Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 68

3.137.187.233

శ్రీమదాంధ్ర భాగవతం - 68

పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారి 
ప్రవచనం

శకటాసుర సంహారం 

కృష్ణ లీలలు అన్నీ కూడా మనకు జీవితంలో చేయి ఇచ్చి పైకి ఎక్కించే లీలలు. శకటాసుర సంహారం చాలా చిన్న ఘట్టం. ఎంత వినినా వేదాంతము వేదాన్తముగా ఎప్పుడూ లోపల నిలబడదు. పక్క ఒక ఆలంబనము ఉండాలి. మీరు అన్నమును అన్నముగా తినలేరు. పక్కన కూరో, పచ్చడో, పులుసో ఉండాలి. అలాగే వేదాంతము ఎప్పుడూ కథగా ఉండాలి. అటువంటి కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు. పరమాత్మ చేసే లీలలు కర్మతో చేసినవి కాదు. అందులో ఏదో పరమార్థం ఉంటుంది. ఆయన లీలల వెనక ఎంతో ఔచిత్యం ఉంటుంది. 

ఒకనాడు కృష్ణపరమాత్మ బోర్లా పడ్డాడు. పిల్లలను మొదట్లో పడుకోపెట్టినపుడు ఎటు పడుకున్నవాడు అటే పడుకుంటాడు. పసిపిల్లవాడు మొదట చేసేపని బోర్లాపడడం. పిల్లవాడు బోర్లాపడితే ఆ రోజున యింట్లో అదొక పెద్ద ఉత్సవం. బోర్లాపడ్డాడు అని బొబ్బట్లు మొదలయిన పిండివంటలు వండుకు తినేస్తారు. 

కానీ యశోద అలా చెయ్యలేదు. ముత్తైదువలను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలను ఇచ్చింది. వాళ్లకి చీరలు, రవికల గుడ్డలు పెట్టింది. బ్రాహ్మణులను పిలిచి వారికి గోదానము చేసింది. ఈశ్వరునికి అభిషేకం చేసింది. యశోద అన్నిటికి దైవం వైపు చూస్తోంది. యశోద అంటే యశస్సును ఇచ్చున్నది అని అర్థము. కీతి ఎటు పక్కనుంచి వస్తుందో జీవితము ఎటువైపు నడవాలో యశోదవైపు నుంచి తెలుస్తుంది. పిల్లాడు బోర్లాపడితే మనం బొబ్బట్లు వండుకు తినడం కాదు! శివాలయమునకు వెళ్ళి అభిషేకం చేయించాలి. లేదా రామాలయమునకో, కృష్ణాలయమునకో వెళ్ళి తులసి పూజ చేయించాలి. నీ మనవడు బోర్లాపడే అదృష్టం ఈశ్వరుడు నీకు సమకూర్చినాడు. పిల్లవాడు వృద్ధిలోకి రావడమును ఈశ్వరానుగ్రహంగా భావించాలి.

నందుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి అందరూ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాదవుల ఐశ్వర్యం అంతా పశువులు, పాడి. వాళ్ళ ఐశ్వర్యం అంతా పాలకుండలు, పెరుగు కుండలు,నేతి కుండలు, అరటి పళ్ళ గెలలు మొదలయినవన్నీ పెట్టారు. బండికి కూడా ఒక తోరణం కట్టేశారు. అక్కడే ఒక మంచం వేశారు. ఆ మంచం మీద ఒక పరుపు వేశారు. ఆ పరుపు మీద కృష్ణుడిని పడుకోబెట్టారు. ఉత్సవం అంతా కృష్ణుడు బోర్లాపడ్డాడు. కాబట్టి అతడికోసం చేస్తున్నారు. కానీ ఉత్సవం వేడుకలో పడి ఈయనని మరచిపోయారు. ఈయనకు ఆకలి వేసింది. పడుకున్న పిల్లాడికి కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆయన పక్కనే బండి ఉన్నది. ఆయనది చిన్ని అరికాలు. దానికి పెసర గింజలంత చిన్నిచిన్ని వేళ్ళు. అందులోనే శంఖం, చక్రం, నాగలి, అమృతపాత్ర మొదలయిన దివ్యచిహ్నములు. అటువంటి కాలితో బండిని ఒక్క తన్ను తన్నాడు.

ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని చక్రములు, ఇరుసు అన్నీ ధ్వంసం అయిపోయాయి. అక్కడి నుండి క్రిందపడిపోయి తుత్తునియలయిపోయాయి. దీనిని చూసి అక్కడ ఉన్న గోపకాంతలు, యశోద, నందుడు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. పిల్లవాడిని చూస్తే చాలా చిన్నవాడు. బండి చాలా పెద్దది. ఆకాశమునకు ఎగిరిపోయేలా బండిని కాలితో తన్నడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అపుడు యశోద పిల్లవాడిని తీసుకుని సముదాయించింది. ‘అయ్యో! నాన్నా! ఆకలి వేసిందా? నీ కాలు బండికి తగిలిందా? కాలేమీ నొప్పి పెట్టలేదు కదా! అని పిల్లాడిని ఎత్తుకుని పాలిచ్చింది. అది అమ్మ హృదయం. అది మాతృత్వమునకు ఉన్న గొప్పతనం. మాతృత్వమునందు దేవతాంశ ప్రవేశించి పరాభట్టారికరూపమై నిలబడినది. అందుకని స్త్రీకి అంత గొప్పతనం వచ్చింది. కృష్ణుడు ప్రదర్శించిన లీల చాలా చిన్నది. దీనిలో వున్న అంతరార్థమును మనం గ్రహించేటందుకు ప్రయత్నించాలి. మనకు ఈ శరీరమును భగవంతుడు ఇచ్చాడు. శరీరము మనం నిర్మించుకున్నది కాదు. అన్నింటిని ‘నావినావి’ అంటారు. ‘నావి’ అని చూపించిన ఈ శరీరములో ఏ ఒక్కటీ తనది కాదు. ఏదీ తాను తేకపోయినా ఈశ్వరుడు దీనిని నిర్మాణం చేశాడు. ఈశ్వరునిచే ఇంత గొప్పగా నిర్మింపబడి ప్రసాదింప బడిన ఈ దేహము దేనికొరకు? ఇది శకటము. ఈ బండిని ఎక్కి మీరు తీరమును చేరగలరు. కానీ మనము ఈ బండినెక్కి తీరమును చేరడం లేదు. ఎందువలన? దీనిని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. కానీ మీరు లక్ష్యం వైపు వెళ్ళడం లేదు. ఈ మానవ శరీర శకతంలో కూర్చుని తాను పొందుతున్న శుభములు ఈశ్వరానుగ్రహములని తలంపడు. తలంపక అన్నీ కూడా ‘నా ప్రజ్ఞ’ అంటూ ఉంటాడు. కానీ ‘ఈ పనులను ఈశ్వరుడు చేయించాడు. అందువల చేయగలిగాను’ అనడు. అలా జీవుడు ఈశ్వరానుగ్రహము తీసివేసి మాట్లాడుతాడు. ఈశ్వరానుగ్రహము వలన తాను ఆపనులను చేయగలుగుతున్నాననే భావన మనసులో ఉండాలి. కానీ అటువంటి భావన ఉన్నప్పుడు మాత్రమే ఈ శకటమును ఎక్కి లక్ష్యమును చేరతారు. లేకపోతే యిది ‘శకటతి యితి శకటః’ అవుతుంది. శం అనగా సుఖము, ఈశ్వరుడు. ఈ శకటమును నీవు ఎందుకు ఎక్కావు తెలుసుకుంటే దానిని ఈశ్వరానుగ్రహమని భావించడం ప్రారంభిస్తాడు. ఈశ్వరానుగ్రహం తప్పు పనులు చేయించదు. సాత్త్వికమైన ప్రవృత్తిలోనికి తిప్పేస్తుంది. 

అనగా యిప్పుడు నీవు ఎక్కిన శకటమునకు ఎవరు సారధిగా ఉన్నాడు? ఈశ్వరుడు. స్థిత ప్రజ్ఞుడయిన సారధి శకటమును వేయికళ్లతో చూసి నడిపిస్తాడు. అపుడు శకటములో ప్రయాణిస్తున్న జీవునికి ఏ ప్రమాదము కలుగదు. సారధియే బుద్ధి. ఆ బుద్ధిని నీది అనకుండా దానిని కృష్ణ పాదముల దగ్గర పెట్టేయాలి. తెలిసికాని, తెలియక కాని పరమభక్తితో భాగవతంలో దశమ స్కంధార్గత శకటాసుర వృత్తాంతమును విన్నంత మాత్రం చేత శకటాసురుడు – జీవుడు ప్రయాణిస్తున్న యీ బండి రాక్షసుడు. ఎప్పుడు? ‘యిదే నేను – అన్నీ నేను చేస్తున్నాను’ అనే భావన ఉన్నప్పుడు. కృష్ణుడు జగదాచార్యుడై వచ్చాడు. అజ్ఞానం బాగా ఉంటుంది కాబట్టి దానిని చీల్చదానికి అర్థరాత్రి పుట్టాడు. ఇపుడు ఆయనేమి చేశాడు? ‘మనః మనః’ అనకురా, ‘నమః నమః’ అను అని చెపుతాడు. అపుడు జీవుడు కర్మచేత, భక్తిచేత, జ్ఞానము వైపు నడుస్తాడు. ఈవిధంగా శకటా సుర సంహారం పైకి చిన్న లీల. అంతరమునందు స్వామి ఎంత పెద్ద రహస్యమును దాచారో చూడండి. 

తృణావర్తోపాఖ్యానం 

క్రుశ్ని చేష్టితముల వెనక ఒక గొప్ప మర్మం దాగి ఉంటుంది. దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్లకి జీవితంలో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక ఉత్తమమైన దశానిర్దేశం జరుగుతుంది. అటువైపుగా ప్రయాణించడం చేత వారు మనుష్య జీవితంలో చేరుకోవలసిన గమ్యమును చేరుకుంటారు. కథా శ్రవణం చేతకూడా భాగవతం మనిషిని ఉద్ధరిస్తుంది. పరీక్షిత్తు శుకమహర్షి చెప్పిన బాహ్యకథనే విన్నాడు. విని మోక్షమును పొందాడు కదా! జీవితంలో అసలు భాగవతం వినడం కాని, చదవడం కాని చాలా గొప్ప విషయములు. భాగవతమును విన్నంత మాత్రం చేత వాని జీవితం కొన్ని కోట్ల జన్మల తరువాత ఒక మలుపు తిరిగింది అని లెక్క.

ఒకనాడు నందవ్రజంలో పక్కన రోహిణి వుండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒడిలో కూర్చోపెట్టుకుని ఆనందంగా ఉంది. హఠాత్తుగా ఒళ్ళో వున్న కృష్ణుడు చాలా బరువయిపోయినట్లుగా అనిపించాడు. పర్వత శిఖరం ఒడిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. పిల్లవాడు ఇంత బరువుగా వున్నాడేమిటి? అనుకుని పిల్లవాడిని పక్కన దింపింది. అక్కడికి కంసుని పనుపున ఒక రాక్షసుడు వచ్చాడు. అతని పేరు తృణావర్తుడు. అతడు పెద్ద సుడిగాలి రూపంలో వస్తున్నాడు. ఆ రావడంలో దుమ్ము పైకి లేచిపోయింది. ధూళి కన్నులలో పడిపోయింది. ఇంతకూ పూర్వం ఎప్పుడూ అసలు కష్టం అంటే ఏమిటో తెలియని శ్రీమన్నారాయణుని అవతారమయిన చిన్ని కృష్ణుని కళ్ళల్లోకి ధూళి పడిపోయింది. 

అందరూ కన్నులు మూసి వేసుకుని ఏమయింది అని చూసేలోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అపహరించి తీసుకుపోయాడు. కేవలం కృష్ణుని సంహరించడమే అతని లక్ష్యం. ‘ఆవర్తము’ అంటే త్రిప్పడం. గిరగిర త్రిప్పుతూ కృష్ణుడిని ఆకాశంలోకి తీసుకు వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపి క్రింద పడెయ్యాలని అతని ఉద్దేశం. సుడిగాలి గుండ్రంగా తిరుగుతూ ముందుకు నడుస్తుంది. గుండ్రంగా తిరుగుతూ కృష్ణుడిని తనతో పాటు పైకెత్తుకుని వెళ్ళిపోయింది.

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha