Online Puja Services

తిరుమల శ్రీనివాసుడు పూజించిన దైవం ఎవరు?

18.222.200.143

తిరుమల శ్రీనివాసుడు పూజించిన దైవం ఎవరు?
- లక్ష్మి రమణ 

వేదాలే శిలలై వెలసిన కొండ తిరుమల తిరుపతి కొండ. ఆ కొండే తమకి అండా దండా అని కోట్లాది మంది భక్తుల నమ్మకం. కోనేటి రాయుని దర్శనానికి ఎన్నో కష్టనతాలకి ఓర్చి మరీ వస్తూంటారు భక్తకోటి. ఆయన తమ కులదైవమని, కోటానుకోట్ల దండాలు పెడుతుంటారు . అడుగడుగు దండాలవాడని ఆనందంగా అర్చిస్తుంటారు . అటువంటి శ్రీనివాసుడు తన కులదైవంగా ఎవరిని అర్చించారు ? పద్మావతమ్మని అంగరంగ వైభవంగా వివాహమాడిన నాడు ఏ రూపాన్ని అర్చించారు ?

త్రేతాయుగంలో రాముడు శివయ్యని ఆరాధించారు. అప్పుడు విష్ణుష్య హృదయ శివః శివస్య హృదయం విష్ణుః అని చెప్పుకున్నాం . కానీ తిరుమలేశుడు కలియుగ ప్రభువు . ఈ స్వామి తన కులదైవంగా అర్చించినవారెవరు ? 

తిరుపతిలో అడుగడుగునా , నృసింహుని దేవాలయాలు కనిపిస్తాయి. నడక దార్లో కొండెక్కే భక్తులకి నారసింహుడు దారంతా వెంటే ఉండి నడిపిస్తున్నాడా అన్నట్టు ఆలయాలు కానవస్తాయి. తిరుమలేశుని హుండీకి ఎదురుగా నృసింహ స్వామి ఆలయం ఉంటుంది. ఉత్తర మాఢ వీధుల్లో అహోబిల మఠాన్ని మనం గమనించవచ్చు. ఇలా తిరుమలకు, అహోబిలానికి మధ్య ఆధ్యాత్మిక వారధి కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే తిరుమల నిజానికి వరాహక్షేత్రం. వరాహస్వామి అనుమతితోటే,  తిరుమలేశునికి తిరుమల పైన చోటు దక్కిందని పురాణాలు చెబుతున్నాయి. 

తిరుమలేశుడు పద్మావతిదేవిని వివాహం చేసుకునే సమయంలో పూజించిన భగవత్ స్వరూపం ఆ సాక్షాత్ అహోబిలం నృసింహుడే. ఇప్పటికీ దిగువ అహోబిలంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ స్వామి పూజ తర్వాతే శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయమాడినట్టు పురాణాలు చెపుతున్నాయి.

తానూ తన దగ్గరే అనుమతిని తీసుకొని, తిరిగి తననే పూజించుకొన్నా తీరు ఇక్కడ భగవంతుని దివ్యత్వాన్ని తెలియజేస్తుంది .అన్ని రూపాలలో ఉన్నదీ తానే అయినా, తిరుమలేశుడు ధర్మాన్ని పాటించారు . సంప్రదాయాలను గౌరవించారు .   ఆయన తన కులదైవంగా విష్ణుస్వరూపమైన నృసింహస్వామిని అర్చించారు .  ఏకమైనా భగవంతుడు అనేకుడై, తానె విజ్ఞాపనగా, అనుమతిగా, అనుగ్రహంగా పరిణమించడం అద్భుతమైన విశేషం కదూ ! ఆ పరమాత్ముని సర్వవ్యాపకత్వాన్నీ, అనుగ్రహ వైచిత్రిని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి . 

శుభం !!

#srinivasudu #venkateswaraswamy

Tags: tirumala, venkateswara swami, swamy, padmavathi, nrusimha, ahobilam

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda