శ్రీమదాంధ్ర భాగవతం- 53

3.230.142.168

శ్రీమదాంధ్ర భాగవతం- 53

పూజ్యశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారు
ప్రవచనం

ప్రహ్లాదుడి మాటలకు హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది. అటువంటి స్థితిలో హిరణ్యకశిపుడు ఒక స్తంభము వైపు వేలు చూపించి ‘ఈ స్తంభమునందు ఉన్నడా?’ అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు ‘అనుమానమా’ అన్నాడు. ‘అయితే చూపించు’ అన్నాడు. ‘నేను చూపించడమేమిటి – నువ్వు అడుగు వస్తాడు’ అన్నాడు ప్రహ్లాదుడు.

వెంటనే హిరణ్యకశిపుడు సింహాసనం మీదనుంచి దిగి గద ఎడమచేతితో పట్టుకుని కుడి అరచేతితో స్తంభం మీద ఒక దెబ్బ కొట్టాడు. అందులోంచి ఒక భయంకరమయిన మెరపు మెరిసింది. అది ప్రళయకాలంలో మెరిసే మెరపు ఎలా ఉంటుందో అటువంటి మెరపు వచ్చింది. ఆ మెరుపు కాంతికి అక్కడ ఉన్న వాళ్ళంతా స్పృహతప్పి పడిపోయారు. ప్రళయకాలమునందు పిడుగులు పడితే ఎటువంటి చప్పుళ్ళు వస్తాయో అంత  భయంకరమయిన ధ్వనులు వచ్చాయి. మహానుభావువు అపారమయిన తేజోవంతమయిన పాదములతో, పాదములకు అలంకరింపబడిన మణి మంజీరములతో, బలిష్ఠమయిన తొడలతో, గుండ్రని పిక్కలతో, అలంకరింపబడిన పట్టు పీతాంబరంతో, దానిమీద పెట్టబడిన మొలనూలుతో, మొలనూలు నుంచి వస్తున్న చిరుగంటల సవ్వడితో, పిడికిలితో పట్టుకోవడానికి వీలయిన సన్నని నడుముతో, గుండ్రంగా తిరిగి లోపలికి వెళ్ళిన నాభితో, కఠినమయిన శిలవంటి విశాలమయిన వక్షస్థలంతో, అనంతమయిన బాహువులతో, శంఖ చక్ర గదా పద్మ తోరణములను గండ్ర గొడ్డలిని పట్టుకున్న వాడై, చక్కటి పొడుచుకు వచ్చిన చుబుకముతో, గాలికి అల్లల్లాడే నవపల్లవము ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి అదురుతున్న రోషముతో కూడిన పెదవితో, ముత్యాలవంటి దంతపంక్తితో, మందరపర్వతం గుహ ఎలా ఉంటుందో అటువంటి నోటితో, నాసికా రంధ్రములతో, తూర్పుకొండ మీద ప్రకాశిస్తున్న రెండు సూర్యులా అన్న నేత్రములతో, విశాలమయిన ఫాలభాగముతో, అంతటా ఆవరించిన ఎర్రటి జుట్టుతో, నవరత్న ఖచితమయిన కిరీటంతో అటూ ఇటూ శిరస్సును కదుపుతుంటే ఆయన రోమములు ఆకాశమంతా వ్యాపించి కొడితే ఆకాశమునందు సంచరించే సిద్ధుల విమానము అన్నీ క్రింద పడిపోయాయి. ఆనాడు స్తంభంలోంచి బయటకు వచ్చి గర్జన చేసి ఘార్ణిల్లితే ఆ ధ్వనులకు సముద్రములు తిరుగుడు పడ్డాయి. భూమి కంపించి బద్దలయి పోయింది. ఎక్కడి వాళ్ళక్కడ సంభీభూతులై ప్రళయం వస్తోందని అనుకున్నారు. ఇటువంటి మూర్తిని చూసి కూడా హిరణ్యకశిపుడు దుస్సాహసం చేశాడు. కత్తి పట్టుకుని స్వామిమీద పడ్డాడు.

స్తంభంలోంచి బయటకు వచ్చి చంద్రహాసమును దూస్తున్న హిరణ్యకశిపుని ఆనాడు తాను ఎలా ప్రతిజ్ఞచేశాడో అలా కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను నాగుపాము ఒడిసి పట్టినట్లు తన ఎడమచేతితో హిరణ్యకశిపుని తొడ పట్టుకొని గడప దగ్గరకి తీసుకు వెళ్ళి ప్రళయకాలంలో వచ్చే ధ్వనిలాంటి గర్జన చేస్తూ ఆ గడప మీద కోర్చుని తన తొడల మీద పడేసి భయంకరమయిన కనుబోమలను వేయి ఇంద్రధనుస్సులను ఒక్కసారి విరిచినట్లు ముడివేసి ఘోరమయిన స్వరూపంతో ఇలా చూస్తుంటే మెరిసిపోతున్న దంష్ట్రలు, ఆ నోరు, కాలనాగు వేలాడుతున్నట్లు వున్న నాలుక, పెద్ద గోళ్ళు అటువంటి స్వామి తన బాహువుల నెట్టి తన గోళ్ళు చూపితుంటే ఆయన స్వరూపమును చూసి కాళ్ళుచేతులు వేలాడేసి ఆయనకు లొంగిపోతే, ఆగ్రహంతో, తన భక్తుడిని ఇన్ని కష్టములు పెట్టాదన్న క్రోధంతో మాట తప్పకుండ, ఇంట్లో కాదు బయట కాదు మధ్యన గడప మీద. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు తన తొడల మీద, అస్త్రము కాదు శస్త్రము కాదు ప్రాణము ఉన్నది కాదు ప్రాణము లేనిది కాదు గోళ్ళచేత. క్రిందకాదు పైన కాదు తొడల మీద, మనిషి కాదు జంతువూ కాదు నరసింహావతారంతో, భయంకరమయిన స్వరూపంతో, విశేషమయిన క్రౌర్యంతో ఆ గోళ్ళను పొట్టలోకి దింపి భేదించి గండ్ర గొడ్డలి పెట్టి ఉరః పంజరమును బద్దలు కొట్టి, హృదయ క్షేత్రమును చేతితో పట్టుకుని గుండె కింద నలిపి వేసి ఆ కండలు తెంపి ముక్కలు చేసి తుంపి అవతల పారేసి, నెత్తురు తీసి దోసిళ్ళతో నోట పోసుకుని ప్రేగులు తీసి మెడలో వేసుకుని ప్రళయ గర్జన చేస్తూ నృసింహావతారం నిలబడింది.

ఆయన వెళ్ళి సింహాసనం ఎక్కుతుంటే అసుర గణములు మీద పడ్డాయి. అనేకమయిన చేతులు పైకెత్తి ఆయుధములతో కొన్ని కోట్ల అసురులను ఒక్కడే మట్టుపెట్టాడు. సింహాసనం ఎక్కి పాదపీఠంమీద పాదములను వుంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు కింపురుషులు అందరూ వచ్చి స్వామిని అనేకవిధముల స్తోత్రము చేశారు. కానీ ఆయన ఘార్ణిల్లుతున్న శబ్దమునకు ఆయన చేస్తున్న ప్రళయ గర్జనలకు ఎవ్వరూ తట్టుకోలేక పోయారు. ఎవ్వరూ దగ్గరకు వెళ్ళలేక అమ్మవారిని చేరి ‘అమ్మా, నీవు నిత్యానపాయినివి. నీవు మాత్రమే ఆ స్వామివారి స్వరూపమునకు ప్రళయ శాంతిని ఉపశాంతిని చేయగలవు. నీవు స్వామివారి దగ్గరకు వెళ్ళు’ అని కోరారు. ఆవిడా అంది ‘ఇదేదో ప్రళయకాలంలో ప్రకాశించే సూర్యబింబంలా ఉన్నది కానీ నేను సేవించే స్వామివారి ముఖ మండలంలా లేదు. నా స్వామిలా ఎప్పుడూ నవ్వుతూ ఉండే దయారసంతో కూడిన ముఖం కాదు. ఇది భార్య దగ్గరకి వెళ్ళడానికి సాహసించే మూర్తి కాదు’ అంది. 

అపుడు బ్రహ్మాదులందరూ స్తోత్రం చేశారు. అయినా ఆయన చేసిన గర్జనలు ఆగలేదు. అపుడు బ్రహ్మగారు ప్రహ్లాదుడిని పిలిచి ‘నాయనా, నరసింహుడు భక్త పరాధీనుడు. నీవు వెళ్ళు’ అన్నారు. ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి పాదాల దగ్గర చాలా తేలికగా సాష్టాంగ పడిపోయాడు. ఇంత ధ్వని చేస్తున్న వాడు, ప్రశాంత పడిపోయి పెద్ద చిరునవ్వు నవ్వి, ‘ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వదించి తలమీద చేయివేసి రెండుచేతులతో పట్టుకు తీసుకువచ్చి తన తొడమీద కూర్చో పెట్టుకున్నాడు. నిజంగా ప్రహ్లాదుడు ఏమి అదృష్టం పొందాదండి!

ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడు ‘స్వామీ నిన్ను బ్రహ్మాదులు స్తోత్రం చేయలేకపోయారు. వేదము తాను ఇక నిన్ను ఆవిష్కరించ లేనని వెనుదిరిగింది. అటువంటి నిన్ను రాక్షస వంశములో పుట్టిన బాలుడిని నేను ఏమి స్తోత్రం చేస్తాను? నిన్ను చేరడానికి. ‘నేను తపం చేశాను, యజ్ఞం చేశాను లేదా ఏదో క్రతువు చేశాను. ఈ కర్మచేశాను అంటే అలా నీవు కర్మలకి లొంగిపోయే వాడవు కావు. ఆ చేసిన కర్మల చేత హృదయ క్షేత్రమునందు శుద్ధి ఏర్పడి వైరాగ్యము ఏర్పడి ఈశ్వరుని సంతతము ధ్యాన నిష్టయందు కొలిచిన వాడెవడో అటువంటి వాడికి లొంగిపోయే స్వరూపం ఉన్నాడివి. అటువంటి స్వామివి ఇవాళ నాయందు కరుణించావు అన్నాడు. ఈ మాటలకు ప్రసన్నుడయి పోయి ఆరోజున నరసింహ స్వామి అన్నారు – ‘ప్రహ్లాదా, ఇలా నన్ను మెప్పించిన భక్తుడు లేడు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నాడు. అపుడు ప్రహ్లాదుడు ‘అందరూ నీ రూపం చూసి భయపడ్డారు. నేను నీరూపం చూసి భయపడలేదు. నాకు నీవెప్పుడూ తండ్రివే. నేను సంసారమునకు భయపడతాను, కామక్రోధములకు భయపడతాను. ‘నేను’ ‘నాది’ అనే భావనలకు భయపడతాను. నాకు వరం ఇస్తానని నన్ను మరల మభ్యపెట్టాలని చూస్తున్నావా తండ్రీ! నాకేమీ వద్దు. సంతతము నీపాదాంబుజ సేవ కటాక్షించు. నీ నామము చెప్పుకునే అదృష్టమును కటాక్షించు. నీ కథలు వినే అదృష్టమును కటాక్షించు. నాకింకేమీ వద్దు’ అన్నాడు. అపుడు స్వామి ‘అసలు నీలాంటి భక్తుడు ఎక్కడ వున్నాడురా, నిన్ను చూసి పొంగిపోతున్నాను. నీవు ఏదో ఒకటి అడగకపోతే నేను నాకు తృప్తి ఉండదు. నా తృప్తి కోసం ఏదో ఒకటి అడగవలసింది’ అన్నారు. అపుడు ప్రహ్లాదుడు ‘ఎంత కాదన్నా హిరణ్యకశిపుడు నా తండ్రి, అజ్ఞాని. తండ్రీ అతడు ఎన్ని నీచ యోనులలోకి వెడతాడో! అలా వెళ్ళకుండా నా తండ్రిని నీ దగ్గరికి చేర్చుకుంటే నా తండ్రి కాబట్టి, నాకు జన్మనిచ్చిన వాడు కాబట్టి నేను సంతోషిస్తాను’ అన్నాడు. అంటే స్వామి పెద్ద నవ్వు నవ్వి ‘ప్రహ్లాదా! నీ చరిత్రము ధన్యము. ఎంత గొప్ప వరం అడిగావు. ఏనాడు నీ తండ్రి నేను కోరలు విప్పి పళ్ళు చూపిస్తూ గోళ్ళు అతని కడుపు పైనుంచి నా నేత్రములతో చూస్తూ వుంటే, అతి దగ్గరగా మహర్షులు, మునీంద్రులు కూడా చూడని నా రూపమును తేజోహీనుడై అలా చూస్తూ ప్రాణములను వదిలాడో ఆనాడే నాకు దగ్గర అయిపోయాడు. అందుకని నీవు నీ తండ్రి గురించి బెంగ పెట్టుకోవద్దు. రాజ్యపాలన చేసి వంశమును వృద్ధిలోకి తెచ్చుకో’ అని స్వామి వారు ఆనాడు మనకందరికీ గొప్ప వరమును కటాక్షించారు. అదే మనందరం కూడా తప్పకుండా స్మరించవలసిన పద్యం.

“శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం
హారము బుణ్య భాగవతుడైన నిశాచరనాధ పుత్ర సం
చారము నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభా
కారము తోడ నే భయము గల్గని లోకము జెందు భూవరా!!

ఈ ప్రహ్లాదోపాఖ్యానమును ఎవరు పరమ భక్తి శ్రద్ధలతో చేతులు కైమోడ్చి ఈశ్వరుడు ఉన్నాడు అన్న పూనికతో వింటున్నారో, ఉగ్రనరసింహ మూర్తియై తన భక్తులను బాధపెట్టిన వాడి పట్ల కోపము తెచ్చుకున్న స్వామి మూర్తి వర్ణనను వింటున్నారో, మళ్ళీ భక్తుడు చేసిన స్తోత్రమునకు ప్రసన్నుడయిన మూర్తి కథను విన్నారో, అటువంటి వారికి ఇంక యమధర్మరాజు దర్శనము ఉండదు. వారికి ఇక్కడే నేను భక్తిని కర్మని వైరాగ్యమును జ్ఞానమును ఇచ్చి, జ్ఞానము చేత మోక్షమును ఇచ్చి వారందరినీ తరింపచేస్తాను అని అభయం ఇచ్చారు.

Quote of the day

The season of failure is the best time for sowing the seeds of success.…

__________Paramahansa Yogananda