Online Puja Services

శ్రీమదాంధ్ర భాగవతం -31

13.59.218.147

శ్రీమదాంధ్ర భాగవతం -31

కపిలమహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. బిందు సరోవరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. కర్దమప్రజాపతి తన భోగోపకరణములనన్నిటిని భార్యకు ఇచ్చి వెళ్ళాడు. భర్త వెళ్ళిపోగానే ఇన్ని భోగోపకరణముల మీద దేవహూతికి వైరాగ్యం పుట్టింది. ‘నా భర్త అంతటి స్థితిని పొందాడు. నేను ఇంకా ఈ సంసార లంపటమునందు ఉండి పోయాను. నేను ఉద్ధరింపబడాలి’ అని అనుకున్నది. దేవహూతి తన కొడుకు అయిన కపిలమహర్షి దగ్గరకు వెళ్ళి ‘నేను ఇంతకాలం మోహాంధకారములో పడిపోయాను. ఈ ఇంద్రియముల సుఖములే సుఖములు అనుకొని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలము నందు నాకు కూడా సమయము అయిపోతున్నది. నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్త్వమును నాకు బోధచెయ్యి’ అని అడిగింది.

కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీనినే ‘కపిలగీత’ అంటారు. కపిలగీత విన్న వాళ్లకి ఇంతకాలం ఏది చూసి సత్యమని భ్రమించారో, ఆ సత్యము సత్యము కాదన్న వైరాగ్యభావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. ‘అమ్మా! ప్రపంచములో అనేకమయిన జీవరాశులు ఉన్నాయి. అందులో ప్రధానముగా మనుష్యజన్మ చాలా ఉత్కృష్టమైనది. ఈ దేహములు పొందిన వాటిలో ప్రాణములు కలిగినవి మొదట శ్రేష్ఠములు. చెట్లకి ప్రాణం ఉన్నా చెట్లకన్నా గొప్పతనము ఒకటి ఉన్నది. స్పర్శజ్ఞానము కలుగుట చేత వృక్షముల కంటే స్పర్శ జ్ఞానము ఉన్నది గొప్పది. స్పర్శజ్ఞానము ఉన్నదాని కంటే రసజ్ఞానము ఉన్నది గొప్పది. రుచి కూడా చెప్ప గలిగినటువంటి ప్రాణి గొప్పది. దాని కంటే వాసనకూడా చెప్పగలిగిన భృంగములు గొప్పవి. వాటికంటే శబ్దమును వినగలిగిన పక్షులు గొప్పవి. శబ్దములు వినగలిగిన దానికన్నా అనేక పాదములు ఉన్న జంతువు గొప్పది. ఆవు, గేదె, మేక మొదలయిన నాలుగు పాదములు కలిగి సాధుత్వము ఉన్నవి గొప్పవి. నాలుగు పాదములు ఉన్న జీవికంటే శరభము రెండుపాదములు ఉన్న మనిషి సృష్టియందు చాలా గొప్పవాడు.

యథార్థమునకు ఈశ్వరుడు ఒక్కడే. అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనం అందరూ చేయలేరు. ఆ స్వామి పరమభక్తులయిన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు. ఒక మూర్తిని నీ హృదయ స్థానము నందు నిక్షేపించు. ఆ మూర్తిని ధ్యానం చెయ్యి. ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా! పరమ సంతోషంతో నీ మనస్సును ఆయన పాదారవిందముల దగ్గర చేర్చు. స్వామి సౌందర్యమును అనుభవించడం ప్రారంభిస్తే తేనె మరిగిన సీతాకోక చిలుకలా హృదయము దానియందే రంజిల్లడము  మొదలు పెడుతుంది. మనస్సుకి భోగములవైపు వెళ్ళాలని అనిపించదు. ప్రయత్నపూర్వకంగా భక్తియోగమును అనుష్ఠానం చేయాలి. చేతకాకపోతే కనీసం శ్రవణం చేయడము మొదలు పెట్టాలి. ఎవరు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవరు ధ్యానము లోపల చేయగలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరుని యందు ఉత్సాహమును పెంచు కుంటున్నాడో వాడు పునరావృతరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతున్నాడు’ అని చెప్పాడు. ఆ మాటలను విన్న దేవహూతి భోగములనన్నిటిని తిరస్కరించి శ్రీకృష్ణ పరమాత్మను హృదయము నందు నిలిపి ధ్యానము చేయసాగింది. ఈశ్వర స్మరణము వలన జ్ఞానము పొంది, ఈ విషయములు వినిన తరువాత ప్రయత్న పూర్వకముగా భోగములు ఉద్ధరించేవి కావని తెలుసుకుని, వాటిని త్రోసిరాజని వైరాగ్యమును పొంది, భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది, జ్ఞానము వలన మోక్షమును పొంది, శ్రీకృష్ణ భగవానునియందు చేరి శాశ్వతమును పొందినది. ఇది జీవులందరు విని ఉద్ధరింపబడవలసిన మహోత్కృష్టమయిన గాథ.

చతుర్థ స్కంధము – దక్షయజ్ఞం

చతుర్ముఖ బ్రహ్మగారి శరీరంలోంచి కొంత సృష్టి జరిగిందని గతంలో చెప్పుకున్నాము. ఈశ్వరుని దేహములోంచి వచ్చిన సృష్టి కొంత ఉన్నది. అందులో పదిమంది ప్రజాపతులను ఆయన శరీరమునుండి సృష్టించాడు. అటువంటి వారిలో ఆయన బొటనవ్రేలు నుంచి జన్మించినవాడు దక్షప్రజాపతి. నేత్రములలోంచి జన్మించినవాడు అత్రిమహర్షి. అత్రిమహర్షి సంతానమే ఆత్రేయస గోత్రికులు. దక్షప్రజాపతి పదిమంది ప్రజాపతులకు నాయకుడు  దక్షప్రజాపతికి పదహారుమంది కుమార్తెలు. వారికి ఆయన వివాహం చేశారు. అందులో ‘మూర్తి’ అనబడే ఆవిడ గర్భం నుంచి నరనారాయణులు ఉద్భవించారు. వారే బదరీలో తపస్సు చేశారు.  ఉద్ధవుడు ఉండడం, నర నారాయణులు అక్కడ తపస్సు చేయడం, ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళడం – ఇలాంటి వాటివలన బదరీ క్షేత్రమునకు అంత గొప్పతనం వచ్చింది. బదరికావనంలో తిరిగాడు కాబట్టి ఆయనకు ‘బాదరాయణుడు’ అని పేరు వచ్చింది. వ్యాసుడు అక్కడ కూర్చుని తపస్సు చేశాడు. భాగవతమును రచన చేశాడు. 

బ్రహ్మ బొటనవేలు నుండి ఆవిర్భవించిన దక్షప్రజాపతికి కలిగిన కుమార్తెలలో సతీదేవిని రుద్రునకు ఇచ్చి వివాహము చేశారు. దక్షకుమార్తెలలో పదిహేనుమందికి సంతానం కలిగారు. శంకరునికి సతీదేవికి సంతానం కలగలేదు. శివుడు సాక్షాత్తుగా బ్రహ్మము. అటువంటి బ్రహ్మము అయినవాడికి మరల పిల్లలు, హడావుడి ఎక్కడ ఉంటుంది? అటువంటి తత్త్వము కలిగిన శంకరుడు, దక్షప్రజాపతి చాలా అనుకూలముగా, చాలా సంతోషముగా ఉండేవారు.
  
ఒకానొకప్పుడు ప్రజాపతులు అందరూ కలిసి దీర్ఘసత్రయాగం చేశారు. ఎవరయితే ఋత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉండేటటువంటి యాగమునకు సత్రయాగమని పేరు. అక్కడికి బ్రహ్మగారు కూడా వెళ్ళారు. అక్కడ పరమశివుడు కూడా ఉన్నాడు. ఆ సభలోకి దక్షప్రజాపతి ఆలస్యంగా వచ్చాడు. ఆయన కత్తిచేత కూడా నరకబడడు. ఆయన శరీరం అంత మంత్రభూయిష్టం. ఆయనను చూసీ చూడడంతోనే అందరూ లేచినిలబడ్డారు. బ్రహ్మగారు, భర్గుడు మాత్రం లేవలేదు. బ్రహ్మగారు పెద్దవారు కనుక ఆయన లేవనవసరము లేదు. శివుడు బాహ్యము నందు దక్షప్రజాపతికి అల్లుడు. మామగారు పితృపంచకంలో ఒకడు. దక్షుడు లోపలి వచ్చి సభలో లేవని వాళ్ళు ఎవరా అని చూసాడు. అల్లుడు లేవకపోవడముతో కోపం వచ్చేసింది. క్రోధంతో సభలో వున్న వాళ్ళందరినీ చూసి శంకరుని చూపిస్తూ ‘వీడు ఎవడు’ అన్నాడు. అల్లుడు కదా ఎవడు  అంటాడేమిటని అందరూ ఆశ్చర్యపోయారు. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు లేచి ఈయన శివుడని జవాబిచ్చారు. వీనికి శివుడని పేరు ఎవరు పెట్టారు? వీనిని పట్టుకుని శివుడని పిలిస్తే నాకు యజ్ఞోపవీతం లేని వాడికి, ఉపనయన సంస్కారం జరగని వాడికి స్వరం తెలియనివాడికి వేదము పట్టుకెళ్ళి ఇచ్చినట్టు ఉన్నదని పిస్తుంది అన్నాడు.

భయంకరమయిన శివనింద చేశాడు. ఈవిధంగా దక్షుడు ఇన్ని మాటలు అంటే మంగళం చేసేవాడు కాబట్టి ఆయన ఏమీ అనలేదు. ఆయనకు దూషణ, భూషణ రెండూ ఒక్కలాగే ఉంటాయి. అలా ఉండగలగడము చాలా గొప్ప విషయం. దక్షుడికి ఇంకా కోపం వచ్చేసింది. దక్షుడు తన పరిధిని దాటిపోయాడు. ఇన్ని మాటలన్నా నీవు పలకలేదు. లేవలేదు నమస్కరించలేదు. ఇకనుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల యందు నీకు హవిర్భాగము లేకుండుగాక’ అని శపించాడు.  శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భ్రుగువుకు సంతోషం కలిగింది. ఇవన్నీ చూసిన నందీశ్వరునకు ఎక్కడలేని కోపం వచ్చింది. శంకరుని పట్టుకుని ఇంతంత మాటలు అంటాడా? నేనూ శపిస్తున్నాను దక్షుడిని. దక్షుడు సంసారమునందు పడిపోవుగాక! కామమునకు వశుడగుగాక! అని శాపము ఇచ్చాడు. నందీశ్వరుడు శాపం ఇచ్చేసరికి భ్రుగువుకు కోపం వచ్చింది. ఆయన లేచి ఎవరయితే ఈ భూమండలం మీద శంకరుని వ్రతమును అవలంబిస్తారో, అటువంటి వారిని అనుసరించి ఎవరు వెడతారో వారు వేదము నందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండను నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉన్మత్తుల వలె భూమిమీద తిరిగెదరు గాక! అని వేద విరుద్ధమయిన స్థితిని వారు పొందుతారని శాపం ఇచ్చేశాడు. సభలో పెద్ద కోలాహలము రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. సతీదేవి ఎదురువచ్చింది.  శంకరుడు సభలో జరిగిన సంగతి ఏమీ ఆమెకు చెప్పలేదు. కొన్నాళ్ళయి పోయింది. 

ఇపుడు ‘నిరీశ్వర యాగం’ అని కొత్త వ్రతం మొదలుపెట్టాడు. దానికి బృహస్పతి సవనమని పేరు పెట్టాడు. దానికి ముందుగా వాజపేయం చేశాడు. వెళ్ళకపోతే ఏమి శపిస్తాడో అని ఆ యాగమునకు అందరూ వెడుతున్నారు. అతడు చేస్తున్న యాగం మామూలుగా చేయడము లేదు. శంకరుడి మీద కక్షతో చేస్తున్నాడు. శ్రీమహావిష్ణువు, బ్రహ్మగారు రాలేదు.

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore