Online Puja Services

కష్టాలని కడతేర్చే మార్గం హనుమాన్ చాలీసా పారాయణం .

3.144.25.74

కష్టాలని కడతేర్చే మార్గం హనుమాన్ చాలీసా పారాయణం .
- లక్ష్మీరమణ 
 
ఆంజనేయ స్వామి చాలీసా పారాయణ చాలామంది చేస్తూనే ఉంటారు. సంకటాలన్నీ తొలగించే హనుమాన్ చాలీసా ని మనకి వరంగా ప్రసాదించినవారు సంత్ తులసీదాస్ .  ఆయన భక్తికి పరీక్ష పెట్టిన అక్బర్ పాదుషాకి , రామ నామంతో సమాధానము చెప్పారు తులసీ దాసు. తనను శరణు వేడని దాసుగారిని చెరసాలలో వేశారు పాదుషావారు .  అప్పుడా రామదండే ఆయనకీ తోడుగా వచ్చింది.  రామదాసులకి దాసుడనని చెప్పుకోవడమే కాదు,  కదిలివచ్చి అండదండలతో నిలబడే స్వామి ఆ హనుమ.  ఆయన వచ్చి  తులసీ దాసుకి  దర్శనమిచ్చి చెరసాల నుండీ  రక్షించారు  .  అలా హనుమని దర్శించి తులసీదాసు ఆశువుగా చెప్పిన రక్షాస్తోత్రం హనుమాన్ చాలీసా. ఈ చాలీసాని ఎవరయితే చదువుతారో  వారికి  అండగా నిలిచి  వారి కష్టాలని తొలగిస్తానని ఆంజనేయస్వామి తులసీ దాసుకి మాటిచ్చారు. అయితే ఈ పారాయణ సంఖ్య , నియమాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .       

*పెద్దలు చెప్పిన విధానం ప్రకారం చాలీసా పారాయణకి భక్తి ప్రధానం. చేసే పూజ ఏదైనా ముందుగా అవసరమైన ప్రధానమైన వస్తువు భక్తి మాత్రమే . 

*పారాయణం అనేది ఎన్ని రోజులు చేయదలచుకున్నారు అనేది ముందుగా నిర్ణయం చేసుకోవాలి. మండలం రోజులా, తక్కువా, ఇంకా ఎక్కువా అనేది చూసుకోవాలి .. 

*ఈ రోజులలో మీకు శౌచం అత్యంత అవసరం. కాబట్టి, మీ ఇంటిలోని ఆడవారికి ఇబ్బందులు లేని సమయం ఎంచుకోండి.

*వీలయినంతవరకు, సూర్యోదయాత్పూర్వమే పూజ ముగిసేట్లు చూడండి.

*ఇది విశేష పూజ కాబట్టి, మీకున్న నిత్య ఆరాధన ముందు చేయండి. సంధ్యా వందనం చేసేవారయితే, ఖచ్చితంగా అది మొట్ట మొదట చేయాలి. ఆ తర్వాతే పారాయణ చేసుకోవాలి . 

*మడి వస్త్రాలు వాడాలి. ఎప్పుడూ రెండు వస్త్రాలతోనే పూజ చేయాలి. (పంచ,కండువా. ). 

*వీలయితే ప్రతిపూటా దేవుని గది అలికి, ముగ్గు వేసుకోండి. సాత్వికమైన ఆహారం తీసుకోండి. 

*వీలయితే, రాత్రిపూట ఆహారంలో వండిన పదార్థాలు తీసుకోకండి. అయితే, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారం విషయంలో మార్పు అవసరం కావచ్చు.

*షోడశ ఉపచారాలు చేయగలిగితే మంచిది. లేదా కనీసం పంచ ఉపచారాలు.

*చల్లనీటి తో తల స్నానం, రాత్రి వేళలో భూశయనం. ఇవి కూడా మీ ఆరోగ్య పరిస్తితిని బట్టి పాటించండి.

*మీరు ఎందుకు ఈ విశేష పూజ చేస్తున్నారో, అది 'సంకల్పం' గా తప్పక పూజకు మునుపు స్వామివారికి విన్నవించుకోండి. రోజుక్కొక్కసారి చొప్పున, మీరు ఎన్ని రోజులు దీక్ష అనుకున్నారో, అన్నీ రోజులు చేయండి. ఒక రోజుకి 5 లేదా 9 సార్లు కూడా చాలీసా చేస్తుంటారు. అయితే  కొంతమంది ఒకే రోజులో 108 సార్లు పారాయణం చేస్తుంటారు. మీరు ' నిత్య పూజ'  గా చేయదలచుకుంటే,  రోజుక్కొసారి సరిపోతుంది . 

 *స్వామివారికి చిట్టి గారెలు , అప్పాలు, చాలా ఇష్టం. వీటిని నివేదనగా సమర్పించడం మంచిది . కానీ  ప్రతిరోజూ చేసే వీలు ఉండకపోవచ్చు . కాబట్టి మంగళవారం లేదా శనివారం వీటిని  9,11,13 ఇలా బేసి సంఖ్యలో సమర్పించవచ్చు.   రోజూ నివేదనగా  పాలు, పండ్లు విశేషించి అరటిపండ్లు , కొబ్బరి కాయ సమర్పించవచ్చు. ఒక్కరోజు , మండలం రోజులపాటు పారాయణ అనుకుంటే  పూజ పరిసమాప్తి రోజు చిట్టి గారెలు/ అప్పాలు పెట్టుకోవచ్చు.

* అవకాశం ఉంటే పూజాపరిసమాప్తి రోజున  ఆంజనేయ స్వామి కోవెల అర్చక స్వామికి గానీ ఒక బ్రాహ్మణుడికి గానీ భోజనం ఇవ్వండి .

శుభం . 

#hanumanchalisa #parayana

Tags: hanuman chalisa, hanuman, parayana, pooja

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha