Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం - 61

3.133.108.241

శ్రీమదాంధ్ర భాగవతం - 61

పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారి 
ప్రవచనం

‘నాయనా వటువా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయిపోయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహా ప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయిపోయాయి. ఇంతకుముందు 99యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది’ అన్నాడు. ఇపుడు బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి ‘ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటాను అని చెప్పలేను. అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది నేను చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుంది~ ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమే. కానీ నేను మూడు రకములుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళదగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఎవరు నన్ను కోరుకుంటుంటారో వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను’ అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి పిల్లవాడా! నిన్ను చూస్తె నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వటువువి. నేను చక్రవర్తిని కాబట్టి నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. కాబట్టి నీకు ఏమి కావాలో కోరుకో’.

వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో 
హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో 
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక ఏమడిగెదో దాత్రీ సురేంద్రోత్తమా!!

ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి? నేను ఏదయినా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిచ్చేస్తాను’ అన్నాడు. అపుడు వామనుడు నవ్వి ‘నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు సంతోషించేవాడిని. కాబట్టి నాకు నీవు ఇవ్వగలిగినడేమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మనమని అడిగాడు అని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చాను అని అంటే నేను బ్రహ్మానందమును పొందేస్తాను. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను’ అన్నాడు. 

అపుడు బలిచక్రవర్తి ‘నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండముల నన్నిటిని జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితె అది ఇస్తాను’ అన్నాడు.

వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు 

గొడుగో. జన్నిదమో, కమండలువొ. నాకున్ ముంజియో, దండమో, 
వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె 
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

‘అవన్నీ ఇస్తానంటావేంటయ్యా! నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకెందుకు ఇవన్నీ? నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు’ అన్నాడు. అపుడు బలిచక్రవర్తి 

ఓ వటువా! ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ, బంగారు చెంబుతో నీళ్ళు పొయ్యి, ఆ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోసేస్తాను. నీళ్ళు పట్టుకొని రా’ అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొందిపోతూ నీళ్ళు పట్టుకు వద్దామని లోపలి వెళుతోంది. ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అపుడు అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చారు. రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట యిచ్చావా? అని అడిగాడు. అపుడు బలిచక్రవర్తి ‘గురువుగారూ, ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగాడు. ఇస్తానన్నాను’ అన్నాడు. అపుడు శుక్రాచార్యులు ‘రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు . ఎందుకు పుచ్చు కుంటున్నాడో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. కాబట్టి నీజోలికి రాలేడు. అందుకని నీతో యుద్ధం చేయకుండా ఇప్పుడు నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును లాగి ఇంద్రునకు ఇస్తాడు. అందుకని మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టను అని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాట యిచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను. 

వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు 
జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప!!

శుక్రాచార్యుల వారు రాక్షస నీతి  చెప్పారు. మనం చేయకూడదు. దానిని ప్రాణ భయంతో ఉన్నప్పుడు రాక్షస నీతిగా ఆయన చెప్పారు. అంతేకానీ ఈనీతి మనందరి కోసం కాదు. ఆయన చెప్పిన విషయం ‘ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు.దాని వలన పాపం రాదు. అందుకని మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగు కూడా ఇవ్వకు. ప్రమాదం. ఆయనను నమ్మకు’ అన్నాడు.

అంటే బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి ‘ఎంతమాట అన్నారు! లక్ష్మీ నాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు. 

ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై 
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ 
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్ 
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే!!

‘ఆయన చేయి లక్ష్మీ అమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆచేయి ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి చేతితో ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాడు. ఒక్కొక్క సారి ఆ చేతితో ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేటట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతోంది. నాకీ అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు’.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? 
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ. 
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై. 
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!!

‘ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. అంతేకానీ ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా!

నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాట పోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను అటువంటి జాబితాలో చేరను. నేను దానం చేసేస్తాను’ అన్నాడు. అపుడు శుక్రాచార్యుడు ‘నేను నా తపశ్శక్తితో అమృతం తాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేశాను. ఇవాళ మళ్ళీ నీవు నీ గురువు మాట కాదన్నావు. కాబట్టి ఇపుడు నిన్ను శపిస్తున్నాను. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు గాక!’ అని శపించాడు

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda