పద్మనాభస్వామి ఆలయం

35.172.203.87

విష్ణుమూర్తిని వివిధ రూపాలలో స్తుతిస్తూ 12 మంది ఆళ్వారులూ తమ రచనలైన పాశురాలలో ప్రస్తుతించిన క్షేత్రాలను " వైష్ణవ దివ్యదేశాలు " అని అంటారు..

ఇవి 108. మన హిందువులు అతి పవిత్రంగా  భావించే ఈ క్షేత్రాలలో ప్రముఖమైనది తిరువనంతపురంలోని " అనంత పద్మనాభ స్వామి ఆలయం. "

కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయంలో విష్ణుమూర్తి నాభియందు పద్మంతో  అనంతుడనే సర్పంపై నిద్రించిన శయనరూప భంగిమలో దర్శనమిస్తాడు మనకి. 

పురాణకాలం నుండి ప్రసిద్ధమైన ఈ ఆలయఅన్ని క్రీ.శ 1568 లో ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండ వర్మ తిరిగి పునర్నిర్మించారు.

7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయం కేరళ మరియూ ద్రావిడ నిర్మాణ శైలి యొక్క మేలు కలయికతో నిర్మించబడింది. వంద అడుగుల ఎత్తుకలిగిన తూర్పు రాజ ద్వారంలలోని ఏడు అంతస్థులలో పూర్తిగా విష్ణు పురాణ గాధలను తెలిపే శిల్పాలతో నిండి ఉంటుంది..

ఈ ఆలయంలోని గర్భాలయాన్ని చుట్టివున్న శ్రీ బలి పుర మండపం 365 స్తంభాల మీద నిర్మించబడినది. ఒక్కో స్థంభానికి ఒక్కో దీప కన్య ఆనుకుని స్వాగతం చెప్తున్నట్లుగా చెక్కారు వీటిని. వీరి చేతిలోని ప్రమిదలలో నూనె  పోస్తే  నాలుగు గంటల దాక దీపం వెలుగుతుంటుంది.. ఈ దీపపు కన్యల ఏ రెండు శిల్పాలూ ఒకేలా ఉండకపోవడం ఇక్కడో విశేషం.

అది దాటి లోపలకి వెళ్తే ఎడమవైపున ఇరవై ఎనిమిది స్తంభాల మీద నిర్మించబడిన "కులశేఖర మండపం" అద్భుత శిల్పాలతో నిండి ఉంటుంది.. ఏక శిల మీద చెక్కిన ఒక గుత్తిలాగా , ఒకే స్తంభం లాగా ఉండే సన్నని స్తంభాలను తట్టితే సప్త స్వరాలను పలుకుతాయి అవి.

అది దాటి ముందరకు వెళ్తే " ఒట్టుక్కాల్ మండపం " పైనుండి మూడు ద్వారాల ద్వారా అనంతపద్మనాభ స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది.

ఈ ఆలయంలోని గర్భగుడిలోని మూల విరాట్ ను 1208 సాలగ్రామాలతో తయారు చేసారు.

తమిళనాడులోని శ్రీరంగంలోని రంగనాధుడు , కుంభకోణంలోని సారంగపాణి దేవాలయాలలోని మూలవిరాట్ విగ్రహాలు కూడా ఇదే తరహా ఉన్నా వాటిన్నిటికన్నా ఈ ఆలయంలోని విగ్రహం చాలా పెద్దది.

అనంత శేషుడు తన శరీరాన్ని మూడుచుట్లుగా చుట్టి, తన అయిదు శిరస్సులను ఛత్రంగా చేసిన పాన్పు మీద శ్రీ పద్మనాభుడు అనంతశయనునిగా దర్శనమిస్తాడు ఇక్కడ.

జీవుల యొక్క జననం , స్థితి , మరణం అనే మూడు ప్రముఖ దశలకూ సంకేతంగా చెప్పబడే ఆ మూడు ద్వారాలలో మొదటి ద్వారం గుండా తన సుందర ముఖారవిందాన్ని,  చేతిలో శివలింగాన్ని , మధ్య ద్వారం ద్వారా నాభి కమలంలో ఉపస్థితుడైన విధాతను , ఉత్సవ మూర్తులను, ఆఖరి ద్వారం నుండి బ్రహ్మ కడిగిన శ్రీవారి దివ్య పాదపద్మాలను భక్తులకు కన్నుల పండుగగా దర్శనం ప్రసాదిస్తారు.  

నిజంగా ఈ స్వామి యొక్క ఆ దివ్య మంగళరూప దర్శనం ఓ గొప్ప అనుభవం.

ఐహిక, లౌకిక భావనలను మైమరపించేంత గొప్ప అనుభూతి కలుగుతుంది ఆ స్వామి దర్శనం వల్ల
అంచేతనేనేమో అనేకమంది రాజులు కొన్ని లక్షల విలువైన బంగారు ఆభరణాలను , విలువైన వజ్రాలనూ ఇంకా అనేకానేక విలువైన వస్తువులనూ ఈ స్వామికి సమర్పించి తాము ఈ స్వామి దాసులమని ప్రకటించుకున్నారు. 

ఆ అపారసంపదంతా గర్భాలయం వెనుకున్న మండపంలోని కొన్ని గదులలో ఉంది.. యూట్యూబ్ లోనూ మీడియాలలోనూ చూపించినంత భయంకరంగా ఆ గదులేవీ లేవు. సాధారణ ప్రజలకీ , భక్తులకీ వాటి సందర్శనకు అనుమతి లేదు భద్రతాపరమైన కారణాల వల్ల. ఆ ఆభరణాలలో కొన్నిటిని ప్రత్యేక ఉత్సవాలప్పుడు మాత్రమే వినియోగిస్తారట.

భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంది ఈ ఆలయంలో. వీరు సాంప్రదాయలను చాలా నిక్కచ్చిగా పాటిస్తారు.

పురుషులు పంచె కండువా , స్త్రీలు సాంప్రదాయ దుస్తులతో మాత్రమే దర్శనానికి వెళ్ళాలి.

మొబైల్ అనుమతి లేకపోవడం వల్ల ఈ ఆలయానికి నేను వెళ్ళినప్పుడు ఎక్కువ ఫొటోలు తీయలేదు..

కొన్ని కొన్ని అనుభూతులు , అందాలూ కళ్ళతో చూసి మనసులో ముద్రించుకోవలసిన విషయాలే తప్ప యాంత్రికతతో వాటిని బంధించాలని చూస్తే ఆ అనుభూతి అందదు. 

మన భారతీయ ప్రాచీన సంఘ వైభవానికీ, అప్పటి ప్రజల కళాత్మక , ఆధ్యాత్మిక దృష్టికీ మచ్చుతునకగా ఉండే ఈ ఆలయాన్ని అవకాశం ఉంటే కనుక తప్పకుండా సందర్శించండి.

- కోట సత్య సూర్యనారాయణ శాస్త్రి

Quote of the day

We live in a wonderful world that is full of beauty, charm and adventure. There is no end to the adventures that we can have if only we seek them with our eyes open.…

__________Jawaharlal Nehru