హనుమాన్ చాలీసా ఇలా ఆవిర్భవించింది

44.192.25.113

రక్షణ కవచానికి మారుపేరయిన హనుమాన్ చాలీసా ఇలా ఆవిర్భవించింది ! 
సేకరణ: లక్ష్మి రమణ 

హనుమాన్ చాలీసా. భయాన్ని పోగొట్టి, అభాయాన్నిచ్చేది, ధైర్యాన్ని, స్థయిర్యాన్ని ఇచ్చేది, విజయాన్ని ప్రసాదించేది హనుమాన్ చాలీసా. అంతటి మహత్తరమైన హనుమాన్ చాలీసాను మనకు ప్రసాదించింది సంత్ తులసీదాసు. సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారమే సంత్ తులసీదాస్ అని ఒక నమ్మకం. ఈ విషయాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పినట్టు భవిష్యత్ పురాణం చెప్తోందంటారు పెద్దలు. ఆ వాల్మీకి మహర్షినోట ఆశువుగా వచ్చిన పద్యము రామాయణ మహాకావ్యానికి కారణమయితే, ఈ తులసీదాసునికి ఆపదకాలంలో ఆదుకున్న హనుమంతుని దర్శనం ఆశువుగా చాలీసా చెప్పేందుకు కారణమయ్యింది . 
 
ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించాడు సంత్ తులసీదాస్.

ఉత్తరభారతదేశంలో వారణాసి లో  నివసించే తులసీదాస్ నిరంతరం రామనామ స్మరణే ఊపిరిగా జీవిస్తుండేవాడు. తులసీదాసు భక్తిని, మహిమను చూసిన అనేకమంది ఇతర మతస్తులు కూడా తులసీదాసుకు శిష్యులుగా మారడంతో పాటు రామభక్తులుగా మారిపోతుండేవారట. తులసీదాసుకు సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది కంటగింపుగా మారింది.

దాంతో తులసీదాసును ఎలాగైనా శిక్షించాలని, అతనికి బుద్ధి చెప్పాలని అనుకున్నారు. అనుకున్నదే తడవు వెంటనే మొఘల్ పాదుషా అక్బర్ దగ్గరకు చేరారు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు చేసారు. అయితే అక్బర్ ఈ ఫిర్యాదుల్ని అంతగా పట్టించుకోలేదు. కాని ఈ మతపెద్దలు కూడా అంతటితో వదలలేదు. పదేపదే ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. 

 ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వివాహం జరిగిన కొంతకాలానికే ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తూ భర్త శవం వెనక పడుతూ, లేస్తూ వెళుతోంది. శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గంలోనే తులసీదాస్ ఆశ్రమం ఉంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యానంలో ఉన్న హఠాత్తుగా  వచ్చి కాళ్ళమీద పడిన ఆమెను చూసి 'దీర్ఘసుమంగళిభవ' అని దీవించాడు. దానితో ఆమె మరింతగా ఏడుస్తూ ఇంకెక్కడి దీర్ఘసుమంగళీత్వం స్వామీ...అంటూ  తనకొచ్చిన కష్టాన్ని చెప్పి జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ అమ్మా! బాధపడకు ఆ రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు లేచి కూర్చున్నాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలు ఆనోటా ఆనోటా అందరకీ చేరిపోయాయి. వీరి మహిమలను తెలుసుకొని రామ భక్తులుగా మరేవారి సంఖ్య మరింతగా పెరగసాగింది. మిగిలిన మతపెద్దలకు ఇది మరింత కంటగింపుగా మారింది. ఇక ఊరుకుంటే లాభంలేదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి తులసీదాసు మతమార్పిడిలు ఎక్కువయ్యాయని, ఇదిలాగే కొనసాగితే ఇతర మతస్తులందారినీ తులసీదాసు మాయ చేస్తాడని, తగిన చర్యను తీసుకోవాలని  ఒత్తిడి తెచ్చారు. ఇక తప్పదని ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు.

‘మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట, పైగా రామనామంతో ఎలాంటి పనినైనా చేయవచ్చని చెప్తున్నారట, రామనామంతో శవాల్ని కూడా బతికించేస్తానాని ప్రజల్ని మాయ చేస్తున్నారట’ ఇది నేరం కాదా అన్నాడు పాదుషా.

‘అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు. అలాంటప్పుడు శ్రీరామనామం అన్నిటికన్నా గొప్పదని చెప్పడంలో తప్పేముంది! రామనామ సాయంతో చేయలేని పనిగాని, సాధించలేని కార్యంగాని లేదు ఇందులో అసత్యమేమీ లేదు’ అన్నాడు అచంచలమైన విశ్వాసంతో  తులసీదాసు.

‘ఓహో అలాగా అయితే మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము’ అన్నాడు పాదుషా.

‘క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు ఆ పైవాడి ఇచ్చానుసారం జరుగుతాయి. దానిని మానవమాత్రులమైన మనమెలా మార్చగలం’ అన్నాడు తులసీదాసు.

‘రామనామ మహిమతో ఏదైనా సాధించగలమని మీరే చెప్పారు కదా! పైగా చనిపోయిన వారిని బతికించేస్తానని ప్రచారం చెసుకుంటున్నారట. ఇప్పుడేమో మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలా మాట్లాడుతున్నారు. సరే అయితే మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి మిమ్మల్ని క్షమించి వదిలేస్తామని’ అన్నాడు పాదుషా.

తులసీదాసు దీనికోప్పుకోలేదు. రామనామం పైన నిండైన నమ్మకంతో ‘క్షమించండి ! నేను చెప్పేది నిజం ! ఇందులో అసత్యమేమీలేదు. రామనామంతో అసాధ్యమయినదేదీ లేదు’ అన్నాడు.

ఈ సమాధానం పాదుషాకు విపరీతమైన కోపాన్ని తెప్పించింది. ‘తులసీదాస్!  నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని ఆజ్ఞాపించాడు.

ఇక నువ్వే నాకు శరణంటూ తులసీదాస్ కనులు మూసుకుని శ్రీరామ ధ్యానంలో పడిపోయాడు. ‘నీ సంకల్పం లేకుండా ఏదీ జరగదు. ఈ పరిస్థితి కూడా నువ్వే కల్పించావు. అందుకే ఈ విపత్కర పరిస్థితిని చక్కదిడ్డాల్సింది కూడా నువ్వే’ అనుకుంటూ కనులు మూసుకొని రామనామ ధ్యానంలో మునిగిపోయాడు.సర్వస్యశరణాగతుడైన భక్తుణ్ణి వదిలి భగవంతుడు ఉండగలడా !

అది తెలుసుకోలేని  రాజుకి విపరీతమైన ఆగ్రహం కలిగింది. ఇది రాజ ధిక్కారంగా, తమను అవమానించడంగా భావించిన పాదుషా, తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞను అమలుచేయడానికి ముందుకు కదిలారు సైనికులు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు మూకుమ్మడిగా సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధించడానికి  వచ్చిన సైనికుల దగ్గరున్న ఆయుధాలు లాక్కొని, వారిమీద దాడిచేశాయి. అంతా గందరగోళంగా మారిపోయింది. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయారు. ముందుకు కదలలేని పరిస్థితిలో ఎక్కడి వారక్కడ స్థాణువుల్లా నిలబడిపోయారు. 

ఈ గొడవకి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంమీద చిద్విలాసంగా కూర్చున్న హనుమంతుడు దర్శనమిచ్చాడు. వెంటనే స్వామిని దర్శించిన ఆనందంతో ఆశువుగా 40 దోహాలతో అంజనేయుడ్ని  స్తోత్రం చేశాడు తులసీదాసు.

ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమంతుడు 'నాయనా ! నీ స్తోత్రంతో నాకు అపరిమితమైన ఆనందం కలిగింది. దీనికి ప్రతిగా నీకేం కావాలో కోరుకో!' అన్నాడు. తులసీదాస్ 'తండ్రీ! నీ దర్శనమే నాకు మహద్భాగ్యం. ఇంతకంటే నాకేం కావాలి ! కాకపోతే ఒక కోరిక మాత్రం కోరతాను. నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు  వేడుకున్నా, వారికి వారిని కాపాడు ఇదే నేను కోరుకునీది అన్నాడు తులసీదాసు.

తులసీదాసు మాటలకు మరింత సంతసించిన హనుమంతుడు ఈ స్తోత్రంతో నన్ను స్తుతించినవారి రక్షణ భారం నేనే  వహిస్తాను' అని వాగ్దానం చేశాదు. ఆ స్తోత్రమే హనుమాన్ చాలీసా!

ఆదికవి వాల్మీకి మహర్షి అపరావతారమైన  తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ఇంటింటా హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతూనే ఉంది. నాడు తులసీదాసు నుండి నేడు సామాన్యజనుల వరకు 'హనుమాన్ చాలీసా' కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna