధం తెలియని వారు . రాముని శరణువేడినా ధర్మపరుడైన విభీషణుని అండే వారికి ఆ రాక్షసులమధ్యలో వెలిగిన దివిటీ అంటే అతిశయోక్తి కాదు . 

 ఇక,  శ్రీరాముడు యుద్ధానికి అనుమతి ఇచ్చాడు. వానరులు లంకను చుట్టిముట్టి రాక్షసులను తరిమి కోట గోడలను ధ్వంసం చేసారు. ఇది తెలిసిన రావణుడు తన సైన్యాన్ని యుద్ధానికి పంపాడు. రాముడు, లక్ష్మణుడు కూడా యుద్ధానికి ఉపక్రమించారు. రాక్షసులు మాయా యుద్ధం చేస్తున్నారు. మాయా యుద్ధంలో ఆరితేరిన విభీషణుడు విజృంభించి రాక్షసులను చంపాడు. రాక్షసులు ఈ విషయం రావణునికి చెప్పారు. రావణుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు. రామరావణ యుద్ధం ఆరంభం అయింది. 

లక్ష్మణుడు రావణుని కుమారుడైన ఇంద్రజిత్తును తన వాడి బాణాలతో ముంచెత్తాడు. రాముని బాణముల ధాటికి ఆగలేక తిరిగి పోయాడు. వీరుడైన ప్రహస్తుని యుద్ధానికి పంపాడు. విభీషణుని నాయకత్వంలో వానరులు, ప్రహస్తుని నాయకత్వంలో రాక్షస వీరులు యుద్ధం చేస్తున్నారు. విభీషణుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగించి ప్రహస్తుని చంపాడు. అతని స్థానంలో ధూమ్రాక్షుడు యుద్ధానికి వచ్చాడు. అతనిని హనుమంతుడు ఎదుర్కొన్నాడు. హనుమంతుని ముందు రాక్షస సేనలు ఆగలేక పోయాయి. హనుమంతుడు ధూమ్రాక్షునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు. 

ప్రహస్తుని, ధూమ్రాక్షుల మరణం విని చింతించి రావణుడు కుంభ కర్ణుని నిద్రలేపాడు. " కుంభకర్ణా! నీవు హాయిగా నిద్రపోతున్నావు. నేను ఇక్కడ ఆపదలో ఉన్నాను. నేను దశరథ కుమారుడైన రాముని భార్యను అపహరించి తెచ్చాను. రాముడు వానర వీరుల సాయంతో యుద్ధానికి వచ్చాడు. ప్రహస్తుడు, ధూమ్రాక్షుడు మరణించారు. కనుక నీవు యుద్ధానికి బయలు దేరాలి. ప్రమాదుడు, వజ్రవేగుడు తోడుగా ఉంటారు " అని రావణుడు కుంభకర్ణునితో చెప్పాడు. 

కుంభకర్ణుడు యుద్ధానికి బయలు దేరాడు. కుంభకర్ణుని భయంకర ఆకారాన్ని చూసి వానరులు ఆశ్చర్యపోయారు. వానర వీరులను లక్ష్యపెట్టకుండా రామలక్ష్మణుల వైపు దూసుకు పోతున్నాడు. అతనిని ఆపటానికి ముందుకు వెళ్ళిన వానర వీరులను కుంభ కర్ణుడు మింగుతూ, చంపుతూ ముందుకు వెళుతున్నాడు. కుంభకర్ణుడు సుగ్రీవుని పట్టుకున్నాడు. ఇది చూసి లక్ష్మణుడు కుంభకర్ణుని తన భాణాలతో కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడు సుగ్రీవుని విడిచి లక్ష్మణుని వైపు తిరిగాడు. 

లక్ష్మణుడు కుంభకర్ణుని రెండుచేతులు నరికాడు. కుంభకర్ణునికి మరలా నాలుగు చేతులు పుట్టుకొచ్చాయి. అలా తిరిగి తిరిగి చేతులు మొలవడం చూసి లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి కుంభకర్ణుని సంహరించాడు. కుంభకర్ణుడు మరణించటం చూసి వజ్రవేగుడు, ప్రమాదుడు లక్ష్మణుని వైపు దూసుకు వచ్చారు హనుమంతుడు, నీలుడు రెండు కొండలు తీసి వారి మీద వేసారు. వజ్రవేగుడు, ప్రమాదుడు మరణించారు. కుంభకర్ణుడు, వజ్రవేగుడు, ప్రమాదుడు మరణ వార్త విని రావణుడు చాలా చింతించాడు.

లక్ష్మణ ఇంద్రజిత్తుల యుద్ధం:

ఇంద్రజిత్తు తండ్రి బాధ పడటం చూసి " తండ్రీ ! నన్ను యుద్ధానికి పంపండి వానర వీరులను హతమార్చి రామ లక్ష్మణులను బంధించి తెస్తాను " అన్నాడు. మేఘనాధుడిని రావణుడు ఆశీర్వదించి యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్ళి లక్ష్మణుని యుద్ధానికి ఆహ్వానించాడు. ఇంద్రజిత్తు, లక్ష్మణుడు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేసారు. ఇంతలో అంగదుడు విసురుగా వెళ్ళి ఒక పెద్ద చెట్టుతో ఇంద్రజిత్తును మోదాడు. అంగదుని మీదకు ఇంద్రజిత్తు ఒక ఈటెను విసిరాడు. లక్ష్మణుడు దానిని బాణంతో విరిచాడు. ఇంద్రజిత్తు అంగదుని రధాన్ని బాణాన్ని చిత్తు చేసాడు. 

ఆపై ఇంద్రజిత్తు ఆకాశానికి ఎగిరి అదృశ్య యుద్ధం చేస్తున్నాడు. రామ లక్ష్మణులు శబ్ధవేధి బాణాలు ప్రయోగించారు. ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగించి రామ లక్ష్మణులను బంధించాడు. రామ లక్ష్మణులు మూర్ఛిల్లారు. అది చూసి సుగ్రీవుడు, హనుమంతుడు దుఃఖించారు. విభీషణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులను బంధవిముక్తులను చేసాడు. సుగ్రీవుడు విశల్య కరణి అనే ఔషధంతో వారి శరీరంలోని విషాన్ని తొలగించాడు. 

ఈ సందర్భంలోనే , విభీషణుడు రామలక్ష్మణులను చూసి " రామా! కుబేరుడు మీకోసం దివ్యజలాలను పంపాడు. ఈ జలంతో మీ కన్నులను ప్రక్షాళన చేసుకుంటే మీకు అదృశ్యులైన వారు కూడా స్పష్టంగా కనిపిస్తారు. అని దివ్యజలాలను ఇచ్చాడు. రామ లక్ష్మణులు ఆ జలాలతో తమ కన్నులు ప్రక్షాళన చేసుకున్నారు. ఆ జలప్రభావం వలన ఆకాశంలో అదృశ్యంగా తిరుగుతున్న ఇంద్రజిత్తు వారికి కనిపించాడు. 

లక్ష్మణుడు ఒక్క సారిగా విజృంభించి ఇంద్రజిత్తు రెండు చేతులు ఖండించాడు. ఒక బల్లెంతో ఇంద్రజిత్తు తల నరికాడు. కుమారుని మరణ వార్త విన్న రావణుడు తల్లడిల్లి పోయాడు. దీనికంతా కారణం సీతేనని ఆమెను సంహరించబోయాడు. అక్కడే ఉన్న అవింద్యుడు " రావణా! మహేంద్రుని వంటి వారిని జయించిన నీకు ఈ స్త్రీని చంపుట తగదు. నీకు పౌరుషం ఉంటే యుద్ధానికి వెళ్ళి రాముని గెలువు. అంతే కాని స్త్రీ హత్య చేసీ అపనింద తెచ్చుకోకు " అన్నాడు. 

రావణ సంహారం:

అవింద్యుని మాటలతో కొంత కోపాన్ని ఉపసంహరించుకుని యుద్ధసన్నద్ధుడై రాముని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. రామరావణ యుద్ధం మొదలైంది. రావణుని శరీరం నుండి వేలకు వేలు రాక్షస వీరులు పుట్టుకు వస్తున్నారు. వారందరిని రాముడు తన బాణాలతో సంహరిస్తున్నాడు. ఇంతలో మాతలి అనే ఇంద్రుని సారథి వైజయంతి అనే ఇంద్రుని రథాన్ని తెచ్చి రామునకిచ్చి " రామా! ఇది ఇంద్రుని రథం. దీనిని ఎక్కి ఇంద్రుడు ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. నీవు కూడా దీనిని అధిరోహించి యుద్ధం చేసి విజయం సాధించు " అన్నాడు. శ్రీరాముడు సంతోషించి మాతలిని అభినందించాడు. ఆ రథాన్ని ఎక్కి రావణునితో యుద్ధం చేయసాగాడు. రామ రావణులకు భీకరంగా యుద్ధం జరిగింది. బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రాముడు రావణుని సంహరించాడు. 

లోక కంటకుడైన రావణుడు సంహరింపబడటం చూసి మూడు లోకాలు ఉత్సవాలు జరుపు కున్నాయి. అవింద్యుడు విభీషణుడు వెంటరాగా సీతా దేవిని రామునకు అప్పగించాడు. దీన్నే రామాయణ మహాకావ్యంలో చదివితే, మరింత రసరమ్యంగా , ఒక్కో ఘట్టం మన కనులముందు తిరుగుతుంది. ఆ యుద్ధం అసమానసామాన్యంగా దృశ్యమానమై ఉత్కంఠని కలిగిస్తుంది . వీలయితే, ఖచ్చితంగా చదవండి . దీనికోసం రోజులో ఒక అరగంటని కేటాయిస్తే, సరిపోతుది . 

శుభం .

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi