కిరాతుని పూర్వజన్మ

3.236.253.192

వైశాఖ_పురాణం 23 వ అధ్యాయము


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||

కిరాతుని పూర్వజన్మ

నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమ నిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతము నిట్లు వివరించెను.

కిరాతుడు శంఖునితో నిట్లనెను.. మహామునీ! దుష్టుడనగు నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడితిని. మహాత్ములు,సజ్జనులు సహజముగనే దయా స్వభావులు కదా... నీచమైన కిరాత కులమున పుట్టిన పాపినగు నేనెక్కడ..? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ది కలుగుటయేమి? ఇట్టి యాశ్చర్య పరిణామమునకు మహాత్ములగు మీ యనుగ్రహమే కారణమని యనుకొను చున్నాను. సజ్జనులను, పాపములను కలిగించు హింసాబుద్ది నాకు మరల కలుగకుండ జూడుము. సజ్జనుల తోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా! ఉత్తముడా..! నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను జూపుము. జ్ఞానీ! పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా.! సమచిత్తులు, భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అను భేదముండదు కదా! ఏకాగ్రతతో చిత్తశుద్దిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను, దుష్టులైనను చెప్పుదురు కదా!

గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మంద బుద్ధులను తరింప జేయు స్వభావము కలవారు కదా! దయాశాలీ! సజ్జనుడా! నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యము నంది, నీకు విధేయుడనగుట వలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయ జూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించెను.

శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది యంతయును వైశాఖ మహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి యిట్లనెను.

కిరాతుడా! నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖ ధర్మముల నాచరింపుము. ఈయెండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు, నీడ లేవు. నేనిచట నుండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచటకు పోయి నీటిని త్రాగి నీడ యందుండి సర్వ పాపనాశకమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను, నేను చూచిన దానిని, విన్న దానిని నీకు వివరింతును అని పలికెను.

అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామీ! యిచటకు కొలది దూరమున స్వచ్చమైన నీరున్న సరస్సు కలదు. అచట మిగుల మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు యెన్నియో యున్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగ నుండును. అచటకు పోవుదము రమ్మని శంఖుని అచటకు గొని పోయెను. శంఖుడును కిరాతునితో గలసి వెళ్ళి యచట మనోహరమగు సరస్సును జూచెను. ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జల పక్షులతో కూడి యుండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షము లెక్కువగా నుండుటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు, చేపలు మున్నగు జలప్రాణులతో నా సరస్సు కూడి యుండెను. కలువలు, తామరలు మున్నగు జల పుష్పములతో నిండి మనోహరమై యుండెను. వివిధములగు పక్షులచట వ్రాలి మధురముగ కిలకిలారావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగ నుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగ మనోహరములై యుండెను. అడవి జంతువులును అచట స్వేచ్చగ తిరుగు చుండెను. ఇట్టి మనోహరమైనసరస్సును జూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేద తీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు నా సరస్సున స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగ కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల జూచి యిట్లనెను.

నాయనా! కిరాతా! ధర్మతత్పరా! నీకే ధర్మమును చెప్పవలెను? బహు విధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగ నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వాని నాచరించిన సర్వ ప్రాణులకు ఇహికములు, ఆయుష్మికములు నగు శుభలాభములు కలుగును. నీకే విధములగు ధర్మములు కావలయునో అడుగుమని పలికెను.

అప్పుడు కిరాతుడు స్వామీ! అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మ నాకేల కలిగెను? ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని యడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై యుంది యిట్లనెను.

ఓయీ! నీవు పూర్వము శాకల నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు. శ్రీవత్సస గోత్రుడవు. వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు  కాంతిమతి. ఆమె సుందరి, యుత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్య యందు మనసు పడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె నాచార విహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతి యగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో నుండెడిది.

ఆమె నీకును నీ వుంచుకున్న వేశ్యకును అనేక విధములగు సేవలను ఓర్పుగా శాంతముగ చేసెడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రత యగుటచే భర్తకును, భర్త కిష్టురాలగు వేశ్యకును బహు విధములగు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగ చాల కాలము గడచినది.
ఓయీ కిరాతా! ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు నాహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యము కలిగెను. రోగి, ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరియొకనితో బోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది. నీవును పశ్చాత్తప పడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమియు చేయలేక పోతిని. అనుకూలవతి యగు భార్యను సుఖపెట్టలేని వాడు పది జన్మలు నపుంసకుడై పుట్టును సుమా! నీవంటి పతివ్రత నవమానించిన నేను పెక్కు నీచ జన్మల నందుదును. అని యనేక విధములుగ నామెతో బలికితివి. ఆమెయు 'నాధా! నీవు దైన్యము వహింపకుము. చేసిన దానికి సిగ్గు పడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహు విధములుగ బాధించును. వానిని సహించిన వారుత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును. దాని ఫలమిది యని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగ భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్దలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరిని ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. పది శనివారము లుపవాసమును చేయుదును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహు విధములుగ చాలా మంది దేవతలకు మ్రొక్కుకొనెను.

ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున నామె యింటికి వచ్చెను. అప్పుడామె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిధిని పూజించినచో నీకు మంచి కలుగునని యామె తలచెను. నీకు ధర్మ కార్యములనిన యిష్టము లేకపోవుటచే నామె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీచేత నామె పానకము నిప్పించెను. నీయనుజ్ఞతో దానును యిచ్చెను. మరునాటి యుదయమున దేవల ముని తన దారిని తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్య వ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి గాని యిన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్భుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్ని ప్రవేశమును సహగమనమును చేసెను.

నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత యగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకము నిచ్చుట వలన దేవలుని పాదములను కడుగుట వలన నామెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడను కొనియు పానకము నిచ్చుటచే నిప్పుడు నన్ను వైశాఖ ధర్మములడుగ వలెనను మంచిబుద్ది కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున జల్లు కొనుటచే నీకు నాతో నీవిధముగ సాంగత్యము చేయు నవకాశము కలిగినది. కిరాతా! నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలిసి కొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రత నాచరించుట వలన కలిగినది. నీకింకను యేమి తెలిసికొనవలయునని యున్నదో దాని నడుగుము చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను.

వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణము...

- పాత మహేష్  

 

 

Quote of the day

Buddhas don't practice nonsense.…

__________Bodhidharma