Online Puja Services

పంచముఖ ఆంజనేయక్షేత్రం .

3.144.250.169

దుష్టగ్రహ పీడని తొలగించే త్రినేత్రాలున్న పంచముఖ ఆంజనేయక్షేత్రం . 
-లక్ష్మీ రమణ 

ఆంజనేయుని పేరు వినగానే రాములవారి పాదాల ముందు భక్తిగా ఒదిగిపోయిన వానరరూపం వెంటనే కనులముందు కదలాడుతుంది . కానీ హనుమంతుడు మహా వీరుడు. పంచముఖములు కలిగినవాడు , రాక్షస సంహారం చేసినవాడు . ఈ పంచముఖాలతో ఉన్న హనుమంతుడు మహా శక్తి స్వరూపుడు .  ఈయనకి త్రినేత్రం కూడా ఉంటుంది . ఇలా ఆంజనేయుడు త్రినేత్రుడైన విధానం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది.  ఆ రూపంతో వెలసిన స్వామి మనకి తమిళనాడులో దర్శనమిస్తారు . 

అంజనీసుతుడు సీతమ్మని చూసిరమ్మంటే, లంకనే కాల్చి వచ్చిన స్వామి . లంకారాక్షసి లంఖిణిని ఒక్క గుద్దుతో మట్టికరిపించిన వీరుడు . మహా బుద్ధి శాలి. ధర్మనిరతుడు, రామ భక్తుడు. ఆయన సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని ఎప్పుడైనా చూశారా? అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే. 

ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు.ఇలా హనుమంతులవారు కనిపించడం వెనుక ఒక స్థలపురాణం ఉంది . రావణ సంహారం తర్వాత పట్టాభిషక్తుడై అయోధ్యానగరాన్ని జనరంజకంగా పాలిస్తున్న రాములవారిని దర్శించుకోవడానికి ఒకనాడు , దేవర్షి, హరిభక్తుడు అయిన నారదులవారు విచ్చేశారు .  

రాములవారితో ఆ దేవర్షి , “స్వామి లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఇంకా ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాల”ని వేడుకున్నాడు. అప్పుడు రాముడు “నారదమహర్షి ! రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా నియుక్తిచేస్తే బాగుంటుంది’ అని సెలవిచ్చారు . 

ఆ కార్యాన్ని నెరవేర్చడానికి సమర్ధులైనవారెవరా అని యోచిస్తే, రామపాదాలదగ్గర చిన్న కోతిపిల్లలా మారి భజన చేస్తున్న హనుమ కనిపించారు. ఆయన సాహసం, పరాక్రమం ఎరిగిన వారందరూ ఆయనే ఈ రాక్షస సంహారానికి సరైనవారని ఎంచి, తీర్మానం చేశారు . హనుమన్న కూడా సరేనన్నారు . 

ఇక ఆయనకి యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు. కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. 

ఆ తర్వాత , వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఇలా ఆయన ఈ  రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున తమిళనాడులోని ఈ  ప్రాంతానికి ‘ఆనందమంగళమ్’ అనే పేరు స్థిరపడిందని స్థానికులు చెబుతుంటారు .  

ఇక్కడ హనుమంతుని రూపం చూసేందుకు రెండుకళ్ళూ చాలవు. ఈ హనుమని దర్శించుకుంటే, దుష్టగ్రహ బాధలు పడుతున్నవారు , రకరకాలుగా పీడనకు గురవుతున్నవారు ఆంజనేయుని అభయాన్ని పొంది రక్షింపబడతారని ప్రతీతి . 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha