శ్రీ రాముడు పరశురాముడు ఒకే కాలంలో ఎలా ఎదురుపడ్డారు?

18.206.76.226
శ్రీ రాముడు పరశురాముడు ఒకే కాలంలో ఎలా ఎదురుపడ్డారు?
 
శ్రీరాముడు, పరశురాముడు ఇద్దరు కూడా విష్ణుమూర్తి అవతారాలే అని అంటారు కదా? దశావతారాల్లో ఇద్దరూ భాగస్తులే. మరి ఈ ఇద్దరు ఒకే కాలం లో ఎలా ఎదురు పడ్డారు? అని మనలో చాలా మందికి ఒక కుతూహలం ఉంటుంది. ఒకే అవతారం అయినప్పుడు ఒకరి అవతారం అయిన తరువాత ఇంకొకటి రావాలి కదా.. అలా కాకుండా శ్రీ రాముడు ఈ శివ ధనుర్బంగం గావించిన వెంటనే, పరశురాముడు ఎదురైనట్లుగా మనకు వాల్మీకి రామాయణం లో వుంది. ఇది ఎలా సాధ్యం? అని చాలా మందికి ఒక ఆసక్తిదాయకమైన ఒక ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. 
 
మనం,  పెద్దలు చెప్పిన మాటల్లో చెప్పుకోవాలంటే, ప్రతివారు తమ జన్మదినోత్సవం నాడు, ఎనిమిది మంది చిరంజీవుల్ని తలుచుకోవాలని చెబుతారు. 
"అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః 
కృపః పరశురామశ్చ 
సప్తైధా చిరంజీవినః". 
అంటే అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు అంటే కృపాచార్యుడు, పరశురాముడు ఈ ఏడుగురితో పాటు 8వ వాడైన మార్కండేయ మహర్షి ని తలచుకొంటే మనకు కూడా ఆయుర్దాయం పెరిగి, చక్కగా చిరంజీవిత్వం సిద్ధిస్తుంది అని పెద్దల వాక్కు. 
 
మరి అలాంటి పరశురాముడు చిరంజీవిగా ఎలా వుండిపోయాడు? విష్ణువు అవతారం అంటారు కదా. శ్రీమత్ భాగవతం ప్రకారం విష్ణువు అవతారాలు ముఖ్యమైనవి 21. ఏకవింశతి అవతారాలు. ఇవి కాక కొన్ని కొన్ని సందర్భానుసారంగా, అంటే ధ్రువుడిని అనుగ్రహించే సమయం లో అవతారం, దత్తాత్రేయ అవతారం, నర నారాయణ అవతారం, వృషభావతారం ఇలా కాలానుగుణంగా.... నిమిత్తంగా ఒక కారణం తో వచ్చిన అవతారాలతో  కలిపి  దాదాపు మొత్తం 28 అవతారాలు వున్నాయి. ఇందులో ముఖ్యమైనవి 21 అవతారాలు. వాటిలో మరీ ముఖ్యమైనవి, బాగా ప్రాచుర్యం లో ఉండి, చిన్నపిల్లలకు కూడా నేర్పుకొనేవి దశావతారాలు. దశావతారాల మీద ఎన్నో కీర్తనలు, అష్టపదులు, ఎంతో వాఙ్మయం ఉత్పన్నమైంది.  అది అందరకూ తెలిసిన విషయమే. 
 
ఈ దశావతారాలలో పూర్ణావతారం శ్రీ రామావతారం. పరిపూర్ణావతారం శ్రీ కృష్ణావతారం. 
 
వీటిల్లో పరశురామావతారం ఒకటి, శ్రీ రామావతారం ఒకటి. వీటిల్లో కూడా, అంశావతారాలని, లీలావతారాలని, విభూది అవతారాలని ఇలా రకరకాలుగా వున్నాయి. అలా పరిగణించినప్పుడు పరశురామావతారం అనేది ఒక అంశావతారం. అంశావతారానికి వున్న విశేషం ఏమిటంటే, అదీ శాస్త్ర ప్రమాణంగా.... ఎప్పుడైతే వచ్చిన కారణం అంటే, విష్ణువు ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరించి, ఆ విషయం లో తాను పని చేసి ఒక పరిష్కార మార్గం చూపించడానికి ఒక అవతారలక్ష్యంతో అంశగా ఉద్భవిస్తాడు. తనను తానుగా సృజించుకుంటాడు. ఎప్పుడైతే ఆ కార్యం నెరవేరుతుందో, ఆ అంశ అక్కడనుంచి ఉపసంహరింపబడి, ఆ మిగిలిపోయిన ప్రాణి ఒక సాధారణ జీవిగా పరిగణింపబడతాడు. ఇది శాస్త్ర ప్రమాణం. 
 
ఆ రీత్యా, పరశురాముడు ఎప్పుడైతే 21 మార్లు రాజుల మీద దండెత్తి, క్షత్రియ వధ చేసేడో , దాంతో విష్ణువు ఏ ప్రమేయంతో, ఏ ప్రయోజనం కోసం భూమిపై తనను తాను సృజించుకొన్నాడో, పరశురాముడిగా, పరశువును అంటే గొడ్డలిని ఆయుధంగా చేసుకొన్న భార్గవ రాముడిగా, ఆ కార్యం నెరవేరిన వెంటనే ఆ తేజం అందులోంచి వెళ్ళిపోయింది. అటు తరవాత పరశురాముడు ఒక తపస్విగా, ఒక తపోధనుడిగా, ఒక తేజోమూర్తిగా, జమదగ్ని కుమారుడిగా నిలిచిపోయి లోకానికి ఆదర్శం అందించాడు. చిరంజీవిగా వుండిపోయాడు. 
 
పాలకులు ఎలా వుండకూడదో, ఎలా ఉంటే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఎలా నశింపబడతారో, పరశురాముడు దుర్మార్గులైన క్షత్రియుల్ని వధించడం ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తే,  పాలకుడన్నవాడు, రాజ్యాన్ని పాలించే వాడు ఒక ఆదర్శ ప్రభువు ఏ రకంగా నడుచుకోవాలి, లోకానికి ఎలాంటి ఆదర్శాన్ని అందించాలి? ఎలా అందించవచ్చు? సాధారణ మానవుడిగా జన్మించినా కూడా ధర్మమార్గాన్ని విడవకుండా ఎలా నడుచుకోవచ్చు, సత్యానికి ఎలా నిలవవచ్చు అనే విషయాలను ఆచరణాత్మకంగా నిరూపించిన అవతారం ఏదైతే వుందో అది శ్రీ రామావతారం. 
 
రెండు విభిన్న అవతారాలు. ఒకటి పరశురాముడు పరశువు ధరించి క్షత్రియులను 21 మార్లు మట్టు బెట్టి లోకానికి ఒక సుస్థిరత ఏర్పరచాడు. వధించిన క్షత్రియులందరు కూడా అధర్మపరులైన క్షత్రియులు. వైష్ణవాంశ తో వచ్చిన పరశురాముడు ధర్మాత్ములైన రాజులను ఎందుకు శిక్షిస్తాడు? కేవలం వారి పరిపాలన విధానం బాగులేకపోవడం వల్ల, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించకపోవడం వల్ల వచ్చిన చిక్కు వల్ల పరశురాముడు వాళ్ళను వధించి, లోకానికి ఒక సమతూల్యాన్ని తీసుకువచ్చాడు. అప్పుడు రామావతారం వచ్చింది. అప్పటికే ఇక్ష్వాకు వంశంలో మహా తేజో సంపన్నులు, మహానుభావులైన రాజులు పరిపాలించడం జరిగాక రాముడు ఆ వంశంలో జన్మించి, అసలు రాజు అన్నవాడు మాత్రమే కాదు, తల్లి తండ్రుల పట్ల ఒక కుమారుడు ఎలా ఉండాలి? అన్నదమ్ములతో ఒక సోదరుడు ఎలా ఉండాలి? గురువుల పట్ల శిష్యుడు ఎలా ఉండాలి? పెద్దల పట్ల అణకువతో, వినయ విధేయలతో ఎలా నడుచుకోవాలి? తల్లి తండ్రులతో ఎలా మాట్లాడాలి? భార్యతో ఎలా మెలగాలి? రాజు ప్రజలని బిడ్డలుగా ఎలా పరిపాలించాలి? ఇలాంటివన్నీ చెప్పడానికి ఒక ఆదర్శమూర్తిగా, మర్యాదా పురుషోత్తమునిగా శ్రీ రాముడు అవతరించాడు. 
 
కాబట్టి పరశురాముడు, రాముడు ఎదురయ్యారు అంటే అదేదో జరగలేని విషయం, లేదా పుక్కిటి పురాణమో, అహేతుకమైనదో కాదు. అది అంశావతారం. ఇది పూర్ణావతారం.  శాస్త్ర ప్రమాణంగా అంశ అవతారం లో అంశ ఎప్పుడైతే  కార్యం  నెరవేరాక వెళ్లిపోతుందో, ఆ ప్రాణి మామూలు సాధారణ ప్రాణి గానే పరిగణింపబడతాడు. పరశురాముని విషయంలో అదే జరిగింది. అందుకే పరశురాముడు నేటికీ కూడా చిరంజీవిగా ఉండి  ఈ లోకం లోనే ఇక్కడే సంచరిస్తూ ఉంటాడు. అలాంటి మహానుభావులందరిని తలుచుకొని నమస్కరించుకొందాం. 
 
- సాయి ప్రసన్న రవిశంకర్.

Quote of the day

Nirvana is not the blowing out of the candle. It is the extinguishing of the flame because day is come.…

__________Rabindranath Tagore