Online Puja Services

భగవద్గీత దశమాధ్యాయ పారాయణ మహత్యం

3.141.152.173

భగవంతుడు సదా వెంట ఉండాలంటే, భగవద్గీత దశమాధ్యాయ పారాయణం చేయాలి . 
- లక్ష్మీరమణ 

మనం ఏ పని చేసినా పూర్ణమైన నమ్మికతో చేయాలని భగవద్గీత వివరిస్తుంది . 'సంశయాత్మా వినశ్యతి ' సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేరు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవారే, ఏదైనా సాధించగలరు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. అని చెబుతుంది. అదే విధంగా  జీవించడానికి అవసరమైన కర్తవ్య బోధ చేస్తుంది. నన్ను నమ్మి నీ కృషి నువ్వు చెయ్యి. అలా నన్ను నమ్మి కృషి చేసిన వారివెంటే నేనుంటారని భగవానుడు చెబుతారు . ఆ విధంగా నవమాధ్యాయం వరకూ భగవంతుని పొందడానికి అవసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పారు. పద్మపురాణంలో పరమాత్ముని ఈ విభూది యోగ పారాయణమును చేసిన ఫలాన్ని వివరించారు . ఆ కథని  పరమేశ్వరుడు పార్వతీమాతకి ఇలా చెబుతున్నారు. 

“సుందరీ ! పరమ పావనమైనటువంటి దశమాధ్యాయ మహత్యాన్ని విన్నంత మాత్రము చేతనే స్వర్గము లభిస్తుంది. పూర్వము కాశీపురములో ధీరబుద్ధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద శాస్త్రములన్నీ చదువుకుని, వాటిల్లో పూర్ణమైనటువంటి ప్రజ్ఞని సంపాదించినవాడు.  నందీశ్వరునిలాగా నాయందు (పరమేశ్వరుని యందు) భక్తి కలవాడై , ఇంద్రియములను వశపరచుకొని, మోక్ష మార్గములో ప్రవర్తిస్తూ ఉండేవాడు.  అతడు మనసుని అంతరాత్మలో నిలిపి ఎల్లవేళలా ఆత్మానందంలో రమిస్తూ ఉండేవాడు. అందువల్ల అతడు ఎప్పుడు ఎక్కడికి పోతున్నా నేను (ఈశ్వరుడు) కూడా అతని వెంటే వెళుతూ ఉండేవాడిని. అలానేను అతని వెంటే తిరగడం చూసి భృంగి నన్ను ఈ విధంగా ప్రశ్నించాడు.  “స్వామి! మీరు ఈ విధంగా ఆ భక్తున్ని వెంబడించి పోవడానికి గల కారణమేమిటి? అతని పట్ల మీకు అంతటి అధికమైన వాత్సల్యం ఉన్నట్లయితే, స్వయంగా  మీరు అతనికి దర్శనమీయకూడదా? అతడు మీఅంతటి వారిని వెనకాలే తిప్పుకోవడానికి ఎటువంటి  దానములు, యజ్ఞాలను చేశాడు? తెలుసుకో కోరుతున్నాను కాబట్టి మీరు అనుగ్రహించి చెప్పవలసింది” అని ప్రార్థించాడు. 

అప్పుడు భృంగికి నేను ఆ ధీరబుద్ధి అనే భక్తుని కథని ఇలా చెప్పాను . ఒకనాడు కైలాసంలోని పున్నాగ వనంలో వెన్నెల రాత్రిలో కూర్చుని ఉన్నాను.  ఆ సమయంలో ప్రళయ కాలమువలే భీకరంగా వాయువు వీస్తోంది. భయంకర ధ్వనులతో వృక్షాలు నేలకొరుగుతున్నాయి. పర్వతాలు కూడా ఎగిరిపోతాయేమో అనే విధంగా ఝంఝా మారుతము నలుదశలలో వ్యాపించి ఉంది. అప్పుడు ఆకాశము నుండి కాలమేఘము రూపుదాల్చిందా అన్నట్టున్న  నల్లని వర్ణముతో ఉన్న ఒక పక్షి నా దగ్గరకు వచ్చి వాలింది . చక్కగా వికసించిన ఒక పద్మాన్ని నా ముందుంచి శిరస్సు వంచి ప్రణామం చేసి నన్ను పరిపరివిధాలా స్తుతించింది. 

ప్రసన్నమైన నేను కాకి వలె నల్లని దేహము, హంస వలె శరీరాకారంలో ధరించి ఉన్న నీ పూర్వ వృత్తాంతం ఏమిటి? ఏ ప్రయోజనమును ఉద్దేశించి నీవు ఇక్కడికి వచ్చావు? అని ఆ పక్షిని ప్రశ్నించాను . అప్పుడా పక్షి విధంగా చెప్పింది. “ ఓ ధూర్జటి నేను బ్రహ్మ దేవుని హంసలలో ఒకరిని. నా ఈ దేహమునకు నీలవర్ణము సంభవించిన కారణమును చెబుతాను విను.  సర్వజ్ఞులైనటువంటి మీకు తెలియని విషయం ఏమీ లేదు . అయినప్పటికీ కూడా మీరు నన్ను అడిగారుకానుక వివరంగా చెబుతాను” అంటూ ఇలా చెప్పింది . 

సౌరాష్ట్ర దేశంలో (సూరత్ లో ) పద్మముల చేత అలంకరించబడిన సుందరమైనటువంటి ఒక సరోవరం ఉంది.  బాలచంద్రుని లాగా ప్రకాశిస్తూన్న మృదువైన తామర తూళ్ళని ఆహారంగా తీసుకుని, నేనొకనాడు ఆకాశవీధిలో పోతూ, ప్రమాదవశాత్తున భూమి పైన పడ్డాను. అప్పుడు నాకు స్పృహ తప్పింది.  కొంతసేపటికి సేద తీరి, నేను అలా పడిపోవడానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ కూర్చున్నాను . ఆ సమయంలో నా శరీరం నల్లగా మారిపోయింది. అది నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది . 

ఇంతలో నాకు దగ్గరలోనే ఉన్న సరోవరములోని పద్మముల మధ్య నుండి ఒక వాణి వినిపించింది. “ఓయి విహంగమా! లే !! నీ పతన కారణాన్ని చెబుతాను” అని  వినిపించింది.  వెంటనే నేను ఆ సరోవర మధ్యనికి వెళ్లి అక్కడ ఐదు పద్మములు కల ఒక పద్మలతను చూసి, ఈ మాటలు ఆ పద్మలతే  మాట్లాడుతోందని గ్రహించి, ఆశ్చర్యంతో నమస్కరించాను.   

అప్పుడామె “ఓ కలహంసమా! ఆకాశవీధిని ఎగురుతూ, నువ్వు  నన్ను దాటి నీవు వెళ్లావు.  ఆ పరిణామం చేత నీవు భూమి మీద పడ్డావు.  నీ దేహానికి ఈ కాలిన నల్లని రంగు కలిగింది. నిన్ను చూసి నాకు దయ కలిగి ఎదుట ఉన్న పద్మముతో నీ గురించి సంభాషిస్తూ ఉండగా, నా ముఖ సౌరభము ఆగ్రాణించిన కారణంగా అరువదివేల తుమ్మెదలు స్వర్గాన్ని పొందాయి.  నాలో ఈ అలౌకిక శక్తి జన్మించడానికి కారణం చెబుతాను విను” అంటూ మొదట ఆ పద్మము ఆ స్వర్గాన్ని పొందిన తుమ్మెదల గురించి చెప్పింది . 

ఆ తుమ్మెదలన్నీ కూడా ఇప్పటికి ఏడు జన్మలకు పూర్వము ముని కుమారులుగా ఉన్నారు. వారందరూ ఈ సరోవరంలో తపస్సు చేస్తూ ఉండేవారు. ఒక సమయంలో అపర సరస్వతి అనదగినటువంటి ఒక స్త్రీ వీణ మీటుతూ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండేది.  శ్రవణ మాధుర్యమైన  ఆ ధ్వనికి , ఆమె సౌందర్య శోభకు చకితులైన ముని కుమారులందరూ ఆమెను సమీపించి ఆమెను నేనే ముందు చూసానంటే నేనే ముందు చూసానని ఒకరితో ఒకరు కలహించుకుని, ముష్టి ఘాతములు చేత పరస్పరము తన్నుకొని మృతి చెందారు. అనంతర కాలంలో వారు తమ కర్మానుసారంగా యమయాతనలను అనుభవించారు. ఆ తర్వాత భూమి మీద పక్షులై ఉద్భవించారు.  కాలవసమున దావాగ్నిలో పడి దగ్ధమై తిరిగి గజములై జన్మించి మార్గమున పోవు బాటసారులను చంపుతూ  ప్రమాదవశాత్తున వనములో విషము కలిసిన నీటిని తాగటం వలన యమపురికి చేరుకున్నారు.  ఆ తర్వాత తిరిగి వారందరూ  తోడేలు పిల్లి మొదలైనటువంటి నీచ జన్మములు పొందారు .  చివరకు తుమ్మెదలై జన్మించి నా ముఖగంధాన్ని ఆఘ్రాణించడం విష్ణులోకాన్ని పొందారు. 

ఓ పక్ష్మీంద్రా!  నా ఈ ఐశ్వర్యానికి కారణమును చెబుతాను విను.  ఇంతకు పూర్వము మూడవ జన్మలో నేనొక బ్రాహ్మణ పుత్రికని. అప్పుడు నా పేరు సరోజవదన.  నేను చాలా భక్తితో పెద్దల సేవ చేస్తూ పాతివ్రత్యమునే  ప్రధానముగా పాటిస్తూ, కాలము గడిపే దానిని. ఒకరోజు నా పెంపుడు  మైనా పక్షి చేత పాఠము చదివిస్తూ, పతి  సేవని విస్మరించాను. అందువల్ల కోపితుడైన నా భర్త నన్ను మైనాపక్షివి కమ్మని శపించారు.  

వెంటనే నేను మైనారూపమును పొంది గత జన్మలో పతివ్రత ప్రభావము చేత ఒక మునిగృహంలో నివసిస్తూ ఉన్నాను. అక్కడ ఒక ముని కన్య నన్ను పెంచుకుంటూ ఉండేది.  ఆ గృహ యజమాని నిత్యము విభూది  యోగమైన గీతా దశమా అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు. సర్వపాప పరిహారమైనటువంటి ఆ అధ్యాయమును నేను నిత్యము శ్రవణము చేస్తూ ఉండేదాన్ని. కాలవశమున మృత్యుముఖమును చేరి  స్వర్గములో ఒక అప్సరసనై  జన్మించాను.  అప్పుడు నా పేరు పద్మావతి.  

 ఆ తర్వాత నేను లక్ష్మీ దేవికి చెలికత్తెనయ్యాను.  ఒకరోజు విమానమును అధిష్టించి ఆకాశంలో విహరిస్తూ ఉండగా పద్మముల చేత సుందరంగా ఉన్న ఈ సరోవరాన్ని చూసి అందులో విహరిస్తూ ఉన్నాను. ఇంతలో మహాకోపధారి అయినటువంటి దూర్వాస మహర్షి వస్తుండడాన్ని చూసి  భయపడి,  వస్త్రవిహీనురాలనైన నేను ఒక పద్మలత రూపాన్ని ధరించాను.  ఇదిగో ఐదు పద్మములు గల నన్ను చూడు.  ఇందులో రెండు పద్మాలు నా పాదాలు.  రెండు పద్మాలు హస్తాలు.  ఒక పద్మము ముఖము.  ఈ విధంగా పద్మలత రూపమును దాల్చిన నన్ను చూసి దుర్వాసుడు కోపక్రాంతుడై, ‘ఓసి దుర్మార్గురాల నీవు ఈ రూపములోనే శతవత్సరంలు  ఉండుదువు  గాక అని శపించి, అంతర్హితుడయ్యాడు. 

 పూర్వజన్మములో విభూతి యోగాధ్యాయమును శ్రవణము చేయడం చేత ఈ జన్మలో ఈ విధమైన రూపంలో ఉండి మాట్లాడగలుగుతున్నాను. అటువంటి శక్తి గల నన్ను నువ్వు అంతరిక్షమున వెళుతూ అతిక్రమించుట చేత నేల కూలి పడ్డావు.  నా ఎదుట ఉండగానే నీకు శాప విముక్తి కాగలదు.  నాకుకూడా శాప విమోచనా సమయం  సమీపించింది.  నేనిప్పుడు ఆ దశమా అధ్యాయాన్ని పారాయణా చేస్తాను.  నీవు కూడా వింటూ ఉండు.” అని పలికి ఆ పద్మలత దశమా అధ్యాయాన్ని పారాయణ చేసి ముక్తిని పొందింది. ఆ సమయంలో ఆ పద్మలత చేత ఇయ్యబడిన పద్మాన్ని తీసుకొని ఈ విధంగా నీ వద్దకు వచ్చాను. కాబట్టి ఓ మహేశ్వరా ! నన్ను అనుగ్రహించు.” అని  ఈ విధంగా ఈశ్వరునితో పలికి  ఆ హంస కూడా ముక్తిని పొందింది. 

ఓ భృంగీ ఆ తర్వాత ఆ హంస ఒక బ్రాహ్మణుడై జన్మించాడు. ఆ బ్రాహ్మణుడే ఈ ధీరబుద్ధి. పూర్వజన్మ సంస్కారము వలన  అతడు బాల్యమునుండే దశమా అధ్యాయాన్ని పఠిస్తూ,  నిత్యము అభ్యసించాడు.  దాని ప్రభావం వలనే ఇతడు సర్వదా శ్రీమహావిష్ణువుని సందర్శిస్తూ ఉండేవాడు.  ఈతని దృష్టి ప్రసరణ మాత్రము చేత పంచ మహా పాతకులు కూడా ముక్తిని పొందుతారు . అతడు పురమందు ఉండుట చేత పౌరులు అందరకు ముక్తి కరతలామలకమవుతుంది.  అందువల్లనే  నేను సదా అతని వెంట తిరుగుతూ పోతున్నాను. ఓ బృంగిశా ! భగవద్గీత దశమా అధ్యాయ మహత్యము ఇంత గొప్పది” అని బృంగికి వివరించాను . అని పార్వతీదేవికి వివరించారు ప్పరమేశ్వరుడు . 

 ఇంకా ఇలా చెప్పారు . “ ఓ దేవీ !  బాలురు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా సరే నిత్యము భక్తితో భగవద్గీతలోని దశమాధ్యాయమైన విభూతి యోగాన్ని నిత్యం శ్రవణం చేస్తారో , పటిస్తారో అటువంటి వారందరూ కూడా సర్వ ఆశ్రమ ధర్మాలను ఆచరించిన ఫలితాన్ని పొందుతారు.  ఇంకా  భయంకరమైన జన్మముల్లని కర్మానుసారంగా పొందినప్పటికీ కూడా  జ్ఞానవంతులై తుదకు మోక్షాన్ని పొందుతారు.” 

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !! 

#bhagavadgeetha #bhagavadgita #bhagawadgeeta

Tags: bhagavadgita, bhagavadgeeta, bhagawadgeeta, 

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda