Online Puja Services

పూర్ణావతారానికి అంశావతారానికి ఉన్న తేడా

3.137.171.121

పూర్ణావతారానికి అంశావతారానికి ఉన్న తేడా ఏమిటి?
- లక్ష్మి రమణ 

విష్ణుమూర్తి ఈ జగతిని ఉద్ధరించడానికి అనేకానేక అవతారాలు తీసుకున్నారు. ఆ అవతారాలలో బాగా ప్రాచుర్యంలో దశావతారాలు. అయితే, ఇలా ఆ శ్రీ మహా విష్ణువు ఎత్తిన అవతారాలలో కొన్ని అంశావతారాలు , మరి కొన్ని పరిపూర్ణమైన అవతారాలు  అని మనం పెద్దల ప్రవచనాలతో , ధార్మిక గ్రంధాలలో చూస్తూ ఉంటాము . ఈ రెండింటికీ మధ్య భేదం ఏమిటసలు ?

శ్రీహరి  ఈ భువి మీద అవతరించిన ప్రతిసారి జగతికి ఒక మార్గనిర్దేశనం చేశారు.  ఆ విధంగా త్రేతాయుగంలో పరమాత్మ శ్రీరామ చంద్రునిగా అవతరించారు .  అదే అవతార విశేషంలో మనకి పరశురాముడు కూడా దర్శనమిస్తారు . ఈ రెండు అవతారాలలో  శ్రీరామ అవతారం పూర్ణావతారం కాగా, పరుశురామావతారం అంశావతారం. 

సాధారణంగా పరమాత్మ ఒక అవతారాన్ని చాలించాక మరో అవతారం తీసుకున్నారు . కానీ శ్రీరాముని దివ్య ఇతిహాసం రామాయణంలో మనకి శ్రీహరి దాల్చిన రెండు అవతార విశేషాలు కనిపిస్తాయి . వీరిద్దరూ శ్రీమద్రామాయణంలో ఒకరికొకరు ఎదురుపడతారు కూడా.

అంశావతారము తాను ఉద్భవించిన ప్రయోజనం తీరిన తరువాత ఒక సాధారణ ప్రాణితో సమానమవుతుందని శాస్త్ర ప్రమాణం.  అందువల్ల శ్రీరాముని ఎదుటపడిన పరుశురాముడు భంగపడి వెనక్కి తిరగడం జరిగింది. అంతేకాక పరశురాముడు, శ్రీరాముడు ఉద్భవించిన ఆయా కాల సందర్భాలు వాటి పరిమితులు ప్రయోజనాలు కూడా విభిన్నమైనవి. 

అధికార దర్పితులై, అహంకరించి, మదించి దురహంకారులైన ప్రభువులను శిక్షించి, భూత, భవిష్యత్తు, వర్తమానాలలోని పాలకులకు గుణపాఠం నేర్పించవలసిన గుణపాఠం నేర్పించడానికి దాల్చిన అవతారం పరుశురాం అవతారం. భగవానుడు ఒక అంశా మాత్రంగా అవతరిస్తే ఎంతటి విధ్వంసాన్ని, ఎంతటి శిక్షణ అని ఎటువంటి పాలనని చేయగలడో పరశురామ అవతారం కళ్ళకి కడుతుంది. 

 రామావతారం అలా కాదు.  లోకానికి ఒక ఆదర్శ మానవుడి జీవితాన్ని సోదాహరణంగా చూపడానికి భావితరాల మానవులకు మార్గ  నిర్దేశికమైనటువంటి మహోన్నత మానవ జీవిత ఆదర్శాలను ఆచరించి చూపించడానికి ఏర్పడింది రామావతారం. దుష్టశిక్షణ తర్వాత శిష్ట రక్షణ చేసి, సుస్థిరమైన సామ్రాజ్యాన్ని స్థాపించడం అవసరం . అటువంటి   పరిపాలకుడిగా , పృద్వికి సుస్థిరతనిచ్చింది రామావతారం. పరశురామ విధ్వంసకాండ తర్వాత , ప్రజారంజక పరి పాలకునిగా, రక్షకునిగా వచ్చిన శ్రీరామ చంద్ర ప్రభువు ప్రభువులు ఎలా ఉండాలో చూపించారు . 

  ప్రపంచానికి రెండు అవసరమే పరుశురాముడు చేసిన వినాశనంలో నుంచి శ్రీరాముడు ప్రభావించాడు.  దుష్ట పాలకులను రూపుమాపిన వాడు పరశురాముడు, ఆదర్శ పరిపాలకుడుగా రూపొందిన వాడు శ్రీరాముడు.  పరశురాముడు చిరంజీవిలలోనివాడు కావడం వల్ల అతని అవతార ప్రయోజనం నెరవేరిన తరువాత కూడా అతడు జీవించి ఉన్నాడు . అంశావతారి  అయిన పరుశురాముడు అతని అవతార ప్రయోజనం తీరిన తరువాత చిరంజీవిగా ఉండి శ్రీరాముడికి ఎదురయ్యాడు. 

 ఒక అంశావతారం తాను ఉద్భవించిన ప్రయోజనం తీరిన తరువాత ఒక సాధారణమైనటువంటి ప్రాణితో సమానం అవుతుందని శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి పరశురామావతార లక్ష్యం నెరవేరిన తరువాత, అతడు కేవలం ఒక విప్రుడు, ఒక తపస్వి, ఒక ప్రభావ సంపన్నుడు, తేజస్సాలి మాత్రమే.  ఆ సమయంలో విష్ణుమూర్తి యొక్క మరొక అవతారమైన శ్రీరామావతారం ఏర్పడడం అసంబద్ధం ఏమీ కాదు.  పరశురాముడిగా శ్రీమహావిష్ణువు దుష్ట నిర్మూలనం చేశారు.  దుష్ట వినాశనం తరువాత జరగాల్సింది ప్రపంచాన్ని సువ్యవస్థీతం చేయడం చెడును అంతం చేసిన తరువాత మంచిని తిరిగి ప్రోది చేయడం, సంస్థాపించడం ,ఉత్తమ వ్యవస్థలను నెలకొల్పడం జరగాలి . శ్రీరామ అవతారంలో అదే జరిగింది పరశురామావతార లక్ష్యం నెరవేరాక జరగాల్సిన కార్యాలను పూర్ణుడై పరమాత్మ తీసుకున్నటువంటి శ్రీరామ అవతారంలో నెరవేర్చారు. 

 పరశురాముని గాధ బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మపురాణంలో,  వ్యాస మహాభారతంలో, వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. సూర్య సావార్ణిక మన్మంతరంలోని సప్త మహర్షులలో పరశురాముడు ఒకరు. 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda