Online Puja Services

శ్రీనివాసుని పెళ్ళి భోజనాలని ఎలా పెట్టారా అని ?

3.141.202.54

శ్రీనివాసుని పెళ్ళి భోజనాలని ఎలా పెట్టారా అని ?
-లక్ష్మీరమణ 

మంత్రిగారింట్లో పెళ్లి .  అసలు ఎన్ని స్వీట్లో , ఎన్ని హాట్లో , ఎన్ని పానియాలో చెప్పడం కష్టం . బొజ్జనిమురుకుంటూ చెబుతాడో గణపయ్య . ఆ పెళ్ళిలో తిన్న గులాబ్ జామ్ ఉంది గురూ ! తలుచుకుంటే , ఇప్పటికీ నోట్లో నీళ్ళూరుతున్నాయ్ అంటాడు మరో లంబోదరుడు . అయ్యా , ఇహలోకంలోని మంత్రిగారి ఇంట పెళ్ళయితేనే ఇంత హడావుడీ ఉందంటే,  బ్రహ్మాండ నాయకుడి పెళ్ళికి శాకాలూ , పాకాలూ వడ్డనలూ ఎలా చేసుంటారో కదా ! ముక్కోటి దేవతలు దిగివచ్చిన పెళ్లి .  త్రిమూర్తుల్లో స్వయంగా ఒకరు పెళ్లికొడుకుకాగా , మరో ఇద్దరు పెళ్ళిపెద్దలైన పెళ్ళి . శ్రీనివాసుని పెళ్ళి భోజనాలని ఎలా పెట్టారా అని ?

అసలే రాజుగారి బిడ్డ పద్మావతమ్మ . ఆ మామగారి గొప్పకీ తీసిపోయినవాడేం కాదు శ్రీనివాసుడు . ఆయన భూపరిపాలకుడు . ఈయన బ్రహ్మాండ నాయకుడు . కానీ ఒక్కటే తేడా ! మామగారి దగ్గర రాజ్యలక్ష్మి ఉంది . శ్రీనివాసుడిని విడిచి లక్ష్మి కొల్హాపురం వెళ్ళిపోయింది . సంపదలేని స్వామి , కుబేరుడిదగ్గర చేయిచాచి అప్పు చేశాడు . కలియుగాంతంవరకూ వడ్డీ కడతానని , అప్పుభారానికి తలొగ్గాడు . 

పెళ్లిపనులు ఊపందుకున్నాయి . సకలపరివారాలతో దేవలోకం శ్రీనివాసుని వివాహానికి తరలివచ్చింది .  వకుళామాత ఆశ్రమాన్ని ముక్కోటిదేవతలూ పావనం చేశారు . ఇప్పుడొచ్చింది అసలు సమస్య.  ఇంతమందికి భోజనాలు పెట్టాలికదా ? బ్రహ్మదేవుడు , పరమశివుడు సృష్టి పోషకుణ్ణి ప్రశ్నించారు . నిజమే, ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే, సరుకులు ఎలా తేవాలి ? ఎలా వండాలి ? ఎక్కడ వండాలి ? ఎవరు వండాలి ? ఎలా వడ్డించాలి ? డబ్బుసమస్య తీరినా మర్యాద లోపం జరిగేలాగానే  కనిపించింది శ్రీనివాసుడికి. కానీ మనసుంటే మార్గముంటుంది అంటారుకదా ! అలాగే ఒక అద్భుతమైన ప్రణాళిక రచించారు శ్రీహరి .   

వంటసరుకులు పురమాయించారు . అగ్నిదేవుని వైపు దృష్టిసారించారు .  ఆ చూపులోని ఆంతర్యాన్ని అర్థంచేసుకొని నేను వంట చేస్తాను స్వామీ ! కానీ వంటపాత్రలమాటేమిటీ ? అంటూ నసిగాడు ఆయన . దానికి కూడా పరిష్కారం చూపిస్తూ , భూదేవీ వంటపాత్ర , వెంకటాచములోని తీర్థాలలో వంటలు చెయ్యండి అని చెప్పారు .  

కోట్లమందికి వండాలంటే, ఎన్ని పాత్రలు సరిపోతాయి ? పైగా , వెంకటాచములోని తీర్థాలు అంటే, సమస్తమైన పుణ్యనదులకి సమానం కదా !అలా అగ్నిహోత్రుడు వంటబ్రాహ్మణుడై, తుంబురతీర్థంలో చింతపండు పులుసు పిసికిపోస్తే, కింద పులిహోర కలిపారని చెబుతారు . ఇదేతీరులో స్వామి పుష్కరిణిలో - అన్నం, పాపనాశనంలో - పప్పు, ఆకాశగంగలో - బెల్లం పరమాన్నం,  దేవతీర్థంలో - కూరలు,  కుమార తీర్ధంలో - భక్ష్యాలు (బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి), పాండుతీర్ధంలో - పులుసు, ఇతర తీర్ధాల్లో- లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపించారట . 

అలన్నిటిలోనూ పప్పులు , పులుసులు , చక్కెర పొంగళ్లు , కట్టు పొంగళ్లు , జీలకర్ర పొంగళ్లు , ఎన్నో రకాల పొంగళ్ళు , పులిహోర ఇలా పంచభక్ష్య పరమాన్నాలనీ వండి వార్చేశారు అగ్నిదేవులవారు .  .

బ్రహ్మాండనాయకుని పెళ్ళికి అగ్నిహోత్రుని వంట బ్రాహ్మణ్యం . వంటకాలన్నీ ఘుమఘుమలాడుతున్నాయి . ఇక వడ్డించడమే తరువాయి .  వచ్చిన అథితులు స్వయంగా దేవతలు . ఎక్కడ విస్తర్లువేయాలి ? వకుళాదేవి కుటీరం సరిపోదే ?  పైగా ఒక్కరూ ఇద్దరూ కాదు , ఏకంగా ముక్కోటి దేవీదేవతలు . ఎలాగంటే,  వేంకటాచలంనుండీ శ్రీశైలంవరకూ అంతామనదేగా అన్నారు పరమేశ్వరులు . ఇంకేముందీ ,  భోజనాల బంతులు వేంకటాచలం నుండి శ్రీశైలంవరకు వేశారు .

భోజనాలు సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేశారు  బ్రహ్మదేవుడు. నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరీకి వడ్డన.  "నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు" అంటాడు స్వామి. 

మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. సరే, కానీ, నువ్వే బ్రహ్మాండ నాయకుడివి . నివేదన చేయని పదార్ధాలనా  అతిధులెవ్వరూ ముట్టుకోరు, మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ.   
 
ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబిలంలో ఉన్న  నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబిల నరసింహస్వామికి నివేదన చేశారు .  

తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసేట్టయితే , పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో నిండి కనిపిస్తాయి . శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి. ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడు ,నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లిఖార్జునుడు భ్రమరాంభ సమేతంగా వెలసి ఉన్నారు. 

క్రమశిక్షణ ఎరిగినవాడు కదా  శివుడు,  అందుకే , అతిధులందరినీ కూర్చోబెట్టే బాధ్యత ఆయన తీసుకున్నాడు. పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణగా కొద్ది రూరంలో ఉంది. ఇప్పటికి చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళు వేశారు . అతిథుల్ని ఆహ్వానించారు . వారిని  ఆశీసులు చేశాక అందరికి ఒకేసారి వడ్డించారు.

ఆ నాటి స్వామీ  కళ్యాణ విందు కడు కమనీయం ,  భోజనాలు వడ్డన  రమణీయం . ముందు విస్తళ్ళపై నీరు చల్లి, తుడిచి, పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు.  వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, ఆయన , అందరికీ ఉన్నంతలో ఏర్పాట్లు చేసాను, లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని అతిథుల్ని వేడుకున్నాడు. భోజనం చేసేది దేవతలు , పెట్టేది శ్రీహరి . అయినా మన్ననా, మర్యాద ఎంతచక్కగా ఉన్నాయో కదా ! 

 అందరి భోజనాలు ముగిశాకా, అందరికి దక్షిణతామ్మూలాలు శ్రీనివాసుడే స్వయంగా ఇచ్చారని పురాణ వచనం. అతిధులందరూ అందరూ భోజనాలు చేసి , తాంబూలాలు పుచ్చుకున్నాక , తిరిగి వారందరినీ  పేరుపేరునా , ‘భోజనమైందా’ అని పరామర్శించాక అప్పుడు  శ్రీనివాసుడు,వకుళామాత, మన్మథుడు,  లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భొజనాలు ముగిసేసరికి సూర్యాస్తమయం అయిందని శృతి వచనం .

అందరి భోజనాలు పూర్తయ్యాక, రాత్రికి అక్కడే గడిపేసి,తెల్లవారుఝామునే మంగళవాయిద్యాల నడుమ మగ పెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది.

అద్భుతంగా వుందికదూ ఈ ఆకాశరాజనందినీ వివాహఘట్టం . అతిథిదేవోభవ అని ఆ శ్రీహరి ఆచరణాత్మకంగా చెప్పినట్టుగా లేదూ ! ఇలా ఆ శ్రీనివాసుని కల్యాణంలో ఇప్పటి మధ్యతరగతి జీవుల కష్టాలకి అద్దంపట్టే , సంఘటనలు ఎన్నెన్నో . అన్ని కమనీయాలే, ఆయనకీ మనకీ తేడాఏమీలేదు ఒక్క జ్ఞానం తప్ప అని తెలియజేసే ఆధ్యాత్మిక సౌరభాలే  ! ఆ పరిమళాన్ని ఎంతగా ఆస్వాదించినా తనివి తీరదు మరి . మరో ఘట్టంలో మళ్ళి కలుసుకుందాం . శ్రీనివాస కమనీయాన్ని కలిసి ఆస్వాదిద్దాం . 

శలవు .

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore