Online Puja Services

శ్రీ మదాంధ్రభాగవతం -- 22

18.117.107.90

శ్రీ మదాంధ్రభాగవతం -- 22.

ఏది సనాతన ధర్మమో, ఏ సనాతన ధర్మమూ ఈ గడ్డ మీద నిలబడిందో, ఆ సనాతన ధర్మము ఈ గడ్డమీద విమర్శకు గురి అయిపోతుంది. కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది. ఎవరు వేదమును కష్టపడి చదువుకుని, స్వరం తెలుసుకుని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెపుతారో అటువంటి వారికి ఆదరణ తగ్గిపోతుంది. లోకంలో అసలు ఆ వేదమును ఆదరించాలనే బుద్ధి నశించిపోతుంది. ఎవరు తపస్సుతో ఉన్నాడో, ఎవరు లోకంలో ఈ విషయ సుఖములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని యందు ఉన్నాడో వానిని లోకులు రాళ్ళుపెట్టి కొట్టే రోజు వస్తుంది. అలాంటి వానిని చూసి నిష్కారణంగా నిమర్శ చేసే రోజులు బయలుదేరి పోతాయి. పితృదేవతలకు తద్దినములు పెట్టేవాళ్ళు కరువైపోతారు. 

ధర్మం పోతుంది. ఆవులు అవమానింపబడతాయి. ఆవుల్ని కొడతారు, అమ్ముతారు, తోళ్ళు తీసేస్తారు. ఆవుమాంసం తింటారు. ఈ మాటలను కలియుగ ప్రారంభంలోనే చెప్పేసింది. ‘వీళ్ళందరూ బాధలకు గురి అవడం ప్రారంభం అయిపోతున్నది. అందుకు ఏడుస్తున్నానయ్యా’ అంది. అని ఒకమాట చెప్పింది. ‘నీకు సత్యము, శౌచము, తపస్సు దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఇందులో మూడు పాదములు పోయాయి’ అంది.

ఇక్కడ ఎద్దును ధర్మ స్వరూపంగానూ, ఆవును భూస్వరూపం గానూ మనం తలంచాలి. ధర్మ స్వరూపమునకు మూడు పాదములు పోయాయి అంటే ఏమిటి? మీరు ధర్మమన్నా ఆచరించాలి లేదా అధర్మమన్నా ఆచరించాలి. మీరు ధర్మంగా ఉండాలి. అలా ఉండకపోతే మీరు అధర్మం చేసినట్లు. అధర్మమయినవి మూడు తిరగకూడనివి ఇక్కడ తిరుగుతున్నాయి. అవి తిరగబట్టి ధర్మమునకు ఉండే ఈ మూడు పాదములు తెగిపోయాయి. కాని సత్యము అనే పాదము మాత్రము ఎన్నటికీ తెగదు. దీనిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇన్ని అధర్మములు చేసినా, దేవుడి గురించి తిట్టేవాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి వారు తిడుతున్నాడు. లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే వాడు కృతఘ్నుడై తిట్టగలుగుతున్నాడు.

ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈలోకం ఉన్నది. కాబట్టి మారని పదార్థము ఇంకా కాపాడుతోంది. కాబట్టి నాలుగు పాదములలో సత్యమనే పాదము ఒక్కటే నిలబడింది. మరి పోయినవి ఏమిటి? శౌచము – దుష్టజనులతో కూడిన సంగమము వలన పోయింది. జీవితములో అన్నిటికన్నా మీరు స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి తమంత తాముగా 50మంది రావచ్చు. వారంతా మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడూ మీరు మీ స్థితి నుండి జారిపోకూడదు. ఒకనాడు దుష్టుడయిన వాడు మీ ప్రమేయం లేకుండా మీకు తారసపడతాడు. మీతో వచ్చి మాట్లాడతాడు. వాని మాటలను ఒక తామరాకు మీద నీటిబొట్టు పట్టినట్లు పట్టాలి. ఆ మాటలు వెంటనే జారిపోవాలి. వాని మాటలను ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప వాటికి మనసులో స్థానం ఇవ్వకూడదు. అలా స్థానం ఇస్తే శౌచము పోతుంది. శౌచము అంటే ఆచారము, నడవడి, వ్యవహారము. ఇవన్నీ నశించిపోతాయి.

మూడవ పాదము దయ. దయ దేనివలన పోయినది? దయ పోవడానికి ప్రధాన కారణము అహంకారము. అహంకారము వలన దయ నశించి పోతుంది. తనలో ఫాల్స్ ఈగో ఒకటి వృద్ధి చేసుకుంటాడు. ఎప్పుడూ నిన్ను పొగిడేవాడిని ఎక్కువగా నీ దరికి చేర్చకు’ అని చెపుతారు. నీకు తెలియకుండా నీవు నిర్మించుకున్న నీ శీలము అహంకారము వలన నశించిపోతుంది. మీ పక్కన కూర్చున్న వాడు నిరంతరం మిమ్మల్ని పొగడడం మొదలు పెట్టాడనుకోండి – అపుడు మీకు ‘నా అంతటి వాడిని నేను’ అన్న అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారము ప్రబలిపోవడం వలన భూతదయ నశించిపోతుంది. కాబట్టి దయపోవడానికి అహంకారము కారణమయింది. దయ స్థానంలో అహంకారం కనపడుతూ ఉంటుంది. కలిపురుషుడు ఉన్నచోట అహంకారము కనపడుతూ ఉంటుంది. ధర్మమూ స్థానంలో అధర్మము ప్రవేశిస్తోంది. 

మూడవది తపస్సు, తపస్సు సమ్మోహము వలన పోయింది. సమ్మోహము అనేది ఒక విచిత్రమయిన లక్షణము. కాబట్టి ఇప్పుడు ఈ మూడూ పోయాయి. ధర్మమూ పాదములు పోయి అధర్మము పాదములు వచ్చాయి. అధర్మము పాదములు ధర్మమునకు అంటుకుని ఉండవు. అది ధర్మ స్వరూపమయిన వృషభము. అది కలియుగంలో మూడు పాదములు లేకుండా కనపడుతోంది. ఈ మూడు పాదములు ఇంకొక చోట ఉన్నాయి. ‘ఆ మూడు పాదములే ఇప్పుడు తిరుగుతున్నాయి. కాబట్టే ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. నేను ఏడవడానికి కారణం నీమూడు పాదములు లేకపోవడం’ అంది ఆవు.

అక్కడ ఆవు, ఎద్దు అలా ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆ ఆవు, ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన వాడు మిక్కిలి క్రోధంతో ఉన్నాడు. వాని క్రోధం సామాన్యమయిన క్రోధం కాదు. అపారమయిన కోపం ఉన్నవాడు. పైగా చేతిలో కత్తి, కర్ర పట్టుకున్నాడు. ఎంత ప్రమాదమో చూడండి! చూడడానికి రాజుగారిలా ఉన్నాడు. రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకున్తాడో, ఎటువంటి కిరీటము పెట్టుకుంటాడో అటువంటివి పెట్టుకుని పరిపాలకుని వలె ఉన్నాడు. కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. ఎందుకు అంటే వానిలోపల పరిపాలనాంశ లేదు. పరిపాలించడానికి తగిన సంస్కార బలం లేదు. కానీ పరిపాలకుడు అయ్యాడు. ఇది కలియుగ లక్షణం. నృపాకారంలో వచ్చినవాడు బిడ్డ కనపడక ఏడుస్తున్న తల్లిలా శుష్కించి పోయివున్న, ఏమీ చేయకుండా అలా నిలబడిపోయి వున్న ఈ ఆవుని, అపారమయిన కోపంతో తన కాలు ఎట్టి ఒక్కతన్ను తన్నేడు. ఆ ఆవు నేలమీదికి తిరగబడి పోయింది. అక్కడే ఉన్న ఒక కాలుమీద నిలబడిన ఎద్దును మరో తన్ను తన్నేడు. ఎద్దు కూడా క్రింద పడిపోయింది. అలా పడిపోతే వాడు ఊరుకోలేదు. తన చేతిలో ఉన్న దండముతో ఆ రెండింటినీ కొట్టడం ప్రారంభించాడు. అంటే వాడు భూదేవిని కొడుతున్నాడు. భూమి వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయమును మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మమును దేబ్బతీస్తున్నాడు. అదేపనిగా కొడుతున్నాడు. అవి ఏడుస్తూ, కన్నులవెంట నీరు కారుస్తూ కిందపడి లేచి కుంటుతూ ఉన్నాయి. ఆటను కొడుతున్న ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనయిన ఆవు. కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు. అమంగళంగా ఉన్నట్లు కనపడతాడు. పుర్రెల మాల వేసుకున్నట్లు, శ్మశానంలో ఉన్నట్లు, శవ విభూతి రాసుకున్నట్లు ఉంటాడు. కానీ ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేదు. అందుకని ఆయనకు ‘శివ’ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు. ఇప్పుడు రెండు పరస్పర విరుద్ధమయిన విషయములు ఒకరియందు ఎకకాలమునండు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ మంగళమునే చేస్తాడు. శివుడు ఎప్పుడూ అమంగళమును చెయ్యదు. ఆవుకూడా ఎప్పుడూ అమంగళమును చెయ్యదు.

నిరంతరమూ ఉపకారము తప్ప వేరొకటి తెలియని ఆ ఆవుని చూసి పరీక్షిత్తు అన్నాడు – ‘నిన్ను ఇలా కొట్టిన వారు ఎవరు? నీవు చేసిన ద్రోహం ఏమిటి? నువ్వు పాలను ఇస్తావు. నీపేడ ఉపయోగపడుతుంది. నీ మూత్రము ఉపయోగ పడుతుంది. ఎవ్వరికీ పనికిరాని గడ్డిని ఎద్దు తింటోంది. ఎక్కడో జనం వెళ్ళి నీరు తెచ్చుకోని చోట మూతి పెట్టి నీరు త్రాగింది. ఇందులో ఒక రహస్యం వుంది. ఎద్దును పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు. కానీ మూతిమీద కరిస్తే మాత్రం చాచిపోతుంది. అందుకే ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. పుట్టలమీద గడ్డి చాలా బాగా పెరుగుతుంది. అలా పుట్టల మీద పెరిగిన గడ్డిని తినడం ఆవుకి, ఎద్దుకి చాలా ప్రమాదకరం. ఆవు కాని, ఎద్దు కాని పుట్టలమీద గడ్డి తిని గబుక్కున ఎందులోకయినా జారితే గభాలున పైకి రాలేవు.

ఎద్దును చూసి, ‘వీధిలో గడ్డితిని ఏట్లో నీరు త్రాగి కాలం గడుపుకొనే నీ మూడు కాళ్ళను తెగగోట్టిన వాడెవడు? ఎలా నువ్వు అపరాధం చేశావని నమ్మాడు? వాడు భూమిలో దాగున్నా ఆకాశమునకు ఎగిరిపోయినా, వాడు మణులు పెట్టుకున్న భూషణములతో కూడిన వాని భుజములను నా కత్తితో నరికేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతిని వాని పాదములను నరికేస్తాను’ అన్నాడు పరీక్షిత్తు. అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పరీక్షిత్తు వరకు పూనిక ఉన్న రాజు వున్నాడు భూమి మీద.

ఈ మాటలు అనిన తరువాత పరీక్షిత్తు వాటి స్వరూపమును చూసి అక్కడ వున్న వుర్శభము, గోవుల అసలు రూపములను గుర్తుపట్టారు. గుర్తుపట్టి అన్నాడు – ‘అమ్మా, నువ్వు ధరణీదేవివి. ఆయన ధర్మమూ మీ ఇద్దరు ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను. కానీ ఎవరు ఇలా మీ పాదములు తెగగొట్టాడు?’ అని అడిగాడు.

అపుడు వృషభము అంది – ‘కొందరు కాలము అన్నారు. కొందరు కర్మ అన్నాడు. ఇది యుగసంధి అన్నారు. ఇది యుగలక్షణం అన్నారు. ‘ఏవేవో కారణములు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి’ అని చెప్పింది.

అంటే, ఆయన అటూ ఇటూ చూస్తున్నాడు. ఇప్పటివరకు నృపాకారంతో ఉన్నవాడు గభాలున వెళ్ళి పరీక్షిత్తు పాదముల మీద పడిపోయి ‘అయ్యా, నన్ను రక్షించండి. తప్పయిపోయింది. ఆ మూడు పాదములు నేనే నరికేశాను’ అన్నాడు. ధర్మము మూడు పాదములు కలి వలన పోయాయి. అనగా కలి తెంచలేదు. కలి మీలోకి వస్తే మీచేత తెంపించేస్తాడు ధర్మాన్ని. కాబట్టి ఇపుడు కలి ప్రవేశం జరిగింది.

పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore