అందుకే ఆంజనేయునికి సింధూరమంటే అత్యంత ఇష్టం !

54.165.57.161

అందుకే ఆంజనేయునికి సింధూరమంటే అత్యంత ఇష్టం !
-లక్ష్మీ రమణ 

హనుమంతుడు రామునికి దాసానుదాసుడు. మహా భక్తుడు . రాముడు హనుమ భక్తిని మెచ్చి ముత్యాల హారమిస్తే, అందులో రాముడున్నాడా లేదా అని కొరికి చూసి , రాముడు లేదు కాబట్టి ఆ హారానికే విలువలేదని ఒకింత అమాయకత్వం నిండిన కొంటె చేష్టతో చెబుతాడు హనుమ. తన హృదయంలోని రాముడున్నాడని , గుండెని చీల్చి సీతమ్మకి చూపిన మహా భక్తుడు . రాముని ప్రేమలో నిత్యం రమించిపోయే ఆ అంజనీసుతునికి  సీతమ్మమీద ఒకింత అసూయ కూడా కలిగింది . అదే, ఆయన ఒంటినిండా సింధూరం పూసుకోవడానికి కూడా కారణమయ్యింది . 

హనుమా నీకు నమస్కారం అని చెప్పినప్పటికన్నా , ఓ రామభక్తా నీకు నమస్కారం అంటే, వెంటనే అనుగ్రహిస్తాడట హనుమంతుడు . రామ కథని ఎక్కడ గానం చేస్తారో , ఎక్కడ రామనామం జపిస్తారో అక్కడకి  ఏదొకరూపంలో హనుమ స్వయంగా వస్తారని శృతివచనం . భక్తిలో రమించిపోయినప్పుడు, భక్తునికి ఉన్మత్తావస్థ అనుభవంలోకి వస్తుందని యోగశాస్త్రం చెబుతుంది . హనుమ తన అస్తిత్వాన్ని కూడా మరిచిపోయి ఆ రాఘవుని భక్తిలో నిమగ్నమయ్యేవారు . ఆయన దేహంపైనున్న సింధూరాన్ని ధరించిన వారిని దుష్ట శక్తులు దరిచేరవని, రామానుగ్రహం వారికి సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కానీ ఆయనకీ సింధూరం అంత ప్రియమైనదవ్వడానికి కారణం కూడా రాములవారే  . ఆ కథ చదువుదాం పదండి . 

 శ్రీరామ పట్టాభిషేకానంతరం ఒకనాడు, సీతమ్మ చక్కగా తలంటి స్నానం చేసి నుదుటన తిలకం దిద్దుకొని , పాపిటన ‘సింధూరం’ పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్నారట. అప్పటివరకూ శ్రీరాముని సేవకై నిరీక్షించిన ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు. ఇది గమనించిన సీతమ్మ, హనుమంతునితో ‘మేము విశ్రాంతి మందిరానికి వెళ్తున్నాం హనుమా. నీవు రాకూడదు కదా ! స్వామీ సేవకోసం తరవాత వద్దువులే !’ అన్నారట . చిరునగవులు చిందిస్తూ రాఘవుడు కూడా అందుకు వంతపాడారట . 

అప్పుడు  ‘రామా! మీరు పూర్తిగా అమ్మకి దాసులైపోయారు .  ఈ దాసానుదాసుణ్ణి కరుణించడమే లేదు . మీ సేవ చేసుకోనిదే, నాకు తోచేదెలా’ అని వాపోయారు హనుమ .   ‘నేను వివాహ సమయమున వైదేహి పాపిట చిటికెడు సింధూరము దిద్దాను హనుమా ! అందుకే నేను ఆమెకి దాసుడనయ్యాను’ అని చెప్పారట జానకీపతి  .

ఆమాటకి హనుమంతుడు ఆశ్చర్యముతో “అమ్మా! మీ నుదుట తిలకముంది కదా! పాపిటన సింధూరం దేనికి” అని సీతమ్మని ప్రశ్నించారు . సీతాదేవి ‘నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని’ వివరించారు  .

వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడిలో సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలా, తోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందు లేకుండా పూసుకుని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళారట . దర్బారులోని వారు హనుమంతుని రూపం చూసి పక పక విరగబడి నవ్వుచుండగా, శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి ‘ హనుమా ! ఇదేమిటి’ అని అడిగారట . 

 హనుమంతుడు “మీరు చిటికెడు సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ఆమెకు వశపడితిరి కదా, అమ్మ ధరించిన ఆ చిటికేడు సింధూరానికే  మీకు సౌభాగ్యం కలిగితే, మరి నేను శరీరము మొత్తము సింధూరం అలంకరించుకున్నాను . మరి మీరు నాకు వశపడేదరా, లేదా ప్రభూ ! మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కదా” అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టారట . 

అపరిమిత బలపరాక్రమాలతో రావణసేనని మట్టుబెట్టిన ఆ అరివీర భయంకర హనుమంతునికి - రాముని ప్రేమలో , రాముని భక్తిలో రమించిపోయే ఆ భక్త హృదయానికి యెంత తేడా ఉందొ గమనించండి . అదే సమయంలో అంతటి సాన్నిహిత్యంకూడా ఉందని తెలుసుకోవాలి . అటువంటి  అమాయకత్వం నిండిన ప్రేమ , పసిపిల్లాడిలా కేరింతలు కొడుతూ స్వామికోసం తల్లడిల్లే హృదయం , స్వచ్ఛమైన పవిత్రమైన భక్తే కదా భగవంతుడు కోరుకునేది !  

 హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా “ఆంజనేయా ! నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధురాన్నితిలకంగా ధరించిన వారికి, నా అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. 

అంతేకాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి” అని వరదానం చేసాడు. అందుకే ఆంజనేయునికి సింధూరమంటే అత్యంత ప్రీతిపాత్రం . భక్తులపాలిటి అది అమృత సంజీవనీ మంత్రం .

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gouthama Budda