Online Puja Services

ఆంజనేయస్వామికి తమలపాకులకు ఉన్న అనుభంధం

18.117.153.38

ఆంజనేయస్వామికి తమలపాకులకు ఉన్న అనుభంధం .
-లక్ష్మీ రమణ  

సీతమ్మతల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చాడు.  రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని శమింపజేశాడు .  రామలక్ష్మణులు నీకు మిత్రులే కాని, వాలి పంపగా వచ్చినవారు కారని సుగ్రీవునికి శాంతిని కలుగచేశాడు.  నీ అహంకారం, నీ పర స్త్రీ వ్యామోహమే  నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి హితవు చెప్పాడు.  ఆ మంగళ మూర్తే, హనుమ . 

ఆంజనేయుడు శివాంశసంభూతుడని శాస్త్ర వచనం. శివుని 11వ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమజ్జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తుంది. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేర్గాంచాడు. 

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. 

ఆంజనేయునికి తమలపాకులతో పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకి  వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది?’ అని అడిగారు .అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది’ అని వివరించారు. రాములోరి మాటంటే, రామబాణం లెక్క మన హనుమన్నకి. వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి, ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చారు రాములోరి ఆరోగ్యం ఇంకా బాగుండాలని. 

వాయుపుత్రుడు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. వానర స్వరూపానికి కదళీఫలాలంటే అమితమైన ఇష్టం కదా ! పైగా ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.

మరో కథ ప్రకారం, అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు. అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. 

ఇక అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితం ఇస్తుంది . శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది. అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. హస్తమృగశీర్షానక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం. స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయ. హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం. 

అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన కలుగు ప్రయోజనాలు:

1. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది.
2. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.
3. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.
4. కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.
5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది.
6. ఏ వ్యక్తి అయితే హీనంగా చుడబడుతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది.
7. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది
8. వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి.
9. సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.
10. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది.
11. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించిచి తమలపాకుల హరాన్ని సమర్పించి, ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది.
12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు.

నాగవల్లి దళాలతో అర్చించి , కదళీ ఫలాలు నివేదించి , ఆ రామభక్తుని కృపకి ప్రాత్రులు కాగలరని ఆశిస్తూ , శలవు .

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha