Online Puja Services

గీత అంటే భగవద్గీత మాత్రమేనా ?

3.145.188.160

గీత అంటే భగవద్గీత మాత్రమేనా ?
-బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనామృతం నుండీ గ్రహించబడినది . 

మన ఋషివాజ్ఞ్మయంలో “గీతలు” అనే ప్రక్రియకు చాలా ప్రాధాన్యముంది. ప్రసిద్ధంగా ‘భగవద్గీత’ను చెప్పుకుంటున్నాం. నిజానికి దీనిని కూడా గీతలు అనే అంటారు. ‘గీతాసు ఉపనిషత్సు’ అని బహువచనంలోనే వ్యాసుడు పేర్కొన్నాడు. ‘భగవద్గీత’కాక ఇంకా చాలా గీతలు ప్రాచీన ఆధ్యాత్మిక సాహిత్యంలో దర్శనమిస్తాయి. ‘మహాభారతం’లోనే  ‘అనుగీత’,  ‘హంసగీత’లు ఉన్నాయి. భాగవతంలో ‘గోపికా గీతలు’, ‘భ్రమరగీతలు’, ‘వేణుగీత’, ‘యుగళగీతాలు’, ‘శ్రుతిగీతలు’ ఉన్నాయి. ఇందులో మొదటి నాలుగు ‘మధురభక్తి’ సంప్రదాయాన్ని చెప్పినవి. వేటికవే ప్రత్యేక గ్రంథాలు. ఇవి కాక కపిలగీత, ఉద్దవగీత, అష్టావక్ర గీత, శివగీత, గణేశగీత, శ్రీదేవీ గీత...తదితరాలు కూడా పురాణాల్లో కనిపిస్తాయి. ఇవన్నీ ‘భగవద్గీత అనుకరణలా? అని కొందరికి సందేహం.

కానీ వేదవిద్యను విపులీకరించే పురాణ ప్రక్రియలో ‘గీత’ ఒక సంప్రదాయం. పరమేశ్వరుడు జగద్రక్షణకోసం నామరూపాలతో వ్యక్తమైనా, లేదా అవతరించినా చేష్టద్వారా ఎంత ఉపకారం చేస్తాడో, మాట ద్వారా అంత మేలు చేస్తాడు. మాటద్వారా చేసే మేలు గీత.

గీతల పరమార్థం – ఉపనిశాత్తత్త్వాన్ని ప్రతిపాదించడం, అంతటా వ్యాపించింది ఒకే పరబ్రహ్మం అనే ఎరుక మనకు కలిగించడం వీటి ఉద్దేశం. ఈ అవగాహన వల్ల రాగద్వేషాలు, వైషమ్యాలు సమసి, తత్త్వవిచారణ జరిగి, జ్ఞానవైరాగ్యాలు సమకూరుతాయి.

విశ్వంలో ప్రతివస్తువు భగవచ్ఛక్తితో ఉందనీ, ప్రపంచంలో అన్ని గొప్ప వస్తువులలో దివ్యత్వాన్ని చూపించే విభూతియోగం – అటుపై విడివిడివస్తువులుగా కాక – అన్నీ కలిపి ఏకంగా సమస్తమూ ఈశ్వర స్వరూపమేననే జ్ఞానసిద్ధిని అందించే ‘విశ్వరూప సందర్శన యోగం’ అన్ని గీతలలో సామాన్యాంశాలు.

 భగవద్గీతలో కన్నా ఇతర గీతలన్నింటిలో విస్తృతంగా చెప్పబడిన అంశం ‘పిండోత్పత్తిప్రకరణం’. జీవుడు శరీరాకృతిని ధరించే వ్యవస్థ ఇందులో వర్జితం. అటుపై జీవితాన్నీ, ప్రపంచాన్నీ విశ్లేషించి, సత్యాసత్యాలను(నిత్యానిత్యాలను) తేల్చి చెప్పడం జరుగుతుంది.

 ప్రతి గీతలోను భక్తి, జ్ఞాన కర్మ యోగాలు చెప్పబడ్డాయి. ఈ మూడింటినీ సమన్వయించి, అన్నివిధాల సాధనా మార్గాలను బలపరచడమే వీటి ఉద్దేశం. ధ్యానం, ఉపాసనవంటి వాటిని గీతలన్నీ బోధించాయి.

“సమస్తమూ వ్యాపించిన ఒకే పరమేశ్వరుడున్నాడు. ఆయన సర్వకారకుడు. సర్వాతీతుడు. నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, అనంతుడు. ఆ తత్త్వాన్నే శక్తిగా ఉపాసించినా, శివునిగానో. శ్రీహరిగానో ఆరాధించినా వ్యక్తమయ్యే నామరూపాలతో ఆగిపోకుండా తత్త్వాన్ని తెలుసుకుని, జ్ఞాన సిద్ధిని పొందు. ‘జ్ఞాన సిద్ధియే మోక్షం’ – ఇది సర్వగీతల సారం. ఉపనిషన్మతాన్ని, ఉపాసనా విధానాల్నీ సమన్వయించే వేదాంత విచారణయే గీతలు.

పరిపూర్ణుడైన నారాయణ బ్రహ్మం శ్రీకృష్ణునిగా అవతరించి, చెప్పినవి ‘భగవద్గీతలు’. ఇవి ఈ యుగానికి ఆదిలో అవతరించినవి. పైగా కనిపించిన యాదవ సైన్యాన్ని కాకుండా, ఏకంగా గోచరించే పరమాత్మనే తనకు సారధిగా ఎంచుకున్న అనన్య భక్తుడు, ప్రపన్నుడు, అర్జునుడు. ‘అనేకం’ ప్రపంచ దృష్టి – భిన్న దృష్టి, అది దుర్యోధనునిది.

ఏకం – పరమాత్మ దృష్టి. అర్జునునికి ఈ దృష్టి కలిగినందుననే స్వామి ఎంతో ప్రీతితో స్వయంగా ఏకైక పరతత్త్వాన్ని బోధించాడు. జీవన రథానికి సారధ్యం వహించి సత్పథంలో నడిపి, దుష్ప్రవృత్తులను జయింపజేసి, కైవల్యమనే విజయ సౌఖ్యాన్ని ప్రసాదించే పార్థసారధి బోధించిన గీతాలలో ప్రత్యేకత ఉంది. నిరంతర ఘర్షణలతో జీవిత పోరాటంలో ఈశ్వర స్పృహతో, స్వధర్మాన్ని ఆచరిస్తూనే, పరమాత్మ జ్ఞానాన్ని కైవసం చేసుకునే బ్రహ్మవిద్యా మార్గమిది.

పురాతన పురాణం గీతల మీదట, ఈ కృష్ణగీత – అదే సనాతన వాణిని వినిపిస్తున్నప్పటికీ, సన్నివేశ సందర్భాల వల్ల గొప్ప ఔచిత్యాన్నీ, ఔన్నత్యాన్నీ సంతరించుకుంది. బ్రహ్మానందంలో లీనమైన భాగవతులు పలికిన “గోపికా గీతాలు’ వంటివి కూడా మనసును భగవన్మయం చేసి, కైవల్యాన్ని కలిగించగలవు. కనుకనే అవి కూడా  ‘గీతా’ శబ్దానికి నోచుకున్నాయి.

#gita #bhagavadgita 

Tags: gita, bhagavadgita, 

 

 

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda