Online Puja Services

సిరి నివాసుడికి నిమిషానికో ఉపచారం

18.220.106.241

సిరి నివాసుడికి నిమిషానికో ఉపచారం - క్షణానికో నైవేద్యం
-లక్ష్మీ రమణ . 

ఆయన కథని యెంత విన్నా తనివితీరదు . ఆస్వామిని యెంత చూసినా మనసు నిండదు . ఆయన ప్రసాదం ఎంత తిన్నా, కోర్కె తీరదు . అదీ తిరుమలేశుని వైభవం . ఆయన రూపులోని మాధుర్యం , ఆయన ప్రసాదంలోని కమ్మదనం . అసలు ఆమాటకొస్తే , ఆయన గురించి ఏం చెప్పినా మోహనరాగమే కదా ! ఆయన వైభవం , అనుగ్రహం , అలంకారం , విశేషం , ప్రాశస్త్యం ఆఖరికి  అలుకకూడా ! ఏడుకొండలవాడు పాపాలు దునిమెవాడేకాదు , తీయని ప్రసాదాలు పంచేవాడు కూడా!!

తిరుపతి నుండీ లడ్డూ వచ్చిందంటే , బంగారాన్ని చూసినంత అపురూపంగా చూస్తాం . అధికం అధికస్య ఫలం అని, ఆ లడ్డూలో కొంచెం ఎక్కువ సమానంగా ఉన్న ముక్క కోసం ఆరాటపడాతం . ఆ ప్రసాదం మహిమ , రుచి అలాంటివి . విశేషం ఏమిటన్నది ఆ ఏడుకొండలవాడికే ఎరుక కానీ , ఆ స్వామికి నివేదించిన పదార్థాలు మాత్రం బహు రుచిగా ఉంటాయనేది వాస్తవం . మనం ఇంట్లో వండి వెంకటేశునికి నివేదన చేసినా , ఆ రుచిలోని మార్పుని గమనించొచ్చు . అందులోకి ఏ పవిత్రత ప్రవేశించి పావనం చేస్తుందో ఆ పరమ పావనికే తెలియాలి .   స్వామి భక్తితో ఫలం తోయం ఏదిచ్చినా స్వీకరిస్తానంటాడు, సత్యాదేవి వేలంవేశాక . కానీ , ఆయన పంచే ప్రసాదం లాగానే , ఆఅమృతహృదయుని లీల అనుభవించిన రుక్మిణమ్మకే ఎరుక కదా ! అందుకే ఆయనకి వేలవేల దండాలు . 

బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీవేంకటేశ్వరుడు నిత్యకల్యాణం పచ్చతోరణంతో అలరారే స్వామి . అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, పుష్పాలంకరణ ప్రియుడు, భక్త ప్రియుడు . అంతేనా ?  అంతకంటే ఎక్కువగా ఆహార ప్రియుడు.  వక్షస్థలంలో లక్ష్మి నివాసితుడైన శ్రీశ్రీనివాసుడికి లోటేమిటి ? ఆయన పోటుకి తిరుగేమిటి ? స్వయంగా వకుళాదేవి కదా పర్యవేక్షించేది . తన కన్నయ్యకి జరిగే నిత్య సేవల్లో సరకరకాల ప్రసాదాలు రుచులురుచులుగా , శుచిగా ఆగమవిహితంగా తయారుచేయిస్తుంది మరి .  బిడ్డరుచులెరిగిన తల్లి కదా , అందుచేత , రుచి లో ఆ ప్రసాదాలు వేటికవే సాటిగా ఉంటాయి. 

ఇప్పటికి కట్టెల పొయ్య మీదే:
 
 వైఖానస అగమోక్తంగా శ్రీవారికి ఇప్పటికి కట్టెల పొయ్య మీదే ప్రసాదాలను తాయారు చేస్తారు. విమాన ప్రదిక్షిణ మార్గంలో శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో ప్రధాన పోటు ఉంటుంది. ఈ పోటులోనే శ్రీ వేంకటేశ్వరునికి నైవేధ్యంగా సమర్పించే అన్నప్రసాదం, పిండి వంటలు తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని ముందుగా క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహ స్వామి వారికీ నైవేద్యం సమర్పించిన అనంతరం శ్రీవారికి గంటానాధాల మధ్య నైవేద్యం సమర్పిస్తారు. ఆ తరువాత శ్రీ వారి ఆలయంలోని పరివర దేవత మూర్తులకు, ఆలయం ఏదురుగా ఉన్న భేడి ఆంజనేయ స్వామి వారికీ నైవేధ్య సమర్పణ జరుగుతుంది.

శ్రీవారి ప్రసాదం - చరిత్ర :

ఇలా శ్రీవారికి నిత్యం నిర్వహించే సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అనేక రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలు నివేదనగా సమర్పిస్తారు. ఆ శ్రీవారి దర్శనం అనంతరం ఆయన అనుగ్రహంగా భక్తులు గ్రహించేది ఈ నైవేద్య ప్రసాదమే కదా  .స్వామి వారి నివేదనకు నాటి రాజుల కాలంలో మణులు, మాన్యాలు సమర్పించారు. ఆలయ గోడలపై శిల శాసనాల్లో ఎక్కువ భాగం ఏ ఏ రాజు ఏ ఏ ప్రసాదానికి ఎంత రొక్కం సమర్పిచారని, ఎన్ని మాన్యాలు ఇచ్చారనే వివరాలే అధికంగా ఉంటాయి. దీనిబట్టే చెప్పవచ్చు స్వామి వారి నైనైవేద్యానికి ఎంత విశిష్టత ఉందనేది . 

త్రికాల నైవేద్యం-వితరణ
 
1933వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన నాటి నుంచి కూడా శ్రీ భగవత్ రామానుజాచార్యులు నిర్దేశించిన పూజ నియమాల ప్రకారం, ఆగమ శాస్త్రోక్తంగా స్వామి వారికి మిరాశి అర్చకులు నైవేద్యం సమర్పిస్తారు. శ్రీ వేంకటేశ్వరునికి త్రికాల నైవేద్యంవితరణ ఉంటుంది. నైవేద్య సమయాలను మొదటి గంట, రెండవ గంట, మూడవ గంటగా పిలుస్తారు. గురు శుక్ర వారలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు.


సిరి నివాసుడికి నిమిషానికో ఉపచారం - క్షణానికో నైవేద్యం  

పేరు వింటేనే నోరూరిపోయేంత రుచికరమైనవి , చూస్తేనే తృప్తి నిచ్చేంత మధురమైనవి , వాసనతోటే ఆకలితీర్చే అమృతోపమానమైన పదార్థాలు స్వామికి రోజంతా నివేదనాలుగా వివిధ సేవల్లో నివేదిస్తూంటారు . 

నిత్యం శేషాద్రి నిలయునికి వైభవంగా 50 రకాలకు పైగా నైవేద్యాలు సమర్పిస్తుంటారు.

సుప్రభాత సమయంలో గో క్షీరం, వెన్న, చక్కెరను నివేదిస్తారు. అనంతరం బంగారు సింహాసనంపై వేంకటేశ్వరుని వెంచేపు చేసి కొలువు (దర్బార్) లో బెల్లంతో కూడిన నువ్వుల పిండిని నివేదిస్తారు. పిమ్మట జరిగే మొదటి నివేదన మొదటి గంటల్లో పెరుగు, వెన్న, మీగడతో తయారు చేసిన మాత్రా అని పిలువబడే ప్రసాదాన్ని ఒడులో అంటే పగిలిన కుండలో ఉంచి గర్భాలయంలో తీసుకెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు. ప్రతి నైవేద్య సమయంలోనూ కులశేఖర పడి వద్దనే ఉంచి పులిహోర, దద్దోజనం, కదంభం, క్షీరాన్నం నివేదిస్తారు. మధ్యాహ్నిక ఆరాధన అనంతరం రెండవ గంటల్లో నిత్య అన్నప్రసాదాలతో పాటుగా శుద్దన్నం, పాయసం, సీరాను నైవేద్యంగా పెడతారు.

కళ్యాణోత్సవం అనంతరం స్వామి వారికి  లడ్డూలు, వడలు, అప్పాలు, దోశతో పాటు చక్కర పొంగలి, పొంగలి, దద్దోజనం, పులిహోరను సమర్పిస్తారు. ఆ తరువాత నిర్వహించే డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలో చక్కర, గసగసాలు, కలకండ, జీడిపప్పు, బాదంపప్పు, ఎందు ద్రాక్ష, ఎందు కొబ్బరితో తయారు చేసే పంచాకజ్జయం అనే ప్రసాదాన్ని సమర్పిస్తారు. సాయంత్రం నిర్వహించే తోమాల సేవలో తోమాల పడి దోశలతో పాటు ముళహోర, కదంభం నైవేద్యంగా సమర్పిస్తారు. అష్టోత్తర శత నామార్చన జరిగిన తరువాత రాత్రి నివేదన మూడవ గంటలో చక్కర పొంగలి, పోగాలి, కదంభం, ముళహోర వంటి అన్నప్రసాదాలు నివేదన చేస్తారు. అనంతరం తిరువీసం గంటలో చక్కర పొంగలి నివేదిస్తారు. స్వామి వారి పవళింపు సేవలో బాగా కాచి చలర్చిన చక్కర వేసిన పాలు, పండ్లు,పంచాకజ్జయం, మేవా (పంచామృతం) నివేదింపబడుతుంది.

శ్రీదేవీ విభునికి రోజుకో నైవేద్యం-పూటకో సంబరం . 
 
తిరుమల ప్రతినిత్యం పండగ సందడితో శోబయమనంగాను నిత్యోత్సవంతో కోలాహలంగా ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో నైవేద్యాన్ని స్వామి వారికి ప్రత్యేకంగా సమర్పిస్తారు. శ్రీవారికి ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజలో పెద్ద వడలు, లడ్డులు అన్నప్రసాదంగా నివేదిస్తారు. బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకంలో క్షీరాన్నంతో పాటుగా నిత్యం సమర్పించే అన్నప్రసాదాలను నైవేద్యంగా పెడుతారు . ఇక గురువారం జరిగే తిరుప్పావైవడ సేవలో 420 కేజిల బియ్యంతో తాయారు చేసిన పులిహోరను రాశిగా అమర్చి నివేదిస్తారు. చాటంత పెద్ద జిలేబిలు, మురుకులు కుడా తిరుప్పావై సమయంలో నివేదన చేస్తారు. శుక్రవారం నాడు పోళీలు, సుగీలను స్వామికి సమర్పిస్తారు. ఇక ఆదివారంనాడు ఆదివారం ప్రసాదం అనే చలిపింది ప్రసాదాన్ని ప్రత్యేకంగా నివేదిస్తారు.

ప్రత్యేక పర్వదినాల్లో- ప్రత్యేక నైవేద్యాలు 

అంతేకాక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ప్రత్యేక పర్వదినాల్లో దోశలు, శనగపప్పుతో చేసిన గుగ్గిళ్లను నివేదిస్తారు. పెసరుపప్పు పణ్ణారం పానకంను ప్రత్యేక నైవేద్యంగా స్వామి వారికీ సమర్పిస్తారు. నెల రోజుల పాటు జరిగే దర్నుర్మాస వ్రతంలో బెల్లం దోశలను వెంకన్నకు నివేదిస్తారు. ఇలా స్వామి వారికి జరిగే నిత్య, పక్ష, వార, మాస, సంవత్సరాది ఉత్సవలో ప్రత్యేకంగా నివేదనలు ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరుడు తన చూపులతో ఆ పదార్థాలన్నింటిని పవిత్రం చేసి, ఆస్వాదించి, తన భక్త శేషాన్ని ప్రసాదాలుగా భక్తులకు ప్రసాదిస్తాడు. 

ఈ  దివ్యప్రసాదాలు స్వీకరించిన భక్తులకు పుష్టి, తుష్టి, సంతుష్టీ కలుగుతాయి. దానితోపాటు కామితార్థాలు నెరవేరతాయి .  అంతుబట్టని రోగాలు సైతం ఇట్టే మాయం అవుతాయి. ఆరోగ్యం సంపూర్ణంగా కలుగుతుంది అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేలే , వకుళమ్మ ఆధ్వర్యంలో తయారైన వంటకాల్ని , శ్రీదేవీ , భూదేవీ కొసరికొసరి స్వామికి తినిపించాక ,మిగిలిన  ఆ పరమ పావనం , పవిత్రమైన శేషభుక్తాన్ని గ్రహిస్తే ,  ఇక వ్యాధిబాధలు భక్తులని దరిచేరే సాహసం చేయగలవా !! 

శ్రీ వేంకటేశ ప్రసాద సిద్ధిరస్థు !! 

శుభం .

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore