దుండిగల్ ఆంజనేయ స్వామి భక్త సులభుడు

3.236.253.192

దుండిగల్ శ్రీ కార్యసిద్ధి మరకత ఆంజనేయ స్వామి భక్త సులభుడు 

అనంతుడైన ఆంజనేయునికి ఎన్నో అనంత నామాలు. అవి అంజనీసుతుని కొలిచే భక్తులకు శక్తిపాతాలు. అభయం ఆంజనేయునిదైతే , భయం భయపడి పారిపోతుంది. వాలమొక్కటి చాలదా ఈ వానరుడు నరుల రక్షింప అన్న రీతిలో ఆంజనేయ అభయం నిలిచి గెలిపిస్తుంది . ఆయన అభయాన్ని పొందేందుకు అవసరమైనది కేవలం అచంచలమైన భక్తి మాత్రమే .  భక్తి శక్తికి తిరుగులేని నిదర్శనం హనుమ కాక ఇంకెవరు ! రామభక్తితో రామునితోనే యుద్ధానికి సిద్ధమై , రామ భక్తి మహిమను రామునికే రుచి చూపించినా , రాముని సీతాసహితంగా తన హృదయంలో బంధించి సకల చరాచర జగతిలో రాముని దర్శించినా  అది ఆ అంజనీ సుతునికే చెల్లింది. అందుకే కాబోలు రాముని చేరాలని పరితపించిన తులసీ దాసు తొలుత ఆంజనేయుని దాసుడై చాలీసా రచించాడు. భక్తులకు సులభ మైన భక్తి మార్గాన్ని అనుగ్రహించాడు . 

భక్త సులభుడై అనుగ్రహించాలని ఆ వానర వీరుని, ఆ భక్తాగ్రేశ్వరుని మరకతామణిలో నిక్షేపించి ప్రతిష్టించిన క్షేత్రం దుండిగల్ లోని  శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఉన్న శ్రీ కార్యసిద్ధి మరకత ఆంజనేయ ఆలయం . మరకతానికి ఉన్న విశిష్టమైన గుణం ఏమిటంటే , పాలలో లేదా నీటిలో మరకతాన్ని ఉంచినప్పుడు , వాటికి తన రంగుని వర్తింపజేస్తుంది . శక్తికి ప్రతిరూపమైన స్వామి ఆంజనేయుని రూపాన్ని మరకత మణితో నిక్షేపిస్తే , ఆ స్వామి దివ్యతేజస్సుని ఆపాదించుకొని మరింతగా భక్తులకు అనుగ్రహ వృష్టిని కురిపిస్తుంది . అందుకే ఇక్కడి అంజనీ సుతుడు మహామహిమోపేతుడు . సకలకార్యములనూ సిద్ధింపజేసే శక్తి గలవాడు .

ఇక్కడి ప్రధానఆలయంలో ముందుగా ప్రధమ పూజ్యుడైన గణపతి దర్శనం సంప్రాప్తిస్తుంది . గరిక పూజల చేత సంతుష్టుడైన గణనాయకునికి కైమోడ్పులు అర్పించిన తర్వాత ఇతరుల దేవతామూర్తులపైపు కదులుతారు భక్తులు .  అదే మండపంలో వరుసగా  మాణిక్య నాగేంద్రుడు , శ్రీ రాజరాజేశ్వరీ మాత , మరకత ఆంజనేయుని దర్శనం చేసుకోవచ్చు. 

ప్రధానదైవమైన ఆంజనేయుడు సాక్షాత్తూ శివుని అంశమే కదా . అయినా ఇక్కడ ఈశ్వరుని లింగస్వరూపాన్ని మాణిక్య నాగేశ్వరునిగా దర్శించుకోవచ్చు . ఈ ఆలయంలో పూర్ణఫల సమర్పణ ఒక ఆనవాయితీ. ఈ విశిష్టమైన సంప్రదాయం భక్తుల కోర్కెలను 16 రోజులలో  తీర్చగల మహిమోపేతమైనదని స్థానిక విశ్వాసం.

ప్రధాన ఆలయంలోని అనుగ్రహ వీక్షణాలు ప్రసరింపజేసే హనుమన్న రూపం అనంత శాంతిని ప్రసాదిస్తుంది .ఇక్కడ స్వామి తలపై కిరీట స్థానంలో పరివేష్టుడైన శ్రీరాముని దర్శనం భక్తులకి సంప్రాప్తిస్తుంది. పూజలు , సేవలూ ఏవైనా ముందర తన స్వామి రామచంద్ర ప్రభువుకే అర్పించాలని, రాముని పూజ రామసేవకుని అనుగ్రహానికి కారకమని పెద్దలు చెబుతారు .  హృదయములో తన స్వామిని ప్రతిష్టించుకున్న భక్తి  హనుమది. తొలిసేవలు తన స్వామికి అంకితం చేస్తూ ఆయనని తన తలపై ప్రతిష్టించుకోవడడంలో వింతేముంది . 

 మహాబలవంతుడు, జ్ఞానులలో అగ్రగణ్యుడు, భక్తులపాలిటి కల్పతరువు వాయుపుత్రుడు హనుమంతుడు. కొండంత దేవునికి కొండంత పత్రిని సమర్పించ లేముకదా! భక్త సౌలభ్యం కోసం, తన సేవభాగ్యాన్ని అనుగ్రహించడం కోసం,   ప్రసన్న వదనంతో , సూక్ష్మరూపుడై మణి  విగ్రహ పాదాల చెంత మరో అర్చామూర్తిగా అవతరించాడు. సిందూర తిలకాన్ని ధరించి,  పంచలోహములతో ప్రకాశిస్తున్న   స్వామీ దివ్య మంగళ స్వరూపానికి భక్తులు నేరుగా  క్షీరాభిషేకం చేయవచ్చు .  పత్రితో , తులసితో , విశేషించి తమలపాకులతో స్వామిని పూజించవచ్చు 

విశేష పర్వ దినాలలో ఆంజనేయునికి అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తుంటారు . వజ్రకాయుడైన మరకత మూర్తికి జరిగే అభిషేకసేవ వర్ణ రంజితమై అద్భుతం అనిపిస్తుంది.  తెల్లని పాలు , మరకత మణి  ప్రభలను దాచలేక , ఆంజనేయుని తనువెల్లా  ధారలై  ప్రవహిస్తుంటే, మనసుని కమ్మే మాయని చీల్చుకొని నీలో నిండిన నన్ను చూడమని స్వయంగా హనుమే మనల్ని  ఆదేశించినట్టు అనిపించకమానదు .

మానవ సేవె మాధవ సేవ అన్న వాక్యానికి ప్రతిబింబమా అనిపించేలా ఇక్కడ భక్తులకు ఉచిత వైద్య , ఆహార సౌకర్యాలున్నాయి .  శ్రీ గణపతి సచ్చిదానంద ఉచిత వైద్య శాల , అత్యవసర సమయాల్లో సైతం వెంటనే ప్రతిస్పందించేలా భక్తులతో పాటు దుండిగల్ వాసుల వైద్య అవసరాలను తీరుస్తూ , సకల సౌకర్యాలతో  తన సేవా నిరతిని చాటుతోంది . ఇక్కడి అన్నపూర్ణా మందిరం అన్నార్తుల  ఆకలి తీరుస్తూ అది అమ్మ నివసించే ప్రాంతమని సత్యాన్ని చూపుతోంది .

దత్తపీఠం గురుసేవా నిరతికి నిదర్శనం అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇక్కడ కదంబవనంలో విరిసిన కమలంలో  త్రిమూర్త్యాత్మకుడైన సద్గురు దత్తాత్రేయ పాదుకలు దర్శించుకోవచ్చు . శ్రీ గురు నిలయంలో దత్తదర్శనం సిద్ధిస్తుంది . భగవంతునికన్నా ముందు గురువుని దర్శించుకోవడం ,  చీకటిని చీల్చుకొని ప్రభవిస్తున్నసూర్య దర్శనాన్ని సంపూర్తిగా , విజ్ఞాన శిఖలతో వీక్షించడం , ఆ దైవ అనుగ్రహాన్ని పొందడంతో సమానమే .

హైదరాబాదు నుండీ పరిసర పాంతాల నుండీ దుండిగల్ కి బస్సు సౌకర్యం ఉంది. దుండిగల్ కి దారితీసే ప్రయాణం చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది . 

ఆధ్యాత్మిక యాత్రలలోని విశేషత మొదట మానసిక ప్రశాంతత , ఆధ్యాత్మిక విశేషతలే కదా! ఆశ్రమంలోకి అడుగిడగానే అనంతమైన ప్రకృతి శోభ ఆ ప్రశాంతతను మరో వందరెట్లు పెంచినట్టు అనుభూతి చెందుతాం . విశాలమైన ప్రాంగణంలో విశాలమైన రహదారులు ఆహ్వానం పలుకుతాయి . అలాగే ముందుకుసాగితే విశాలమైన మండపం కనిపిస్తుంది .  దానిపైన పరివేష్టితులైన విఘ్నేశ్వరుడు , శ్రీ దత్తావధూత దత్తాత్రేయులు ,ఆంజనేయులు, మాణిక్య నాగేశ్వరుడు , శ్రీరాజరాజేశ్వరీ   దేవి అభయ ముద్రలతో ఆలయంలోకి స్వాగతిస్తారు . ఈ మండపం ఆధునిక శైలిలో, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా  అడుగడుగూ అద్భుతంగా రూపుదిద్దారు .

రామ దర్శనం చేయకుండా నిమిషకాలం ఉండలేడు స్వామి హనుమ.ఆయనని తన తలపై ప్రతిష్టించు కున్న ఈ హనుమదర్శనం సర్వ కార్య సిద్ధి ప్రదం .

- లక్ష్మి రమణ 

Quote of the day

Buddhas don't practice nonsense.…

__________Bodhidharma