Online Puja Services

శ్రీ మదాంధ్రభాగవతం -- 17.

18.224.44.108

శ్రీ మదాంధ్రభాగవతం -- 17.

ఒకచోట అంబ ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తపస్సు చేసిందని పేర్కొనడం జరిగింది. స్కందుడు ప్రత్యక్షమై ‘ఏమి నీ కోరిక’ అని అడిగాడు. అపుడు ఆమె ‘భీష్ముడిని నిగ్రహించాలి’ అని చెప్పింది. అపుడు ఆయన ‘అది నేను చెప్పలేను. భీష్ముడికి వరం ఉంది. చేతిలో ధనుస్సు ఉండగా ఆయనను ఎవరూ చంపలేరు. పైగా ఆయన మహాధర్మజ్ఞుడు. అందుకని నేను నీకొక పుష్పమాలను ఇస్తాను. ఈ పుష్పమాల మేడలో వేసుకొని ఎవరు యుద్ధం చేస్తే వారు భీష్ముడి మీద గెలుస్తారు’ అని ఆమెకు ఒక పుష్పమాలను ఇచ్చాడు. మేడలో ఈ పుష్పమాల వేసుకుని భీష్ముడితో యుద్ధం చేయమని ఆమె ఎందఱో రాజులను అడిగింది. అపుడు వాళ్ళు ‘మహాధర్మాత్ముడయిన భీష్మునితో మేము ఎందుకు యుద్ధం చేయాలి? ఆయనను ఎందుకు సంహరించాలి? ఆ మాలను మేము వేసుకోము. ఆయనతో యుద్ధం చేయము’ అన్నారు. అపుడు ఆమె ఆ మాలను ద్రుపద రాజుగారి ఇంటిరాజద్వారం మీద వేసి మళ్ళీ తపస్సు చేసింది. ఈసారి రుద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘ఏమికావాలి’ అని అడిగాడు. అంటే ‘భీష్ముడిని సంహరించాలి’ అంది. అపుడు రుద్రుడు ‘నీకు ఈ జన్మలో ఆ కోరిక తీరదు. వచ్చే జన్మలో నీకోరిక తీరుతుంది. కాబట్టి నీ శరీరం విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోవలసింది’ అని చెప్పాడు. అపుడు ఆమె యోగాగ్నిలో శరీరమును వదిలివేసి మరల పుట్టింది.

ఆమె స్త్రీగా జన్మించింది. ఆడదయి పుడితే భీష్ముడు యుద్ధం చేయడు. అందుకని మగవాడిగా మారాలి. అందుకని మరల తపస్సు చేసి మగవానిగా మారింది. అందుకే ‘శిఖండి’ అని పేరు పెట్టారు. అందుకే ఎవరయినా ఎంతకీ వదిలిపెట్టకుండా ప్రాణం తీసేస్తున్నారనుకొండి – అపుడు వీడెక్కడ దొరికాడు రా నాకు –శిఖండిలా దొరికాడు’ అంటాము. శిఖండి వెనుక అంత కథ ఉంది. శిఖండి ద్రుపదుని కుమారుడిగా జన్మించాడు. జన్మించి పెరిగి పెద్దవాడవుతున్నాడు. పాండవ పక్షంలో చేరాడు. మహానుభావుడు భీష్ముడు తన జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలను ఎదుర్కొన్నాడు. ఇంత కష్టపడి విచిత్ర వీర్యునికి అంబిక, అంబాలికలను ఇచ్చి వివాహం చేశాడు. వివాహమయిన కొంతకాలమునకు విచిత్ర వీర్యునికి క్షయవ్యాధి వచ్చి చచ్చిపోయాడు. అంబిక, అంబాలిక విధవలు అయిపోయారు. వంశము ఆగిపోయింది. దాశరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీ దేవికి పుట్టిన కొడుకులకు రాజ్యం ఇమ్మన్నాడో ఆ కొడుకులు ఇప్పుడు లేనే లేరు. మనవలూ లేరు. వంశం ఆగిపోయింది. అపుడు సత్యవతీ దేవియే భీష్ముడిని పిలిచింది. ‘భీష్మా, వంశము ఆగిపోయింది. యుగ ధర్మముననుసరించి ఇది తప్పు కాదు. నా కోడళ్ళు అయినటువంటి అంబిక, 

అంబాలికలయందు వాళ్ళు ఋతు స్నానము చేసిన తరువాత నీవు వారితో సంగమించు. అలా సంగమిస్తే మరల వంశము నిలబడుతుంది. వంశము కోసమని అలా చేయడంలో దోషం లేదు. 

అపుడు భీష్ముడు –‘అమ్మా, నేను ఆనాడు ప్రతిజ్ఞచేశాను. నేను ఏ స్త్రీయంపు కూడా అలా ప్రవర్తించను. నేను బ్రహ్మచర్య నిష్ఠయందు ఉన్నవాడను. అందుకని వంశము లేకపోతే నేను ఏమీ చేయలేను. కానీ నేను మాత్రం అలా ప్రవర్తించను. దీనికి ఒక్కటే పరిష్కారం. ఎవరైనా బ్రహ్మ జ్ఞాన సంపన్నుడై, కేవలం వర కటాక్షం కోసమని సంగమించడం తప్ప శరీరమునందు అటువంటి కోర్కె లేని ఒక బ్రాహ్మణుని ఒక బ్రహ్మ జ్ఞానిని వేడుకో’ అన్నాడు. అపుడు సత్యవతీ దేవి వ్యాసుడిని ప్రార్థన చేసింది. తరువాత వ్యాసుల వారి ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు జన్మించడం జరిగింది. ధృతరాష్ట్రునకు దుర్యోధనాదులు జన్మించారు. పాండురాజుకి పాండవులు జన్మించారు. పాండురాజు మరణించాడు. ఇంతమందిని సాకుతూ తాతగారయి గడ్డాలు నెరిసిపోయి మహా ధర్మజ్ఞుడయి భీష్ముడు వీళ్ళందరికీ విలువిద్య నేర్పించి ద్రోణాచార్యులను గురువుగా పెట్టి ఆ వంశమును సాకుతూ నడిపిస్తున్నాడు.

ఆయన కళ్ళముందే పాండురాజు పుత్రులకు ధృతరాష్ట్రుని పుత్రులకు మధ్య బ్రహ్మాండమయిన కలహం బయలుదేరింది. అపుడు ఇంత ధర్మం తెలిసిన భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు. దుర్యోధనుని పక్షంలో ఉండిపోయారు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే కానీ ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నానని అన్నాడనుకోండి అపుడు అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు. దుర్యోధనుడు భీష్ముడిని, కర్ణుని ఈ ఇద్దరిని చూసుకుని యుద్ధమునకు దిగాడు. సర్వసైన్యాది పత్యం ఇచ్చేటప్పుడు వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది. భీష్ముడు బ్రతికి ఉన్నంతకాలం తానసలు యుద్ధ భూమికి రానన్నాడు కర్ణుడు. 

భీష్ముడు ఎన్నోమార్లు ధర్మం చెప్పాడు. ‘అర్జునుని ఎవరూ గెలవలేరు. పాండవుల పట్ల ధర్మం ఉన్నది, వాళ్ళు నెగ్గుతారు’ అని. అటువంటి భీష్ముడిని దుర్యోధనుడు పట్టుకును వ్రేలాదవలసిన అవసరం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి వుంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా! భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు? అలాంటి భీష్ముడిని ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బానములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? భీష్మం చ ద్రోణం చ జయద్రథం చ’ అని పరమాత్మ వాళ్ళందరినీ తానే సంహరిస్తున్నానని గీతలో చెప్పాడు. 

భీష్ముడిని అన్ని బాణములతో ఎందుకు కొట్టాడు? ఈ రెండూ భీష్మాచార్యుల వారి జీవితమునకు సంబంధించి చాలా గహనమయిన ప్రశ్నలు. 

అలా కొట్టడానికి ఒక కారణం ఉంది. ప్రపంచములో దేనికయినా ఆలంబనము ధర్మమే! భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు. అదికూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మరాజుకి, శకునికి మధ్య ద్యూతక్రీడ జరుగుతోంది. అలా జరుగుతున్నప్పుడు శకుని మధువును సేవించి ఉండడంలో మరచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నీవు పణంగా పెట్టుకో అనిన తరువాత, ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయినా తరువాత శకునికి గుర్తువచ్చింది ‘నీ భార్య ద్రౌపది ఉన్నది కదా, ఆవిడని ఒడ్డు’ అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకుని దాస్యంలోకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అనుకున్నాడు ‘దౌపదిని ఒడ్డడంలో ఏదైనా దోషం ఉంటే అది ఒడ్డమన్న శకునికి వెళుతుంది కానీ దోషం ఇప్పుడు నాకు పట్టదు. ఇప్పుడు నాకు శకుని యజమాని. నేను అయన దాసుడిని. దోషం ఆయనకీ వెడుతుంది’ అనుకుని ధర్మరాజు ద్రౌపదికి ఒడ్డి ఓడిపోయాడు. ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయిన ద్రౌపదీ దేవిని సభలోకి ఈడ్చుకు వచ్చి వలువలు ఊడ్చాడు. ఊడుస్తుంటే ఆవిడ పేర్లు చెప్పి ఒక ప్రశ్న వేసింది. ‘ఈ సభలో భీష్మ ద్రోణులు ఉన్నారు. వాళ్లకి ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా? ధర్మం చెప్పవలసినది’ అని అడిగింది. అపుడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి ధర్మరాజు చేసినది దోషమే – ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని ఒడ్డె అధికారం లేదు అని అంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీ దేవి శపిస్తే, ధృతరాష్ట్రుని సంతానం అంతా నశించిపోతారు. ఆయన వాళ్ళందరినీ కష్టపడి పోషించాడు. తన కళ్ళ ముందు పోతారు. పోనీ చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతికి ఒక మహా పతివ్రతకి వలువలు ఊడుస్తున్నారు. కాబట్టి ఏమి చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా, తెలియక చెప్పాడా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ’ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మమూ అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపదీ’ అన్నాడు. అలా ధర్మం తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణము నందు వైక్లబ్యమే! ఈ దోషమునకు కొట్టవలసి వచ్చింది. అందుకని బాణములతో కొట్టారు. ధర్మాచరణము అంటే ఎంత గహనంగా ఎంత కష్టంగా ఉంటుందో చూడండి!

ఇంతటి మహానుభావుడు కురుక్షేత్రంలో యుద్ధమునకు వచ్చాడు. దుర్యోధనునితో ఒకమాట చెప్పాడు. ‘నీవు పాండవులవైపు ఉన్న వాళ్ళలో ఎవరిని సంహరించమన్నా సంహరిస్తాను. కానీ పాండవుల జోలికి మాత్రం వెళ్ళను’ అన్నాడు. యుద్ధభూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వ సైన్యాధిపతిగా నిలబడిన ధర్మరాజు తన కవచం విప్పేసి, పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహా అని నమస్కరించాడు. ‘తాతా, మేము నీవు పెంచి పెద్ద చేసిన వాళ్ళం. మాకు విజయం కలగాలని ఆశీర్వదించు’ అన్నాడు.

అపుడు భీష్ముడు ‘నీవు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని. నీ గౌరవమునకు పొంగిపోయాను. మీ అయిదుగురి జోలికి రాను’ అన్నాడు. అప్పటికి మహానుభావుడు వృద్ధుడయిపోయాడు. తన కళ్ళ ముందు తనవాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. తనే ఒక పక్షమునకు సర్వసైన్యాధిపతియై నిలబడ్డాడు. అపుడు ధర్మరాజు ‘తాతా నీవు రానక్కర లేదు. కానీ నీకు స్వచ్ఛందమరణం వరం ఉంది. యుద్ధంలో నువ్వు ధనుస్సు పట్టగా ఎవ్వరూ కొట్టలేరు. నువ్వు యుద్ధంలో వుంటే ఎలా తాతా’ అని చేతులు నులిమాడు. ‘ఇప్పుడు ఆ విషయం అడుగకు. కొన్నాళ్ళు పోయాక కనపడు. చూద్దాం’ అన్నాడు భీష్ముడు. ‘మా యోగక్షేమములు మాత్రం దృష్టిలో పెట్టుకో తాతా’ అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు.

పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda