Online Puja Services

బీబీ నాంచారమ్మ ఏవ్వరు

52.15.59.163
అసలు బీబీ నాంచారమ్మ ఏవ్వరు. ...?
 
ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వారుండరు. అలాగే చాలామందికి బీబీ నాంచారమ్మ గురించి చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు? ఆమె నిజంగానే ముస్లిం వనితయా? ఆమె దైవస్వరూపం ఎలా అయ్యారు? ఆమె కధ ఏమిటో చూద్దాం.
 
బీబీ నాంచారమ్మ! `నాచియార్` అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంటే భక్తురాలు అని అర్థమట. ఇక `బీబీ` అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిది కాదు. కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచి ఉంది. పురాతన కధ ప్రకారం బీబీ నాంచారమ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అసలు పేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫిర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం, భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతోంది. పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫిర్ కళ్లు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనం వస్తుంది కదా అనుకున్నాడు. అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని హస్తిన కి బయలుదేరాడు.
 
హస్తిన కి చేరుకున్న తరువాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నింటి మధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు, తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది. ఆ విగ్రహం తనచేతికి అందిందే తడవుగా, దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం… అలా తనకు తెలయకుండానే ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒకో రోజూ గడుస్తున్న కొద్దీ దాని మీదే సురతాని మనసు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుని ఉత్సవ మూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో, రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులూ, పూజారులు అంతే బాధలో మునిగిపోయారు. చివరకి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్నే వేడుకునేందుకు హస్తిన కి ప్రయాణమయ్యారు.
 
రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు భక్తుల విన్నపాలు చూసి మాలిక్ కాఫిర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆపాటికే రంగనాథుని మీద మనసుపడిన సురతాని మాత్రం విగ్రహం ఇవ్వటానికి ఇష్టపడలేదు, అయితే అర్చకులు, ఆమె ఆదమరిచి నిదురించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సురతాని ఉదయాన్నే లేచి చూస్తే విగ్రహం కనుమరుగైంది. ఎవరు ఎంత ఒదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి పయనమైంది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు.
 
మరొక కధ ఏమిటంటే…ఆ విగ్రహం రంగనాథునిది కాదు. మెల్కోటే (కర్నాటక)లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు. దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు. కలియుగదైవమైన వేంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకనే తిరుపతిలోనూ బీబీనాంచారమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఆమె ముసల్మాను స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వేంకటేశ్వరునికి సతిగా భావిస్తారు. కర్నాటకను హైదర్ఆలీ అనే రాజు పాలించే కాలంలో, అతను ఓసారి తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడట. అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకుని వెనుతిరిగాడట.
 
ఇదీ బీబీ నాంచారమ్మ కథ !

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya