Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 79

3.15.156.140

శ్రీమదాంధ్ర భాగవతం - 79

పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారి 
ప్రవచనం

మీరు అందరూ వ్రతం చేస్తున్నారు కదా! ఈ వ్రతమును ఏ ఫలితం కోసం చేస్తున్నారు? మీ ప్రవర్తన చూస్తుంటే ఎవడో ఒకడు మీ మనస్సులను హరించాడని తెలుస్తోంది. వాడిని భర్తగా పొందాలని మీరు అందరూ వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరికోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి’ అన్నాడు. వాళ్ళు అందరూ నవ్విన నవ్వును బట్టి వాళ్ళందరూ తననే తమ భర్తగా కోరుకుంటున్నారని ఆయనకు తెలిసిపోయింది.ఆయన అన్నారు – నిజంగా మీరు నా యింటికి దాసీలుగా, భార్యలుగా వచ్చి నేను చెప్పినట్లుగా నడుచుకుంటామని అంటే నీటినుండి బయటకు రండి. మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను’ అన్నాడు.ఇక్కడ ‘దాసీ’ అనే పదమును చాలా జాగ్రత్తగా చూడాలి. దాని అర్థం – తాను చేసిన ప్రతి పనివలన తన భర్త అభ్యున్నతిని, తన భర్త కీర్తిప్రతిష్ఠలు పెరిగేటట్లుగా ప్రవర్తించడం. అలా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య. అటువంటి స్త్రీ తానుచేసిన ప్రతి పనితో తన భర్త ఔన్నత్యమును నిలబెడుతుంది. అది అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. నేను చెప్పిన మాట వినాలని మీరు అనుకుంటే నేనొకమాట చెపుతాను. నేను చెప్పినట్లుగా మీరు ప్రవర్తించండి అన్నారు.

ఆయన ఆడపిల్లల వలువలు ఎత్తుకుపోవడం మదోద్రేకంతో చేసిన పని కాదు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి.

“మీరు నన్ను చూసి సిగ్గు పడతారేమిటి? చిన్నతనం నుండి మనం అందరం కలిసి పెరిగాము. శ్రీకృష్ణుడు బయట ఉన్నవాడు కాదు. ఈ కృష్ణుడు లోనున్న వాడు. అన్ని ప్రాణుల హృదయాంతరముల వున్నవాడు శ్రీమన్నారాయణుడు. నేను లేని నాడు అది శివము కాదు శవము. నేను వున్నాను కాబట్టి మీరు మంగళప్రడులాయి ఉన్నారు. వ్రతమును చేయగలుగుతున్నారు. మీరు నన్ను భర్తగా పొందాలనుకున్తున్నారు. వ్రతం చేస్తున్నారు. కానీ ఒంటిమీద నూలుపోగు లేకుండా నీళ్ళలోకి దిగి స్నానములు చేస్తున్నారు. అలా దిగంబరంగా స్నానం చేయడం వలన వ్రతమునందు దోషం వచ్చింది. జలాధిదేవత అయిన వరుణుడి పట్ల అపచారం జరిగింది. వ్రతం చేసేవాళ్ళు వివస్త్రలై స్నానం చేయకూడదు. ఒంటిమీద బట్టతోటే స్నానం చేయాలి. మీరు అపచారం చేశారు. రేపు ఈ వ్రతము పూర్తయిన పిమ్మట కాత్యాయనీ వ్రతం చేశాము కానీ ఫలితం రాలేదని అంటారు. ఇప్పుడు ఆయన ఒక ఆజ్ఞ చేశారు. నిజంగా మీరు వ్రాత ఫలితమును కోరుకుంటే నన్ను భర్తగా మీరు కావాలని అనుకుంటే నేనొక మాట చెపుతాను మీరు చెయ్యండి. 30 రోజుల నుండి మీరు వ్రతం చేయడం లేదు. ప్రతిరోజూ వ్రతభంగం చేస్తున్నారు. మీరు చేస్తున్న వ్రత భంగమునకు మీకు శిక్ష వేయాలి. మీకు ఫలితం ఇవ్వకూడదు. కానీ నేను శిక్ష వేయాలని అనుకోవడం లేదు. మీరు చేస్తున్న వ్రతంలోని భక్తికి నేను లొంగాను. మీ పొరపాటును దిద్దాలని అనుకుంటున్నాను. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం ఒకటి ఉంటుంది. మీరందరూ చేతులెత్తి నమస్కారం చెయ్యండి. అపుడు ప్రాయశ్చిత్తం అయిపోతుంది కాబట్టి మీ వలువలు మీకు ఇచ్చేస్తాను. ఆ వలువలు కట్టుకుని కాత్యాయనీ దేవిని ఆరాధించండి. అపుడు నేను మీ భర్తను అవుతాను’ అన్నాడు స్వామి. వాళ్ళు వినలేదు. అదీ చిత్రం! వాళ్ళు మేము స్త్రీలం. నువ్వు పురుషుడివి. నీవు చెట్టుమీద కూర్చుని చూస్తుండగా మేము ఒడ్డుకు వచ్చి చేతులు ఎత్తి ఎలా నమస్కరిస్తాము? అలా కుదరదు’ అన్నారు.

భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహభావన ఉండకూడదు. మీరు నా భర్త్రుత్వమును అడుగుతున్నారు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యం. మీరు నాయందు ఐక్యమును కోరినప్పుడు రెండు ఎక్కడ ఉంటాయి? రెండుగా ఉండిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలి అంటే రెండుగా వున్నవి అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్లిపోవాలి. ఒకటిగా అవుతూ రెండు తమ అస్తిత్వమును నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి మీరు చేతులెత్తి మ్రొక్కండి. మ్రొక్కి వస్త్రములు తీసుకొనవలసింది’ అని అన్నాడు.

ముందు కొంతమంది గోపికలు అది కుదరదన్నారు. చాలా అల్లరి చేశారు. కృష్ణుడితో వాదించారు. వాళ్ళు ‘ఆడవాళ్ళం ఎలా వెడతాము? కొంటె కృష్ణుడు ఎన్నయినా చెపుతాడు. మనం వివస్త్రలుగా బయటకు వెళ్ళి చేతులు ఎత్తి నమస్కారములు పెడతామా? మనం స్త్రీలం. అలా చేయడం కుదరదు’ అన్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయటకు వెళ్ళకుండా అలా కంఠం వరకు నీళ్ళలో మునిగి వుందాము అనుకున్నారు. మార్గశీర్ష మాసం. మంచు బాగా కురుస్తోంది. వాళ్ళందరూ నీటిలో గడగడ వణికి పోతున్నారు. ఏమి చేస్తే బాగుంటుందా అని తర్జనభర్జనలు చేస్తున్నారు. అప్పుడు అందులో ఒక గోపిక అంది – దేనికి మొహమాటం? ఆయన జగద్భర్త. ఇన్ని లీలలు చేసినవాడు. ఆయన పరమాత్మ అని మనం అంగీకరించాము. అటువంటప్పుడు మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టు పెట్టి కృష్ణుడికి నమస్కరిస్తే మనకి వచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరమునందు భ్రాంతి చేతనే మనం అన్ని కోట్ల జన్మలను ఎత్తాము. ఇవాళ ఈశ్వరుడే మన ఎదురుగా నిలబడి అలా నమస్కారం చెయ్యండి. మీరు చేసిన దోషము విరిచేస్తాను. మీకు ఫలితం ఇచ్చేస్తాను అంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా వున్నా దోషమును ఈశ్వరుడుచెప్పినా సరే ఈశ్వరుడి పేరెత్తనంటే ఆయన చెప్పినది చేయను అని అంటే మనకు ఫలితం ఎక్కడినుండి వస్తుంది? అందుకని నమస్కరించేద్దాము అంది.

మనము ఒక వ్రతం చేస్తాము. వ్రతం చేసేముందు సంకల్పం చెపుతాము. అలా చేసినప్పటికీ వ్రతఫలితం అందరికీ ఒకేలా రాదు. ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. మనస్సు ఎక్కడికో పోతుంది. ఈశ్వరుడిని స్మరణ చేయదు. అటువంటప్పుడు మీకు వ్రత ఫలితం రాదు. క్రతువులో దోషం జరుగుతోంది. వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం జరిగి వుంటే ఈశ్వరుని నామములు చెప్పడం ద్వారా ఆ దోషం విరిగిపోతుంది. నామ స్మరణతో వ్రతమునందు వస్తున్న దోషము పోతుంది. అందుకనే ఒకటికి పదిమాట్లు కనీసంలో కనీసం భగవంతుని నామము జపించాలి. పెద్దలు నామమునకు యిచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదు. నామము క్రతువునందు వున్న దోషమును విరుస్తుంది. అపుడు గోపికలు అందరూ కలిసి నామమును చెప్పి ఈశ్వరుడు చెప్పినట్లు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని, అందరూ కలిసి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకు వచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్లకి ఇచ్చేశారు.

ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ‘ఓ లక్షణవతులారా! మీరు చేసిన వ్రతము ఏమిటో నాకు అర్థం అయింది. కాత్యాయనీ దేవిని మీరు నోచిన నోము దేనికొరకు చేశారో ఆ ఫలితమును నేను మీకు యిచ్చేస్తున్నాను’. కాత్యాయనీ దేవి నోమునోస్తే ఫలితమును కృష్ణుడు యిస్తున్నాడు. ఇద్దరూ ఒకటేననే తత్త్వమును మనం తెలుసుకోవాలి. తత్త్వము తెలుసుకొనక పొతే మీయందు సంకుచితత్వము వచ్చేస్తుంది. ఉన్నది ఒక్కడే. కానీ స్వామి ఎన్నో రూపములలో కనపడుతూ ఉంటాడు. ఉన్న ఒక్క పదార్థము అనేకత్వముగా భాసిల్లుతోంది. ‘ఇకమీదట మీరు చేసిన నోముకు ఫలితమును యిచ్చాను కాబట్టి రాత్రులందు మీరు నాతో రమిస్తారు’ అన్నాడు. ఈ మాట చాలా పెడసరంగా కర్కశంగా ఉంటుంది. ఈ మాటకు అర్థం మనకు రాసలీలలో తెలుస్తుంది.

ఇక్కడ రాత్రులందు అనే మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లింగోద్భవం అర్థరాత్రి జరిగింది. కృష్ణ జననం అర్థరాత్రి జరిగింది. చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరునితో క్రీడించడం అనునది జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మీరు మోక్షం వైపు నడుస్తారనడానికి గుర్తు. ‘అందరూ చీకట్లో ఉంటె మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు. అనగా మీకు చీకటి లేదు. మీకు అజ్ఞానము నివృత్తియై ఈశ్వరుని తెలుసుకుంటాను. ఆ జ్ఞానమును మీకు యిస్తున్నాను’ అన్నాడు. ఈ మాటలు విన్న తరువాత గోపికాంతలు ఆనందంతో మంద దగ్గరకు వెళ్ళారు. పశువుల దగ్గరకు వెళ్ళారు.

‘మంద’ అంటే పశువులతో కూడినది. అయితే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మందకడకు వెళ్ళారు అంటే వారు కేవలం ఆవుల దగ్గరకు, దూడల దగ్గరకు వెళ్ళారని కాదు. పాశముల చేత కట్టబడిన ప్రతిజీవి పశువే. ఇంట్లో వున్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు. ఆయన ఒక పెద్ద పశువు. భార్య మరి కొన్ని పాశాములతో కట్టబడింది. ఆవిడ మరొక పశువు. ఈ పశువుల పాశములను విడిపించగలిగిన వాడు ఎవడు ఉన్నాడో ఆయనే పశుపతి. ‘మీరు పశువులతో కలిసి పశువులలో ఉంటారు. ఎప్పుడూ నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేక కృష్ణ సాయుజ్యమును పొందుతారు. నామము ఏదయినా ఫలితం ఒక్కటే’ అని గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో. కాత్యాయనీ వ్రత ఘట్టంలో యిన్ని రహస్యములు చొప్పించి కృష్ణ పరమాత్మ చేసిన మహోత్కృష్టమయిన లీల ఆ కాత్యాయనీ వ్రతమనే లీల.

యీలీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏమి చేయాలో మనకు అర్థం అవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది. పూజా మంత్రములను చదువుతూ మీ మనస్సు రంజిల్లి పోవాలి. అలా రంజిల్లి పోవాలంటే దానికి రెండే రెండు బాటలు ఉంటాయి. ఒకటి అర్థం తెలియనప్పుడు విశ్వాసము చేత పరమాత్మ నామమును పట్టుకోవాలి. అర్థం తెలిస్తే మీ మనస్సు తనంత తాను రంజిల్లుతుంది. అలా రంజిల్లుతూ నామములు చెపుతూ పూజ చేస్తే ఆ నామము మీ పాపములను దహిస్తుంది. అలా కాకుండా నామము అర్థం తెలియకపోయినా అది పెద్దలు చెప్పిన నామము అర్థం తెలియకపోయినా అది పెద్దలు చెప్పిన నామము, దానిని స్మరించడం వలన ఒక శుభ ఫలితం కలుగుతుంది అని నమ్మి సంతోషంతో మీరు నామము స్మరిస్తూ పూజచేసినా, అప్పుడు కూడా అంటే స్థాయిలో పనిచేస్తుంది. విశ్వారము అంతే. తెలుసుకుని చేసి విశ్వాసము లేకపోతే మాత్రం మరీ ప్రమాదం. ఏమీ తెలియకపోయినా భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు, తెలిసివున్న వాడి కంటే గొప్పవానిగానే పరిగణింపబడతాడు.

అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామ చెప్పగలిగితే జ్ఞానితో సమానమయి పోతావు. ఈ విషయమును ఆవిష్కరించిన లీల కాబట్టి ఈ కాత్యాయనీ వ్రత ఘట్టము పరమోత్కృష్టమయిన ఘట్టము.

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda