Online Puja Services

అమృత భాండమే భాగవతం -4

18.227.48.131

భాగం :4. ఏకవింశతి అవతారాలను దాల్చిన ఆదినారాయణుడు !
సేకరణ: లక్ష్మి రమణ 

క్షీరసాగరంలో ఆదిశేషునిపైన  పవళించి ఉన్న ఆ నారాయణుని దివ్యమైన  ఆది స్వరూపాన్ని వివరించిన పోతనామాత్యులవారు, తిరిగి ఆ దేవదేవుని ఏకవింశతి అవతారాల వర్ణని ఇలా చేయసాగారు. సూతుడు శౌనకాది మహామునులకీ వివరిస్తున్న అన్ని అవతారాలకు మూలవిరాట్టయిన అదినారాయణుని దేదీప్యమానమైన దివ్యరూపం ఈ విధంగా ఉంది . “ ఆ ఆదినారాయణుని దివ్యరూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు దర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమలం నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాలనుంచి లోకాలు సమస్తము ఆవిర్భవించాయి.

1) ఆదినారాయణదేవుడు మొదట కౌమార మనే స్వర్గాన్ని ఆశ్రయించి సనకసనందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తు బ్రహ్మణ్యుడై చరించాడు.
2) రెండవసారి యజ్ఞవరాహదేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించాడు.
3) మూడవ పర్యాయం నారదు డనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవధర్మాన్ని బోధించాడు.
4) నాలుగవ అవతారంలో ధర్ముడను వానికి మూర్తి యందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతికోసం అపారమైన తపస్సు చేసాడు.
5) ఐదవ అవతారం కపిలావతారం. దేవహూతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహ్మణునికి తత్త్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు.
6) ఆరవ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైనవారికి ఆత్మవిద్య ప్రబోధించాడు.
7) ఏడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి, ఆకూతికి కుమారుడై, యమాది దేవతలతో స్వాయంభువ మన్వంతరాన్ని సంరక్షించాడు.
8) ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవియందు ఉరుక్రముడను పేర ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు.
9) తొమ్మిదవ జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథుచక్రవర్తి యై భూదేవిని గోవు గావించి సర్వ ఓషధులను పిదికాడు.
10) పదవదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరాంతంలో సంభవించిన జలప్రళయంలో భూరూపమైన నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు.
11) పదకొండవ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునగిపోతున్న మందరపర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించాడు.
12) పన్నెండవ అవతారంలో ధన్వంతరి యై దేవదానవులు మథిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృతకలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు.
13) పదమూడవ అవతారంలో మోహిని వేషంలో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచి పెట్టాడు.
14) పద్నాలుగవ సారి నరసింహమూర్తిగా అవతరించి ధూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు.
15) పదిహేనవ అవతారంలో మాయా వామనుడై బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు.
16) పదహారవమారు పరశురాముడై రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను, ఇరవై ఒక్కమారు సంహరించి ధాత్రిని క్షత్రియహీనం కావించాడు.
17) పదిహేడవసారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారికోసం వేదశాఖలను విస్తరింపజేశాడు.
18) పద్ధెనిమిదవ పర్యాయం శ్రీరాముడై సముద్రబంధనాది వీరకృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు.
19) పందొమ్మిదవ అవతారంలో బలరాముడుగా,
20) ఇరవయ్యో అవతారంలో శ్రీకృష్ణుడుగా సంభవించి భూభారాన్ని హరించాడు.
21) ఇరవై ఒకటవసారి బుద్ధుడై మధ్య గయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరచి ఓడిస్తాడు.
22) ఇరవై రెండవ పర్యాయం కల్కి రూపంతో విష్ణుయశుడనే విప్రునికి కుమారుడై జన్మించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు.

ప్రపంచంలో సరస్సుల నుండి ఎన్నో కాలవలు వెలువడి ప్రవహిస్తూ ఉంటాయి; అలాగే శ్రీమన్నారాయణుని లోనుంచి విశ్వశ్రేయోదాయకములైన ఎన్నెన్నో అవతారాలు ప్రావిర్భవిస్తూ ఉంటాయి; రాజ్యాలేలేవాళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, మహర్షులు ఆ నారాయణుని సూక్ష్మ అంశలచే ఉద్భవించిన వారే; పూర్వం బలరామునిగా, అతని సోదరుడు శ్రీకృష్ణునిగా శ్రీమహావిష్ణువు తానే అవతరించాడు కదా.

1-65-క.|| భగవంతుం డగు విష్ణుఁడు
జగముల కెవ్వేళ రాక్షసవ్యధ గలుగుం
దగ నవ్వేళలఁ దడయక
యుగయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.

భావము:

ప్రతి యుగంలో రాకాసుల చేష్ఠలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయాలలో, భగవంతుడైన శ్రీమహావిష్ణువు విడువక తగిన అవతారాలు ధరించి దుష్టుల శిక్షించి, శిష్టుల రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు.

అత్యంత రహస్య గాథలైన వాసుదేవుని అవతార గాథలు, ఏ మానవుడైతే ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో, అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు.” అని ఇలా ఆ కథా సుధని కొనసాగించారు  సూతుడు . 

“వినండి, ప్రాకృత రూప రహితుడు చిదాత్మస్వరూప జ్ఞానస్వరూపుడు ఐన జీవునికి మహదాదులైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూలశరీరం ఏర్పడింది; గగన మందు మేఘసమూహాన్ని ఆరోపించినట్లూ, గాలి యందు పైకి లేచిన దుమ్ముదుమారాన్ని ఆరోపించినట్లూ అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మ యందు దృశ్యత్వాన్ని ఆరోపించుతున్నారు; జీవునికి కనిపించే ఈ స్థూలరూపం కంటే కనిపించనిది, వినిపించనిది ఐన జీవాత్మ యొక్క ఉత్ర్కాంతి గమనాగమనాల వల్ల మళ్లీ మళ్లీ జన్మిస్తున్నట్లు అనిపిస్తుంది; స్వస్వరూపజ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మరూపాలు రెండు తొలగిపోతాయని, మాయవల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించి నప్పుడు జీవునికి బ్రహ్మసందర్శనానికి అధికారం లభిస్తుంది; సమ్యక్ జ్ఞానమే దర్శనం; సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి, తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మరూపాలను దగ్ధం చేసి, కట్టె లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది, పరమానందంతో విరాజిల్లుతాడని తత్త్వవేత్తలు వివరిస్తారు” అని సూతుడు మళ్లీ చెప్పసాగాడు. 

1-68. చ || "జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ
ర్తనుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్
వినుతులు సేయుచుండుదురు వేదరహస్యములందు నెందుఁ జూ
చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్.

భావము:

“చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మలూ ఆయనని అంటవు. సమస్తజీవుల చిత్తములలోను ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ పరాత్పరునికి విద్వాంసులు జన్మలు కర్మలు కల్పించి, ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు. స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూసినా జీవునికి వలె దేవునికి జన్మలు కర్మలు లేనేలేవు. 

ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కాని తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వ ప్రాణి సమూహ మందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా ఉండి, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు.

సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలావిలాసంగా నానావిధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళా హృదయం లేని అజ్ఞుడు, నాట్యంలోని అందచందాలను అర్థంచేసికొని ఆనందించి, అభినందించ లేనట్లే, వితర్కాలు, కుతర్కాలు నేర్చినవాడు తర్క శాస్ర్త పాండిత్యం ఎంత ఉన్నా, భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సుచేత గానీ వాక్కుల చేతగానీ ఇంత అని గ్రహింపలేడు.

71. ఉ || ఇంచుక మాయలేక మది నెప్పుడుఁ బాయని భక్తితోడ వ
ర్తించుచు నెవ్వఁడేని హరిదివ్యపదాంబుజ గంధరాశి సే
వించు, నతం డెఱుంగు నరవింద భవాదులకైన దుర్లభో
దంచితమైన, యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్.

భావము:

మర్మము అన్నది కొంచం కూడ లేకుండ, ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ, నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు, బ్రహ్మాదులకు సైతం అందుకొన శక్యం కాని భగవంతుని అత్యద్భుతమైన లీలావిశేషాలను తెలుసుకొంటాడు” ఇలా చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు.

ఓ బ్రహ్మణ్యులారా ! మీరు పుణ్యవంతులలో శ్రేష్ఠులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తములై ఎడబాటు ఎరుగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు. అంటూ వ్యాస మునీంద్రుడు తన కుమారుడైన శుకమహర్షికి, ఆ మహర్షి పరిక్షిత్తుకీ వివరించిన ఆ భాగవత కథారససాన్ని వివరించసాగాడు.  వ్యాసునికన్నా అతని కుమారుడైన శుకుడు ఏవిధంగా నిర్వికల్పుడయ్యారో ఆ సూతుడు శౌనకాది మహామునులకీ వివరించడం ఆరంభించారు . ఈ వృత్తాంతాన్ని తరువాతి కథలో చదువుకుందాం . 

(సశేషం . )

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore