బదిలీల దేవుడి గురించి విన్నారా ?

54.174.225.82

వీసాల దేవుడి గురించి విన్నారు, బదిలీల దేవుడి గురించి విన్నారా ?
సేకరణ: లక్ష్మి రమణ  

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పేరుచెబితే, పూతరేకులు గుర్తుకొచ్చి నోరూరిపోతుంది . ఆ కోనసీమ అందాలు తలుచుకుంటే, మాది పులకించిపోతుంది. అలా పులకింపజేసి, మాయలో పడేసే మహత్తు ఇక్కడి జగన్మోహినిదే అని స్థానికుల విశ్వాసం. నిజంగానే, కొన్ని తేనె  చుక్కలు , ఇన్ని పూలరేకులూ కలిసిన సొబగులు ఈ విశ్వమోహిని సొంతం మరి. అదలా ఉంచితే, ఈ జగన్మిహినిని దర్శించుకుంటే, ప్రత్యేకించి భార్యోకచోట , భర్తోకచోటా ఉద్యోగాలు చేస్తున్నవారు, దర్శించుకుంటే,  బదిలీలు సులువుగా జరుగుతాయట . బాగుందికదూ ! రండి మరిన్ని విశేషాలు చదువుకుందాం . 

గోదావరి జిల్లా ప్రాంతంలో ఆత్రేయపురం జిల్లలో  ర్యాలీ అనే గ్రామం ఉంటుంది . (రాలి-అంటేపడిపోవటం.అదేమార్పుచెంది 'ర్యాలి' గామారింది' )  ఈ ప్రాంతాన్ని పూర్వం 'రత్నపురి' అని పిలిచేవారు. భాగవత కధ ప్రకారం. దేవతలు, దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. వాసుకి అనే పాముని తాడుగా, మంధర గిరిని కవ్వంగా చేసుకుని, తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు నిలబడి సముద్రాన్ని చిలికారు. అందులోంచి చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, విషం... ఇలా వరుసగా వచ్చిన తరువాత చిట్టచివరకు ధన్వంతరి అమృతకలశంతో ప్రత్యక్షమయ్యాడు.

దేవదానవులిరువురూ దాని కోసం పోటీ పడుతుండగా, విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి, అమృతం దానవులకి అందకుండా దేవతలకు మాత్రమే అందజేసి ముందుకు నడుస్తుండగా, వెనుకనుంచి విష్ణువుని చూసి జగన్మోహినిగా భ్రమచెందిన శివుడు విష్ణుమూర్తి చెయ్యిపట్టుకోగానే ఉలికిపాటుతో విష్ణువు వెనుకకు తిరిగాడు. ఆ సమయంలో సిగలోంచి ఒక పువ్వు రాలిపడింది. ఆ కారణంగా ఆప్రాంతానికి 'ర్యాలి' అని పేరు వచ్చిందని స్థలపురాణం. విష్ణువుని చూసిన శివుడు స్థాణువులా నిలబడిపోయాడని అందుకే శివాలయం, వైష్ణవాలయం ఎదురెదురుగా ఉంటాయని స్థానికులు చెప్తారు. అలా వెనుకకు తిరిగిన విష్ణుమూర్తి ముందువైపు పురుషుడిగానూ, వెనుక జగన్మోహిని రూపంలోనూ ఉంటాడు.

స్వామి మూలమూర్తి పూర్తిగా  ఏకశిలా విగ్రహం. సాలగ్రామ శిల. ఈ విగ్రహం పొడవు ఐదు అడుగులు. వెడల్పు మూడు అడుగులు. గొల్ల దగ్గరనుండీ, జగన్మోహిని కేశములు వరకూ ఆ స్వామీ నిజంగా నిలిచినట్టే ఉంటుంది. అద్భుతమైన రూపురేఖా విలాసాలు, అంతకుమించిన అనుగ్రహదీప్తి ఇక్కడి క్షేత్రంలో నిబిడీకృతమై ఉంది . ఈ విగ్రహం పాదాల దగ్గర నుంచి, నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది. అది 'విష్ణు పాదోధ్బవియైన గంగ' అనే ఆధ్యాత్మిక నమ్మకం. ఆమాట పక్కన పెడితే,, శిలల్లో 'జలశిల' అనే దాన్నుంచి నీరు నిరంతరం విష్ణుమూర్తి పాదాలను కడుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం. గుడిప్రాంగణమంతా దశావతారాలకి సంబంధించిన శిల్పాలు కొలువై ఉన్నాయి.

ర్యాలి ప్రాంతం 11వ శతాబ్ది సమయంలో పూర్తిగా అరణ్యం. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళ చక్రవర్తి రాజా విక్రమ దేవుడు, ఈ ఆలయాన్ని నిర్మించాడు. తరువాతి రోజులలో దీనిని పునరుద్ధరించారు.

తిక్కన చెప్పినట్లు ఇక్కడ హరిహరనాధ తత్వం కనిపిస్తుంది. విష్ణుమూర్తి జగన్మోహినీకేశవస్వామిగాను, శివుడు ఉమాకమండలేశ్వరుడుగాను భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠచేసేటపుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలంతో మంత్ర పూతం కావించాడని స్థలపురాణం. అదే విధంగా జగన్మోహినీకేశవస్వామి విగ్రహాన్ని కూడా మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించారని చెబుతారు. గుడిలోని పూజారులు నూనె దీపం సహాయంతో విగ్రహం గురించి వివరిస్తూ అణువణువూ చూపిస్తారు. నల్లరాతి విగ్రహాన్ని దీపం సహాయంతో చూస్తే విగ్రహం అందం రెట్టింపవుతుంది.

ప్రత్యేకత :

ఇక్కడ తలలో పువ్వు పోగొట్టుకున్న జగన్మోహిని, బదిలీ కోరిన భక్తుల కోర్కెను ఇట్టే తీరుస్తుందని భక్తుల విశ్వాసం.  చెరొక చోట ఉద్యోగం చేసే భార్యాభర్తలను ఒక చోటికి చేర్చడంలో ఈదైవంచూపే కారుణ్యం కొనియాడదగినది.  బదిలీ కావాలనుకున్నవారు ఈ దేవుణ్ణి సందర్శిస్తే తమ కార్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.

ఇలా వెళ్ళాలి 

ర్యాలి వెళ్ళడానికి ప్రత్యేకమైన ప్యాకేజీలు లేవు. రాజమండ్రి అతిదగ్గరి రైల్వేస్టేషన్‌. మధురపూడి(రాజమండ్రి దగ్గర) అతి దగ్గరి విమానాశ్రయం. రావులపాలెం దాకా బస్సులు దొరుకుతాయి. అక్కడి నుండి ఆటోలు గాని, టాక్సీల ద్వారాగాని ర్యాలి చేరుకోవాలి. రోడ్డుకిరువైపులా పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం, ఇలాంటి అనుభూతుల్ని మనం సొంతం చేసుకోవచ్చు.
ర్యాలి సందర్శనంతో పాటు వాడపల్లి వెంకటేశ్వర స్వామిని, పంచారామాలలోని నాలుగు ఆరామాలు సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం కూడ కలుపుకోవచ్చు. అలాగే పక్కనే ఉన్న అంతర్వేది, కోటిపల్లి, ధవళేశ్వరం బ్యారేజి, రాజమండ్రిలోని మార్కండేశ్వర స్వామి గుడి, కోటి లింగాలరేవు, సారంగధర మెట్ట కూడ కలుపుకుంటే గోదావరి నదీతీర ప్రాంతంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాన్ని చూసినవాళ్ళం అవుతాం.!

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya