శ్రీమదాంధ్ర భాగవతం - 40

44.192.25.113

శ్రీమదాంధ్ర భాగవతం - 40

ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని తాను చేసిన పనులన్నింటిని ఈశ్వరానుగ్రహాలుగా భావించాడు. ఆయన ఏది చేసినా భగవంతుడిని తలుచుకుని చేశాడు. అందువలన గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు, సంసారమును వదిలిపెట్టి వెళ్ళి హిమాలయములలో కూర్చుని కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన ఒక మహాయోగి ఎంతటి తేజస్సుతో కూడిన స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందాడు. ఆయనకు ఒక విచిత్రమయిన కోరిక పుట్టింది. మేరుపర్వతమునకు ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నపుడు భూమికి దక్షిణం దిక్కు చీకటిగా ఉంటుంది. సూర్యుడు దక్షిణదిక్కున ఉంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. ‘నేను గృహస్థాశ్రమంలో ఉండి ఈశ్వరారాధనము చేసి శ్రీమహావిష్ణువు అనుగ్రహం చేత ఇంతటి తేజస్సును పొందాను. గృహస్థాశ్రమ గొప్పతనం ఏమిటో శాశ్వతముగా లోకమునకు తెలిసేటట్లు చేయాలి. ఏడురోజులు ఈ భూమండలమునందు చీకటి లేకుండా చేస్తాను. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలసిపోని రథమునెక్కి అంత తేజోవంతమయిన రథం మీద, సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అంత తేజస్సుతో, సూర్యుడు ఉత్తరమున ఉంటే నేను దక్షిణమున ఉంటాను. సూర్యుడు దక్షిణమునకు వచ్చేసరికి నేను ఉత్తరమునకు వెళ్ళిపోతాను. అలా ఏడురోజులు అవిశ్రాంతంగా తిరుగుతాను. చీకటిలేకుండా అపరసూర్యుడనై తిరుగుతాను. గృహస్థాశ్రమంలో ఉండి పూజ చేసినవాడు ఈ స్థితిని పొందగలడని నిరూపిస్తాను’ అని రథం ఎక్కాడు. ఏడురోజులు మేరువు చుట్టూ ప్రదక్షిణము  చేశాడు. ఆ ఏడురోజులు బ్రహ్మాండమునందు చీకటి లేదు.

ఆయన మేరువును చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రథపు జాడలు పడ్డాయి. ఏడుసార్లు ప్రదక్షిణములో ఏడుజాడలలో లోతుగా పడిన చారికల లోనికి వచ్చి ఏడు సముద్రములు నిలబడ్డాయి. అవి – లవణ సముద్రము, ఇక్షుసముద్రము, సురా సముద్రము, దధి సముద్రము, 

మండోదసముద్రము, శుద్దోదక సముద్రము, ఘృత సముద్రము. రథపు గాడికి గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటూ ఇటూ నీరుండగా మధ్యలో ద్వీపములు ఏర్పడ్డాయి. ఇలా సప్తద్వీపములు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ద్వీపములు అన్నీ ప్రియవ్రతుడు తిరిగినపుడు ఏర్పడిన ద్వీపములు. ఆవిధముగా రథపుగాడి మధ్యలో జంబూ, ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపములు అను ఏడుద్వీపములు ఏర్పడ్డాయి. ఈ ద్వీపముల పేర్లు విన్నంత మాత్రం చేత పాపములు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు.

ఇంత సాధించిన తర్వాత ఇంకా సంసారములో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదు. ఇక నేను ఇప్పటివరకు అనుభవించిన భోగముల వలన కలిగిన సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలికము. దేనివలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతము. ధర్మానుష్ఠానము వలన సత్యమును తెలుసుకున్నాడు. సత్యమునందు నేను లీనమయిపోతానని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఈవిధంగా అరణ్యములకు వెళ్ళి ఘోరమయిన తపమాచరించి తనలోవున్న తేజస్సును ఈశ్వరతేజస్సుతో కలిపి మోక్షమును పొందాడు. బ్రహ్మగారు చెప్పిన మాటలను విని వాటిని మీరు ఆచరించగలిగితే గృహస్థాశ్రమమునందు మీరు సాధించలేనిది ఏదీ ఉండదు.

ప్రియవ్రతుని పెద్దకొడుకు అగ్నీధ్రుడు. అతడు రాజ్యమునకు ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు. ఈయనకు కూడా వివాహం కావలసి ఉన్నది. అందుకని యోగ్యమయిన భార్యను పొందడం కోసమని హిమవత్పర్వత ప్రాంతంలో కూర్చుని బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఈయన యోగ్యతాయోగ్యతలను పసిగట్టి ఒక అప్సరసను పంపించాడు. ఆమె పేరు ‘పూర్వచిత్తి’. పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలుచుకొనుట. పూర్వచిత్తి ఉన్నచోట మోక్షం ఉండదు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే దానికి మీరే ఉదాహరణ. సుఖములే జ్ఞాపకం ఉండి  వానియందే పూనిక ఉన్నట్లయితే మనసు ఈశ్వరుడు వైపుకి తిరగక పోయినట్లయితే ఆ సుఖములు సుఖములు కావనే భావన కలగక పోయినట్లయితే మీరు పూర్వచిత్తికి లొంగుతున్నట్లు భావించుకోవాలి. దానివలన ఫలితం తెలుసుకోవాలంటే అగ్నీధ్రుడి చరిత్ర వినాలి.

ఆగ్నీధ్రుడు ఒక కన్యకామణి కొరకు బ్రహ్మగారిని గురించి తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మగారు వచ్చి చెప్పేవరకు వేచి వుండాలి. ఈయనకు సుఖము అన్నది   కనపడితే చాలు అక్కడ మనసు లగ్నమవుతుంది. ఆయనకు అదొక అలవాటు.  ఆయన పూర్వచిత్తి గజ్జెల చప్పుడు విన్నాడు. కళ్ళు విప్పి చూసి ఆమె అంగాంగ వర్ణన చేశాడు. ఆమెతో మభ్యపెట్టే మాటలు మాట్లాడాడు. ఫలితంగా పూర్వచిత్తి లొంగింది. ఆమెతో కలిసి చాలా సంతోషముగా కాలం గడుపుతున్నాడు. ఇలా గడపగా గడపగా ఆయనకు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భ్రద్రాశ్వువు, కేతుమానుడు అనే తొమ్మండుగురు కుమారులు జన్మించారు. వారు తొమ్మండుగురు అతి బలిష్ఠమయిన శరీరము ఉన్నవారు. పూర్వచిత్తి చాలాకాలం అగ్నీధ్రుడితో సంసారం చేసి ఆఖరుకి తన లోకం వెళ్ళిపోతానని చెప్పి ఈయనను విడిచిపెట్టి తన లోకం వెళ్ళిపోయింది. అగ్నీధ్రుడు పూర్వచిత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడికి వెళ్ళిపోవడం కోసం అనేక యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. చివరకు ఆమె వున్న లోకమును పొందాడు.
  
ప్రియవ్రతునికి అగ్నీద్రుడికి ఉన్న తేడాను ఒకసారి గమనించండి. ప్రియవ్రతుడు తాను చేస్తున్న పని గురించి ప్రశ్న వేసుకుని భార్యను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళాడు. అగ్నీధ్రుడు పూర్వచిత్తి ఉన్న లోకమును పొందాడు. ప్రియవ్రతుడు పునరావృత్తిరహిత శాశ్వతశివసాయుజ్యమును పొందాడు.

అగ్నీధ్రుడి పెద్ద కుమారుడు నాభి. ఆయన మేరుదేవి అనబడే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడతో కలిసి సంతానమును పొందాలి అనుకున్నాడు. ఆయన అనేక యజ్ఞయాగాది క్రతువులను చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే తపస్సు చేసి కొడుకును పొందాడు అగ్నీధ్రుడు. యజ్ఞము చేసి కొడుకును పొందాడు నాభి. నాభి పరిపాలించాడు కాబట్టి ఈయనకు వచ్చిన రాజ్యమును ‘అజనాభము’ అని పిలిచారు. ఈయన చేసిన యజ్ఞమునకు సంతసించి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు. ఈ సందర్భంలో అక్కడ ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది.   యజ్ఞం చేస్తున్న వాళ్ళని ఋత్విక్కులు అంటారు. శ్రీమన్నారాయణ దర్శనం కలుగగానే వారందరూ లేచి నిలబడ్డారు. నాభి కూడా లేచి నిలబడి ‘స్వామీ! నువ్వు పరాత్పరుడవు. నేను నిన్ను ఒక కోరికతో ఆరాధన చేసి యజ్ఞం చేసాను. నీవు ప్రత్యక్షమయినపుడు నిన్ను మోక్షం అడగడము మానివేసి ఒక కొడుకును ప్రసాదించమని అడగడం ఒక ధనికుడిని దోసెడు ఊకను దానం చేయమని అడగడముతో సమానం. అయినా నేను అదే అడుగుతాను’ అన్నాడు. గృహస్థాశ్రమము పట్ల నాభికి వున్న గౌరవం అటువంటిది. తను ఒక కొడుకును కంటే తప్ప పితృఋణం నుండి తాను విముక్తుడు కాడు. ఆ కొడుకు తనను ఉద్ధరించే కొడుకు కావాలి. అటువంటి కొడుకును పొందాలనుకున్నాడు.

శ్రీమహావిష్ణువు ‘అల్పాయుర్దాయం ఉన్న ఉత్తముడు కావాలా? లేక దీర్ఘాయుర్దాయం ఉన్న మహాపాపి కావాలా? అని అడిగాడు. నాభి ఒక తెలివైన పని చేశాడు. నాభి   ‘ఈశ్వరా! నాయందు వున్న భక్తిని నీవే ప్రచోదనం చేసి నాకు దర్శనం ఇచ్చి నన్ను ఉద్ధరించావు. ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టి నిన్నొక కోరిక కోరుతున్నాను. నీలాంటి కొడుకును నాకు ప్రసాదించవలసినదని కోరాడు.  శ్రీమహావిష్ణువు ‘నీవు ఇటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో, ఈ ఋత్విక్కులు నీవు అలా అడుగుతున్నప్పుడు తథాస్తు అన్నందుకు లొంగాలో – ఏమయినా నేను నీకు లొంగవలసిందే. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. నేను ముందు నాభి తినే  ఆహారంలోంచి నాభిలోనికి వెళతాను. నాభి జీర్ణం చేసుకున్న తరువాత నాభి వీర్యకణములను ఆశ్రయిస్తాను. నాభి తేజస్సుగా నాభి బార్య అయిన మేరుదేవిలోకి వెళతాను. మీరు తథాస్తు అన్నందుకు పదినెలలపాటు గర్భస్థమునందు అంధకారంలో పడివుంటాను. నాభికుమారుడనని అనిపించుకుని మేరుదేవి కడుపులోంచి ప్రసవమును పొంది పైకి వస్తాను’ అన్నాడు. భక్తితో కొలిచిన వారికి ఈశ్వరుడు లొంగిపోతాడు!

ఈమాట వినిన తరువాత నాభి చాలా సంతోషించాడు. మేరుదేవి గర్భమును ధరించింది. ‘నల్లనివాడు’ నేను పుడతాను అని వరం ఇస్తే తెల్లగా వచ్చాడు. అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చేయడానికి వచ్చాడన్నమాట! అన్ని రంగులు తెలుపులోంచి పైకి వచ్చి మరల తెలుపులోకి వెళ్ళిపోతాయి అనగా సృష్టి ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతోందో చెప్పే మహాజ్ఞాని రాబోతున్నాడు. దానివలన తనను కొడుకుగా కావాలని అడిగినందుకు పైన వంశం అంతా తరించిపోవాలి. జ్ఞాని పుట్టుకచేతనే కదా ఏడుతరాలు తరిస్తాయి! ఇపుడు తెల్లటివాడిగా వచ్చాడు. ఈ పిల్లవాడిని చూసి మురిసిపోయి నాభి కొడుక్కి ‘ఋషభుడు’ అని పేరు పెట్టుకున్నాడు.

ఋషభుడు బాహ్యపూజ చేసేవాడు కాదు. అంతరమునందు విశేషమయిన యోగమును అనుసంధానము చేస్తూ ఉండేవాడు. ఋషభుడు బాహ్యకర్మలు చేయడం లేదని ఇంద్రునికి కోపం వచ్చి వర్షం కురిపించడం ఆపేశాడు. ‘మన రాజ్యంలో వర్షం పడడము లేదు. క్షామం వచ్చేటట్లు ఉన్నది’ అని తండ్రి వెళ్ళి కుమారుని వద్ద బాధపడ్డాడు. ఋషభుడు ఒకనవ్వు నవ్వి తన యోగబలంతో మేఘములను సృష్టించి తన రాజ్యం ఎంత వరకు ఉన్నదో అంతవరకూ వర్షము కురిపించాడు. దానిచేత ఎక్కడ చూసినా పంటలు పండి సస్యశ్యామలమై పోయి నాభి పరమసంతోష పడేటట్లుగా ఈ ఋషభుడు ప్రవర్తించాడు. పరమ సంతోషమును పొంది ఋషభుడికి పట్టాభిషేకము చేసి తపస్సు చేసుకునేందుకు నాభి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి తపస్సు చేసి బ్రహ్మమునందు కలిసిపోయాడు.

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna