Online Puja Services

ఆనందభాష్పాలు విడిచే హనుమంతుడు!

3.146.152.99

హనుమాన్ జయంతి నాడు ఆనందభాష్పాలు విడిచే హనుమంతుడు!
- లక్ష్మి రమణ 

 హనుమంతుడు రామనామాన్ని విని పరవశించిపోతారు. రామ కథని గానం చేస్తే పొంగిపోతారు . రామ స్మరణలో మునిగి ఉంటె ఆ హనుమంతునికి మరేదీ అవసరంలేదు.  మరి తన పుట్టినరోజు నాడు ఆ రామ నామాన్ని విని పులకిస్తారో లేక రామునికి కృతఙ్ఞతలు చెబుతారో తెలీదు గానీ, కర్ణాటకలోని ఈ హనుమంతుడు మాత్రం తన జయంతి రోజున ఆనంద భాష్పాలు విడుస్తారు. ఏడాదంతా ఆ విగ్రహంలో కనిపించని కంట నీరు, హనుమంతుని జయంతి రోజు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది . దివ్యమైన భవ్యమైన ఈ పురాతన ఆలయాన్ని దర్శిద్దాం రండి . 

హనుమంతుడు వీరాంజనేయునిగా కొలువైన ఈ ఆలయం దాదాపు 150 సంవత్సరాలు పురాతనమైనది .  దీనిని దొడ్డ బాణసవాడి హనుమాన్ దేవాలయంగా పిలుస్తారు . ఈ  ఆలయాన్ని బెంగళూరు వాస్తుశిల్పి దివంగత శ్రీ కెంపేగౌడ రూపొందించారు. 'గోపురం' విలక్షణ ద్రావిడ శైలిలో నిర్మించబడి ఉంటుంది.  ఆలయ ప్రాంగణంలో ఇతర పరివార దేవతలుగా హనుమంతుని దేముడు రాముడు, బసవేశ్వరునిగా శివుడు  వారితో పాటు గణపతి కొలువై ఉన్నారు.

ఆంజనేయుడు ఈ ఆలయంలో దాదాపు 4 అడుగుల ఎత్తు ఉన్న వీర ఆంజనేయ స్వామిగా దర్శనం ఇస్తారు.  స్వామి రూపం మూలవిరాట్టుగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. యోగిపుంగవులైన  శ్రీ వ్యాసరాజులచేత ఈ  స్వామి ప్రతిష్టితులయ్యారు. ఈ మూర్తిని సాలిగ్రామ శిలతో  మలచడం విశేషం . ఇది ఉడిపి నుండి కుందాపురానికి వెళ్ళే మార్గంలో ఉన్న ఒక చిన్న పట్టణమైన  'సాలిగ్రామ' అనే ప్రదేశంలో చెక్కబడింది.

ఇక్కడ, ప్రతి సంవత్సరం జరిగే 'హనుమాన్ జయంతి' రోజున హనుమంతుని విగ్రహం ఆనందభాష్పాలు వదలడం చాలా అరుదైన విషయం.

ప్రతి సంవత్సరం హనుమ జయంతి రోజున బాణసవాడిలో హనుమంతుని రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆలయాన్ని దీపాలు, పూలతో అందంగా తీర్చిదిద్దుతారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు, రథయాత్ర ఇతరత్రా సేవలు వైభవోపేతంగా  నిర్వహిస్తారు. శనివారం, మంగళవారాలలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.  ఈ రోజుల్లో వీరాంజనేయుని ఆలయానికి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తూంటారు . 

ఈ ఆలయంలో పూజలు చేయించుకొంటే, హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం .  శత్రువిజయం, సర్వకార్య సిద్ధి లభిస్తుందని భక్తుల విశ్వాసం. 

చుట్టుపక్కల ఉన్న  ఇతర ప్రసిద్ధ ఆలయాలు : 

స్వామి అయ్యప్ప ఆలయం, ఉమా మహేశ్వరి అమ్మన్ ఆలయం నంజన్‌గూడ్ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం, మహా గణపతి ఆలయం, కోదండ రామ మందిరం మొదలైనవి.

ఈ సారి బెంగళూరు , కర్ణాటక ప్రాంతాలకి వెళ్ళినప్పుడు, ఈ ఆలయాన్ని మీ సందర్శనా స్థలాల్లో భాగంగా దర్శించుకొని రండి. 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore