Online Puja Services

అమృత భాండమే భాగవతం -2

3.145.88.130

భాగం :2. కలికాల ప్రభావాన్ని దాటే తెప్ప ఏది ? 
సేకరణ: లక్ష్మి రమణ 

కలికాలం లో ధర్మం కేవలం మాటవరసకు మాటమే నిచ్చిఉంటుందని తెలిసిన విషయమే . అటువంటి సమయంలో లోకమంతా కూడా అల్పాయుష్కులుగా , రకరకాలుగా కలిప్రభావం వలన పీడించబడుతూ ఉంటారు .  మరి దానికి పరిష్కారం ఏమిటి ? అత్యంత విస్తరమైనది, దాటరానిది, అణచుట సాధ్యం కానిది, అంతులేనిది, సహింపశక్యముకానిది అయి, అనేక జన్మల నుంచి పేరుకుపోయి, దాటశక్యంగానిదై, గంభీరము, కఠోరము అయిన కల్మషమనే ఈ కలికాలం కారుచిచ్చు మహాభయంకరంగా ఉంటుంది . దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్ఠమైన ఆ నందనందనుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారాపరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు . ఓ సూతముని లోక హితంకోసం ఆ కథలని చెప్పాల్సింది అని మునులు సూతుని అభ్యర్ధించారు . 
 
నైమిశారణ్యములో శౌనకాది మునీంద్రులు వినయశీలుడు, విజ్ఞాన విశేషంచేత వేదాలను, పురాణాలను పండించుకున్నవాడు, అసంఖ్యాకమైన శ్రీమన్నారాయణుని సద్గుణాలను సంకీర్తించేవాడు, సదా కారుణ్యంతో నిండి ఉండేవాడు ఐన సూతుణ్ణి చూసి ఈ విధంగా అన్నారు.“సుధీమణులలో ప్రథమగణ్యుడ వైన సూతమునీంద్రా ! నీవు బ్రహ్మాండాది పురాణాలు, మహాభారతం మొదలైన ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ధర్మములు శాస్త్రములు మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు. అవన్నీ మాకు వివరించి చెప్పావు. ధీమంతులైన వేదవ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ నీ మనసునకు స్ఫురిస్తాయి. ఆ మహానుభావుల అనుగ్రహంవల్ల నీ బుద్ధికి అందని దంటూ ఏదీ లేదు. 

నీవు సర్వజ్ఞుడవు. గురువులైనవారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులెన్నో బోధిస్తారు కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైనట్టి కల్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు.

మునీంద్రా! సూతా! ఈ కలియుగంలోని మానవులందరు సోమరి పోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు. రకరకాల భయంకర వ్యాధులతో పీడింపబడుతున్నవారు. వారు సత్కార్యాలు చేయటానికి అసమర్థులు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు. అని సూతుని వేడుకున్నారు . 

పోతనభాగవతంలోని ప్రధమ స్కంధంలోని 45 వ సీసపద్యాన్ని , ఆటవెలదిని ఆస్వాదిస్తూ ఇంకా ఆ ఋషులు సూతమునిని ఏవిధంగా ప్రశ్నించారో చూడండి . 

సీ || ఎవ్వని యవతార మెల్ల భూతములకు-
సుఖమును వృద్ధియు సొరిదిఁజేయు;
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ-
సంసార బంధంబు సమసిపోవు;
నెవ్వని చరితంబుఁ హృదయంబుఁ జేర్పంగ-
భయమొంది మృత్యువు పరువువెట్టు;
నెవ్వని పదనది నేపాఱు జలముల-
సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ;

ఆ || దపసులెవ్వాని పాదంబు దగిలి శాంతి
తెరువుఁగాంచిరి; వసుదేవదేవకులకు
నెవ్వఁ డుదయించెఁ; దత్కథలెల్ల వినఁగ
నిచ్చ పుట్టెడు; నెఱిఁగింపు మిద్ధచరిత!

భావము:

ఏ మహానుభావుడు అవతరించడం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్నీ, అభివృద్ధినీ అందిస్తుందో, ఏ మహానుభావుడి దివ్యనామాన్ని ఎల్లప్పుడు ఉచ్చరించటం వల్ల భవబంధాలన్నీ పటాపంచలు అయిపోతాయో, ఏ మహానుభావుడి పవిత్ర చరిత్రని భావించిన మాత్రంచేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుడి పాదాల నుంచి ఉద్భవించిన నదీజలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు సమస్తం నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుడి చరణాలను సమాశ్రయించి సంయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధించారో, ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దుల బిడ్డడుగా జన్మించాడో, ఆ మహానుభావుడైన వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చట పడుతున్నామయ్యా. ఓ సచ్చరిత్రుడా! సూతా! అవన్నీ మాకు వినిపించు.

పరమ ధీమంతుడ వైన సూతమహర్షీ! భయంకర పాపాలనే అరణ్యాలను కాల్చివేయాలి అంటే, శ్రీహరి నామ సంకీర్తనలు అనే దావాగ్ని జ్వాలలే కావాలి; సంసార దుఃఖాలనే మేఘాలను పారద్రోలాలంటే, వాసుదేవ సందర్శనము అనే వాయువుల సమూహమే కావాలి; పరితాపాలు అనే ఏనుగుల సమూహాన్ని చంపాలంటే, శ్రీమన్నారాయణ ధ్యానము అనే సింహమే కావాలి; అరిషడ్వర్గము అనే అంధకార సమూహాన్ని తొలగించా లంటే, హరి స్మరణమనే సూర్యకాంతి కావాలి; సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే, విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి; వేలకొద్దీ మాట లెందుకు గాని, మాకు శ్రీహరి మాహాత్మ్యాన్ని వినిపించండి మహానుభావా!

ఓ సూతమహర్షీ! మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా, కలికాల పాపాలను పోగొట్టుకొని తరించాలని కోరుతున్న మాకు నీవు కన్పించావు.

ఓ సూతమహర్షీ! ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న తరువాత, ఆధారంలేని ధర్మం దిక్కుమాలి, చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించు.” అని పరి పరి విధాలుగా ఆ సూతమహర్షిని కీరించి, కలిదోషాన్ని ఎలా జయించాలో వివరించమని మహర్షులందరూ ప్రార్థించారు . ఆ నైమిశారణ్యంలోని ప్రతి చెట్టూ, పుట్టా , పూవు , పండూ ఇలా జీవమున్న ప్రతిదీ చెవులొగ్గి ఆ సూతమహాముని ఏమంటారా ? ఏ అమృతధార వంటి కధనాన్ని తన మృదుమధురమైన వాణిలో వినిపిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది . మరో భాగంలో ఆయన ఏమన్నారో తెలుసుకుందాం . 

(సశేషం )   

Quote of the day

A small body of determined spirits fired by an unquenchable faith in their mission can alter the course of history.…

__________Mahatma Gandhi