శ్రీ మదాంధ్ర భాగవతం -- 5

44.192.25.113

పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు.

శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!!

పోతనగారి శక్తి,  ఉపాసనా బలం ఏమిటో  ఆ పద్యములలో చూడాలి. ఆ పద్యం నోటికి వచ్చి – మీరు ఆ పద్యమును ఎక్కడ కూర్చున్నా చదువుకోగలితే  – జీవితమును మార్చడానికి ఆ పద్యం ఒక్కటి చాలు. పోతనగారు ఈ భాగవతమును ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను?  భాగవతమును ఆంధ్రీకరించి రాజులకు గాని లేక ఎవరో జమీందారులకు ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు’ అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు. కైవల్యము అన్నమాట అద్వైత సాంప్రదాయమునకు చెందినది. కైవల్యము అంటే ఇంక మళ్ళీ తిరిగిరావలసిన అవసరము లేకుండా  ఈశ్వరునిలో కలిసిపోవడము. అలా 'ఈశ్వరుడియందు నా తేజస్సు వెళ్ళి ఆయన తేజస్సులో  కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానము చేస్తున్నాను' అన్నారు. రామచంద్రమూర్తి రచింపజేస్తున్నారు.  పోతనగారి చెయ్యి కదిపిన శక్తి రామచంద్రమూర్తిది.

పరమాత్మ లోకములను రక్షించుటను ఆరంభించినవాడు.  సృష్టించడములో లోకరక్షణము ప్రారంభం అవుతుంది. 'ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను’. లోకమునంతటిని ఆయన రక్షిస్తూ ఉంటాడు. ఆయనపెట్టిన అన్నం తిని, జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో ఈశ్వరుడిని తిట్టేవాని యందు కూడ ఈశ్వరుడు శక్తిరూపములో ఉంటాడు. తనను నమ్ముకొన్న వాళ్ళని, ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి పూనికతో వున్నవాళ్ళను రక్షించడము  కోసం ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెడుతూ ఉంటాడు. పరుగెత్తే  లక్షణము ఉన్నవాడు. దానవుల ఉద్రేకమును స్తంభింపజేయువాడు. రాక్షసులందరికీ చావులేదని అనుకోవడము వలననే వారికి అజ్ఞానము వచ్చింది. ’ఈలోకములనన్నిటిని లయం చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నమస్కరిస్తున్నాను' ఆన్నారు తప్ప ఎవరిపేరు చెప్పలేదు. ఆయన పరబ్రహ్మమును నమస్కరిస్తున్నారు. 'సృష్టికర్త, స్థితికర్త,  ప్రళయకర్తయిన  పరబ్రహ్మమునకు నేను నమస్కరిస్తున్నాను. కేవలము తన చూపులచేత లోకములనన్నిటిని సృష్టించగల సమర్ధుడయిన  వానికి నేను నమస్కరిస్తున్నాన’ ని ఆన్నారు. భాగవతములో పరబ్రహ్మముగా కృష్ణభగవానుడిని ప్రతిపాదించారు. ఇక్కడ కృష్ణుడని అనడము లేదు. 'మహానందాంగన’ అని ప్రయోగించారు. చిన్న పిల్లవానిలా కనపడుతున్న వాని గురించి చెపుతున్నాను కాని వాడు  పరబ్రహ్మ అందుకని వాని కథ నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. అందులో ఒక రహస్యము పెట్టారు. పోతనగారిలా బ్రతకడము  చాలాకష్టం. పోతనగారి ఇలవేల్పు దుర్గమ్మ తల్లి. పోతనగారు తెల్లవారు లేచి బయటకు వస్తే విభూతి పెట్టుకుని, రుద్రాక్షమాలలు మెడలో వేసుకొని  ఉండేవారు. ఎల్లప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు. పోతనగారు 

'కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత
భవాండకుంభకు మహానందాంగనా డింభకున్’ 

అని ఎంతో విచిత్రమయిన మాట అన్నారు. ఎవరు ఈ మహానందాగన? మీరు ఇంకొకరకంగా ఆలోచిస్తే  – పొందే ఆనందము శాస్త్రం లెక్కలుకట్టి ఆనందమును శాస్త్రం నిర్వచనము  చేసింది. ఏదో మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము అని ఇలా చెప్పిచెప్పి చివరకు ఆనందము గొప్పస్థితిని 'మహానందము’ అని చెప్పింది. ఈ మహానందము అనేమాట శాస్త్రంలో శ్రీ దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో వాడారు. అమ్మవారికి ’మహానందమయి’ అని పేరు. అమ్మవారి డింభకుడు కృష్ణుడు అంటే  ఎలా కుదురుతుంది? అమ్మవారి కొడుకుగా కృష్ణుణ్ణి ఎక్కడ చెప్పారు?  లలితా సహస్రమును పరిశీలిస్తే అందులో

'కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః’

 భండాసురుడు పదిమంది రాక్షసులను సృష్టించాడు. మళ్ళీ రావణాసురుడుని, హిరణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడిని సృష్టించాడు. వాళ్ళు పదిమంది మరల పుట్టామనుకొని యుద్ధానికి వస్తున్నారు. వారిని అమ్మవారు చూసి ఒకనవ్వు నవ్వింది. వారికేసి ఒకసారి చెయ్యి విదిల్చేసరికి ఆమె రెండుచేతుల వేళ్ళ గోళ్ళనుండి దశావతారములు పుట్టాయి. పుట్టి మరల రాముడు వెళ్ళి రావణుణ్ణి చంపేశాడు. కృష్ణుడువెళ్ళి కంసుడిని చంపేశాడు. అలా చంపేశారు కాబట్టి  శ్రీమహావిష్ణువు అవతారములు అన్నీ  అమ్మవారి చేతి గోళ్ళలోంచి వచ్చాయి. ’శ్రీమహావిష్ణువు మహానందమయి కుమారుడు. మహానందమయి డింభకుడు. అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. ఆయన స్వరూపము మహానందం. ఆయన పేరు కృష్ణుడు. నిరతిశయ ఆనందస్వరూపుడు.

పోతనగారు భాగవతమును అంతటినీ రచించి ఒక మంజూష యందు పెట్టారు. ఆయన ఎవ్వరికీ తాను అంత భాగవతమును రచించానని కూడ చెప్పలేదు. 'ఇది రామచంద్రప్రభువు సొత్తు – దానిని రామచంద్రప్రభువుకి అంకితం ఇచ్చేశాను’ అని అన్నారు. కొడుకును పిలిచి ఆ తాళపత్ర గ్రంథములను పూజామందిరములో పెట్టమన్నారు. ఆ తాళపత్ర గ్రంథములు పూజామందిరములో పెట్టారు. కొంత కాలమయిపోయిన తరువాత పోతనగారి కుమారుడు పెద్దవాడయిపోయి అనారోగ్యము  పాలయ్యాడు. అతడు తన శిష్యుడిని పిలిచి 'మా నాన్నగారు రచించిన భాగవతము ఆ మంజూషలో ఉన్నది. దానిని జాగ్రత్తగా చూడవలసింది’ అని చెప్పాడు. కొద్ది కాలమునకు అందులోంచి నాలుగయిదు చెదపురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యునికి. అపుడు ఆ శిష్యుడు మంజూషను తీశాడు. తీసిచూస్తే అందులో ఆంధ్రీకరింపబడిన భాగవతము ఉన్నది. ఇంత గొప్ప భాగవతమని అప్పుడు తాళపత్ర గ్రంథములకు ఎక్కించారు తప్ప పోతనగారు తన జీవితములో ఎప్పుడూ  ఇంత గొప్ప విషయమును రచించానని బయటకు చెప్పుకోలేదు.  మహానుభావుడు అంత నిరాడంబరుడు.

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna