Online Puja Services

మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవాలయం ఆలయ చరిత్ర

18.188.20.56

 

పల్నాటి ప్రజల ఆరాధ్య దైవం మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవాలయం ఆలయ చరిత్ర:
స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా ప్రత్యేక కధనం


ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంత మాచర్లలో వెలసిన గొప్ప చారిత్రక నేపధ్యం కలిగి ప్రసిద్ది గాంచిన ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవాలయం గురించి తెలుసుకుందాం 

త్రేతాయుగంలో మన మాచర్ల ప్రాంతం దండకారణ్యం గా ఉండేది.అప్పుడు మాచర్ల ని విష్ణుపురి అని పిలిచేవారు.బ్రహ్మానాయుడు స్వస్తలం మాచాపురం పేరు మీదుగా మాచర్ల పట్టణం నిర్మించాడని కూడా చెపుతారు.కొన్నాళ్లు మాహాదేవి చర్ల గా కూడా వాడుకలో ఉండి క్రమేణా మాచర్ల గా ప్రసిద్ది కెక్కింది.ఆలయం ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా,మాచర్ల లో 13 వ శతాబ్దంలో కార్త్యవీరార్జునుడునిర్మించాడు.కాల క్రమేణా ఆదిత్యుడు మరియు రెడ్డి రాజు అయిన పేరూరి ముక్తిరాజు లు ఆలయాన్ని పునరుద్దించారు. ఆ తరువాత బ్రహ్మనాయుడు ఈ ఆలయాన్ని బాగా అభివృద్ది చేసాడు.


మొదట శైవ దేవాలయంగా ఉండేదని చారిత్రక కధనాలు ఉన్నాయి.. ఈ దేవాలయం బ్రహ్మనాయుడు కాలంలో వైష్ణవ దేవాలయంగా మార్చబడినది. దీనికి ప్రధాన కారణం అనేక మంది హిందువులు వైష్ణవ మరియు శైవ మతములను విడిచి పెట్టి బౌద్ధ మతంలో చేరుతుండేవారు. ప్రజలు ఈ మత మార్పిడులను అర్థం చేసుకొనుటలో వివాదాలు ఎదుర్కొండేవారు. ఈ సమయంలో ఆదిశంకరాచార్యులు అద్వైత మతాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం దేవుడు ఒక్కడే మరియు దేవుడు నీలోనే ఉన్నాడు అనే భావన ప్రబలినది. ఈ భావనల తరువాత హిందూ మతం నుండి బౌద్ధమతానికి వెళ్ళిపోయిన వారు తిరిగి హిందూ మతంలోనికి చేరి భౌద్ధ మతం భారత దేశంలో అంతరించిపోయినది. శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయం ఆలయంలో ప్రధాన దేవతా మూర్తులు చెన్నకేశవ స్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవారు.. ఇది సుమారు 13 వ శతాబ్దంలో నిర్మించబడినది

 

. విష్ణుమూర్తి కి మారు రూపు గా ఉండే చెన్నకేశవుడు ని దర్శించిన వారికి సకల పాపాల హరించుకుపోయి,ముక్తి లభిస్తుందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.పల్నాటి వీర చరిత్ర రాసిన మహాకవి శ్రీనాధుడు స్వామి వారిని దర్శించగా ఆయన శరీర రుగ్మతలు అన్ని తొలగిపోయినట్లు చాలా గొప్ప మహిమ గల దేవుడు అని తన గ్రంధంలో రాసుకున్నాడు. 


చెన్నకేశవస్వామి వారి వారి రూప వివరణ:


స్వామివారి మూల విరాట్టు మూడు అడుగుల ఎత్తు కలిగి,నాలుగు చేతులతో శంకు,చక్ర,గధాయుధాలు ధరించి ముఖాన తిరుమణి చూర్ణరేఖలు, శిరమున కిరిటం ధరించి ముడి వేసిన కేశములు కలిగి,పల్నాడు పౌరుషాగ్నిని పోలిఉండేలా మీసకట్టు కలిగి ,అద్బుతమైన విశాల నయనాలతో, వక్షస్థలమందు స్వర్ణకవచ ధారణతో,మెడలో పుష్పాల హారంతో,పాదములకు పావుకోళ్లు(చెక్కతో చేసిన పాదరక్షలు ధరించి) వెండి మకర తోరణమందు అతి సుందరంగా కనిపిస్తారు.


స్వామి వారి రూపం వర్ణింప కవి పుంగవులకు సాధ్య పడదు,నాకు తెలిసిన భాషలో వర్ణన ఇచ్చాను,ఒక్కసారి స్వామి వారి దివ్యరూపం చూస్తే మనస్సునందు శాశ్వతంగా నిలిచేలా ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్విత దైవంగా శతాబ్దాలుగా స్వామి వారిని పూజిస్తూ పలనాడు ప్రజలు తరిస్తున్నారు.


అతి పురాతన చారిత్రక,పౌరాణిక చరిత్ర గలిగిన గొప్ప దేవాలయం.చంద్రవంక నదీతీరాన ఉన్న ఈ ఆలయం గొప్ప చారిత్రక సంపద కలిగి భక్తుల పాలిటి కొంగు బంగారం లా వెలసిల్లింది. అన్ని నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తాయి చంద్రవంక మాత్రం తూర్పు వైపు నుండి ఉత్తర,పడమర దిక్కులో ప్రవహించటం కూడా ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. ఆలయం ఎదురుగా పురాతన గరుడ స్తంబం,దాని పక్కనే కళ్యాణ మండపం ఉంటాయి,అత్యంత పురాతన గాలి గోపురం కనువిందు చేస్తుంది,ఆగోపురంపై చెక్కిన శిల్పాలు ఆనాటి శిల్పుల నైపుణ్యం తెలియచే స్తుంది. శా.శ.1566/ క్రీ.శ 1644 త్రిపురాంతకపురంకు చెందిన పాలుట్ల తిరుపతయ్య కుమారుడు ఓబన్న గుడి ముందు బయట ధ్వజస్థంభం ప్రతిష్టించినారు. ఈ ఆలయంలో మంటప స్థంభాలు చోళరాజుల కాలంనాటి శిల్పకళాశోభకు సాక్ష్యాలు. గా నిలుస్తాయి.

 

ఆలయం బయట గరుడ ధ్వజ స్థంభాన్ని ప్రతిష్ఠించు సమయంలో దాని పై భాగం కొంత విరిగింది. ఆ విరిగిన భాగమును దేవలయ ఆవరణ లోపన ధ్వజస్థంభం పక్కన ప్రతిష్టించారు. దీనిని కప్పక స్థంభంగా పిలుస్తారు. దీని చుట్టూ ప్రదక్షణలు చేస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం.

 

గాలి గోపురం క్రింద ఇరువైపులా ద్వారానికి జయ,విజయుల శిల్పాలు అతి మనోహరంగా ఉంటాయి.ఆలయం లోపల పంచలోహ ద్వజస్తంబం ను నమస్కరిస్తే చెన్నకేశవ కృప లభిస్తుందని చెపుతారు. ఆలయంలొకి ప్రవేశించి ఎదురుగా గరుడా ఆళ్వార్ స్వామి కనిపిస్తారు.తాయారు అమ్మవారు విగ్రహంకూడా భక్తి భావం మరింత పెంచతాయి.


దేవాలయ రాతి స్తంభాలపై రామాయన,మహాభారత గాధలు చిత్రాలు చెక్కబడి ఉంటాయి.చెన్నకేశవ స్వామి ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో మునిగి పోతారు,ఆ దివ్య మంగళ రూపంచూడ టానికి రెండు కళ్లు చాలవు.ఆయనను చూడడం బహు జన్మల పుణ్యఫలం.ఆయన్ను చూసిన తదేకంలో ఓం చెన్నకేశవాయ:,మంగళాయ:నమో స్తుతే అంటూ మైమరిచి పోతారు.

నాగశిలాస్థంభ శాసనం:

తెల్లని పాలరాతిపై నాగశిలాస్థంభ శాసనం శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి దేవాలయం దక్షణంలో గిరేశ్వరాలయం ముందు నాలుగు వైపులా 94 వరసలతో చెక్కబడిన ఈ శాసనం నేటికి వుంది. ఈ శాసనంను శా.శ 1033(క్రీ.శ 1111) మేడాంబిక కుమారుడు వారకాముడు పరిపాలన కాలంలో శ్రీధరుడు-భోగమాంబిక కుమారుడు ఆదిత్యడనునతను మహాదేవితటాక(మాచర్ల)యను పట్టణములో ఆధిత్యేశ్వరాలయం నిర్మింరినాడు. ఈ దేవాలయం నిర్మించిన తరువాత రెండు సంవత్సరములకు శా.శ 1035/క్రీ.శ 1113లో వేయించెను. ఆధిత్యుడు నర్మించిన ీ దేవాలయమునకు 300 గ్రామము గల పల్నాడు(పల్లి దేశ శతత్రయాన్వస్తరి)రాజ్యమందు సచ్చేయపల్లి గ్రామములో 200 నిర్తనాల భూమిని సాగి బేతరాజు కానుకగా ఇచ్చాడు. దేవాలయం నర్మించిన శిల్పులు తిప్పోజు, పాతోజు, నారోజు లకు మహాతటాకానకి దక్షణమున 60 నివర్తనాల భూమిని దానంగా ఇచ్చారు. ఈ శాసనం ప్రకారం హైహయ సాగి మేత 1- మేడాంబిక వివాహం, వారి కుమారుడు వీరకాముని గురించి, అతని కుమారుడు సాగిబేత-2 గురించి తెలియచేస్తుంది

ఆలయ ప్రాంగణంలో శ్రీ గిరీశ్వర స్వామీ ఆలయం నాటి కట్టడాల అందాలను చాటి చెప్పేలా ఉంటుంది.అక్కడే పక్కన ఉండే నాగ శాసనం పై మాచర్ల ప్రాసస్తి ని గురించి రాయబడి ఉంటుంది.విఘ్నేశ్వర,సుభ్రమణ్య,పార్వతి అమ్మవార్ల దేవాలయాలు కూడా ఈ ప్రాంగణంలో మనం దర్శించవచ్చు. నాగేంద్రస్వామి,నవగ్రహాలు,ఇష్ట కామేశ్వరి అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ప్రధాన ప్రత్యేకతను సంతరించుకున్నాయి.ఆలయ ప్రాంగంణం లోనే ఉన్న మహాలక్ష్మీ అమ్మవారి ఆలయానికి మహిళలు అధిక సంఖ్యలో వస్తుంటారు.కాకతీయ చక్రవర్తులు ఈ ఆలయానికి 1315 లో కొంత భూమి ని మాన్యం గా ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నవి.

ఈఆలయం లో గల అద్బుత శిల్ప సౌందర్యం అలనాటి శిల్ప కళా వైభవం తెలుపుతాయి,చెన్నకేశవ ఆలయం నుండి ఎత్తిపోతల కు సొరంగ మార్గం ఉందని కొన్ని కధలు ప్రాచుర్యం లో ఉన్నాయి.. పాడయి పోయిన సొరంగ మార్గం లాంటి నిర్మాణం ఆలయ ప్రాంగంణం లో మనం చూడవచ్చు.ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు కనుల విందు చేస్తాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే స్వామి వారి కల్యాణం అద్బుతం గా చేస్తారు,ఈ కళ్యాణం భద్రాచల రామయ్య కళ్యాణం తో పోల్చేంత గొప్పగా కనుల పండుగ గా వేలాది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా చేస్తారు,ఈ కళ్యాణం చూసిన ప్రతి భక్తుడు మైమరిచి పోయి స్వామి వారి పై మరింత భక్తి భావం పెంచుకుంటారు.

స్వామివారి బ్రహ్మొత్సవాలులలో మొదటి రోజు నుండి వరుసగా అంకురార్పణ, ధ్వజారోహణం, కళ్యాణోత్సవం, హనుమద్వాహనం, శేషవాహనం, గరుడవాహనం, రవిపొన్న వాహనం, రధోత్సవం, అశ్వవాహనం, శుకవాహనం, పుష్పయాగం, ద్వాదశ ప్రదక్షినలు, ఏకాదశ కలశస్థాపన, పవళింపుసేవ యిలా 15 రోజులపాటు జరిగిన తరువాత 16 వ రోజు బ్రహ్మొత్సవాలు ముగుస్తాయి.


శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రధ చరిత్ర:

గుంటూరు జిల్లా దుర్గి గ్రామానికి చెంచిన కంచనపల్లి నారాయణ పంతులు గారు 1880 వ సంవత్సరం లో 60 అడుగులు ఎత్తుగల రధం ను చెన్నకేశవ స్వామి వారికి తయారు చేయించారు,అప్పట్లోనే రధం కు 10,000రూపాయిల కు పై గా ఖర్చు అయ్యింది,ఏడు అంతస్తులు గల ఈ రధం కు ఆరు చక్రాలు ఉండి 4 గుర్రాలు,4 సింహాలు,4 ద్వారపాలకుల మొత్తం 12 బొమ్మలు ఉండేలా తయారు చేసారు.ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు స్వామి వారి బ్రహ్మోత్సవాలు మొదలు పెడతారు.ఇప్పటికి రధం చేయించిన కంచనపల్లి వంశీయులు,శీతిరాజు వంశీయులు ఆద్వర్యం లో ఉత్సవాలు జరుగుతాయి,అలనాటి నుండి ఈ ఆచారం అలాగే సాగుతుంది 1880 లో మెదటి సారి స్వామి వారి ఉత్సవాలు రధం పై ఊరేగింపు జరిగి ఆ కార్యక్రమం నేటికి ప్రతి సంవత్సరం గొప్ప వేడుక గా జరుగుతూనే ఉంది, 140 సంవత్సరాలు గా ఈ రధోత్సవం భక్తుల మధ్య కన్నుల పండుగ గా జరుగుతుంది,140 సంవత్సరాల క్రితం రధం లాగటానికి తయారు చేయించిన ఇనుప గొలుసులు నేటికి దృడంగా ఉండటం విశేషం.. రధాన్ని భక్తి శ్రద్దల తో అన్ని కుల,మతాల వారు యువకులు,వృద్దులు కూడా భక్తి పారవశ్యం తో జై చెన్నకేశవ అంటూ భక్తి పారవశ్యం తో లాగుతూంటారు. (ఈ సంవత్సరం కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వలన రధోత్సవం జరగటం లేదు, మరియు స్వామి వారి అన్ని ఉత్సవాలు అర్చకులు మాత్రమే నిర్వహిస్తారు, భక్తులకు అనుమతి లేదు)


900 సంవత్సరాల క్రితమే అన్ని మతాలు కులాలను ఏకం చేసి దేవాలయ ప్రవేశం చేసి చాపకూడు ద్వారా అందరు ఒకే పంచన భోజనం చేయించిన బ్రహ్మనాయుడు గారు ఈ ఆలయాన్ని చాలా అబివృద్ది చేసారు. అందుకే నేటికి పల్నాడు గడ్డ పై అన్ని పండుగలు అన్ని మతాల వారు,కులాల వారు కలసి చేసుకుంటారు,ఇక్కడ కుల,మతాలకు పట్టింపు ఉండరు,అందరు ఐకమత్యం తో ఉంటారు1300 శతాబ్ది లో ఈ దేవాలయం లోనే బ్రహ్మనాయుడి చాపకూడు ద్వారా అంటరాని తనం ను రూపు మాప ప్రయత్నించిన దేవాలయం ఇదేనని చెప్పుకోవటానికి పల్నాటి ప్రజలందరు గర్వపడతారు.పల్నాటి ప్రాంత ప్రజల్లో ఎక్కువగా చెన్నకేశవ అనే పేరు పెట్టుకోవటం విశేషం,చెన్నుని భక్తి తో పూజిస్తే కలలో కనిపించి కోరిన కోరికలు తీర్చేవాడని ఇక్కడ పెద్దలు చెపుతారు.

ఇటువంటి మహిమాన్విత పుణ్యక్షేత్రం పలనాడు లో అదృష్టం. గా ఈ ప్రాంతవాసులు భావిస్తూ మాచర్ల చెన్నుని ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు ఈ దేవాలయంలొ స్వామి వారికి నిత్యకళ్యాణం జరుగుతుంది.ఆసమయంలో స్వామి వారిని దర్శించిన వారు భక్తి భావంతో పులకించి పోతారు. 

ఇంతటి చారిత్రక సంపద కలిగిన ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ది చేయాలని పల్నాటి ప్రజలందరి తరపున దేవాదాయ శాఖ వారికి,పాలకుల ను అభ్యర్ధిస్తున్నాను. ఈ చారిత్రక,ఆధ్యాత్మిక ఆలయం ను చూడని వారు దర్శించి చెన్నకేశవ స్వామి వారి కృప పొందండి. మంగళం మాచర్ల చెన్నకేశవాయ:  

:వేముల శ్రీనివాసరావు:

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya