ఒకావిడ మింగేసింది

3.231.220.225
*శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా*
 
*ఘంటానాదం విన్నారా?*
 
శ్రీ వారి ఘంట ను ఒకావిడ మింగేసింది ’
 
శ్రీ వైష్ణవ లేక విశిష్టాద్వైత సంప్రదాయం లో శ్రీ వేదాంత దేశికులు అని గొప్ప కవి వందకు పైగా గ్రంధాలు సంస్కృత తమిళభాషలో రచించిన మహా వేదాంతి ఉన్నారు .ఆయన క్రీ. శ. 1268 -1369 కాలం లో ఉన్నారు . 101 సంవత్సరాలు సార్ధక జీవనం గడిపి విశిష్టాద్వైత మత వ్యాప్తికి కృషి చేసినవారు ,నిజమైన దేశికోత్తములు .అసలు పేరు వెంకట నాధుడు .కంచి దగ్గర జన్మించి కంచి ,శ్రీరంగ౦ లలో తమ ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి ,భగవద్రామానుజులు నియమించిన 74 శ్రీ భాష్య సి౦హాసనాధిపతులలో ఒకరైన వ్రాత్యవరదుల వారి శిష్యులు .
 
దేశికులవారి తండ్రి అనంతసూరి .తల్లి తోతాద్ర్యమ్మ లేక తోతాద్ర్య౦బ . శ్రీ వారి ఘంటను మింగిన మహా తల్లి ఈవిడే-అంటే దేశికులవారి తల్లిగారే . మళ్ళీ మధ్యలో సస్పెంసేమిటి ?అనకండి .ఈ దంపతులకు పెళ్లి అయిన 12 ఏళ్ళ దాకా సంతానం కలగలేదు .ఒక రోజు స్వప్నం లో దంపతులకు ఇద్దరికీ విడివిడిగా శ్రీనివాస ,పద్మావతీ దంపతులు ప్రత్యక్షమై ,తిరుమలకు వచ్చి తమ దర్శనం చేసుకొంటే పుత్రుడు జన్మిస్తాడు అని ఆనతిచ్చారు . అంతకంటే కావాల్సిందేముంది? దానికోసమే కదా ఇన్నేళ్ళ ఎదురు చూపు .తిరుమల యాత్ర చేసి పద్మావతీ శ్రీనివాస దర్శం చేసి ,మానసిక ఆనందాన్ని పొందుతారు అనంత సూరి తోతాత్ర్యంబ దంపతులు . ఆరాత్రి తిరుమల శ్రీనివాసుడు చిన్నారి వైష్ణవ బాలుడి రూపం లో తోతాత్ర్యంబ కు కలలో కనిపించి ,శ్రీ వారి ఆరాధనలో వినియోగించే’’ ఘంట’’ను ఆమె చేతిలో పెట్టి మింగమని ఆదేశించాడు .తన ఆజ్నను పాటించ గానే పుత్ర సంతానం కలుగుతుందని అభయమి చ్చి ,ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు .ఆమె భక్తి తో దాన్ని మహా ప్రసాదంగా పటిక బెల్లం ముక్క లా భావించి గుటుక్కున మింగేసింది .
శ్రీ వారి ఆలయ అర్చకులు ప్రభాత వేళ ఆలయం తెరచి చూస్తే ఘంట కనిపించలేదు .ధర్మకర్తలు అర్చకులను అనుమానిస్తారు .అప్పుడు శ్రీనివాసుడు ప్రధాన అర్చకుని లో ‘’ఆవేశించి’’ ఎవ్వరినీ అనుమాని౦చవద్దనీ, తానే ఒక ఒక పుణ్య స్త్రీకి ఆశీర్వాదం గా ఆ ఘంట ను ప్రసాది౦చానని చెప్పాడు .అందరూ సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు .
 
శ్రీ వారి ఘంట ను కలలో మింగినామె అంటే తోతాత్ర్యంబ క్రీ .శ .1268 లో ఒక మగ పిల్లవాడిని ప్రసవించింది .శ్రీనివాస వర ప్రసాది కనుక అ బాలుడికి ‘’వేంకట నాథుడు’’ అని నామకరణం చేశారు .ఆయనే వేదాంత దేశికులై విరాజిల్లారు .కనుక వేదాంత దేశికులను శ్రీ వేంకటేశ్వరుని ‘’ఘంటావతారం’’గా భావిస్తారు .ఘంటానాదం అసుర శక్తులను తరిమేస్తుంది .’’సంకల్ప సూర్యోదయం’’ అనే తమ గ్రంథం లో దేశికులు ఈ విషయాన్ని నిక్షిప్తం చేశారు –‘’ఉత్ప్రేక్ష్యతే బుధ జనై రుపపత్తి భూమ్నా –ఘంటా హరేః సమజ నిష్ట యదాత్మనేతి ‘’
 
అప్పటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయం లో గంట లేదు, అర్చనలో ఘంటా నాదం ఉండదు .గర్భాలయం బయట వ్రేలాడే పెద్ద ఘంట ను మాత్రమే వినియోగిస్తారు .ఇదండీ బాబూ అసలు విషయం .
 
అలాగే ”ముకుందమాల ”రచించిన కులశేఖర ఆళ్వార్ తాను భక్తుల పాద ధూళితో పవిత్రమై శ్రీవారి గర్భ గుడి వాకిట ”గడప”గా ఉండాలని కోరుకుని అలాగే అయ్యారు .దాన్ని కులశేఖర గడప అంటారు .
 
ఆధారం –శ్రీమతి శ్రీదేవీ మురళీధర్ తాను అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంతో వివరణాత్మకంగా,సమగ్రంగా రిసెర్చ్ గ్రంథంలాగా రచించి ఆదరంగా ‘’వేదాంత దేశికులు ‘’ గ్రంథం
 

Quote of the day

The happiness of one's own heart alone cannot satisfy the soul; one must try to include, as necessary to one's own happiness, the happiness of others.…

__________Paramahansa Yogananda