శ్రీ మదాంధ్ర భాగవతం -- 2

54.224.117.125

శ్రీ మదాంధ్ర భాగవతం -- 2

మొట్టమొదటిది అయిన ఋగ్వేదమును పైలుడు అనే ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పారు. దాని శాఖలకు పైలుడు ఆధిపత్యం వహించాడు. యజుర్వేదమును వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నారు. సామవేదమును జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అధర్వణ వేదమును సుమంతువు అనే ఋషికి తెలియజేశారు. ఈ పదునెనిమిది పురాణములను రోమహర్షణుడు అనే ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుడి కుమారుడే సూతుడు. సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు.

పురాణ వాజ్ఞ్మయమునంతటిని కూడా ప్రవచనం చేసిన వాళ్ళు సూతుడు, రోమహర్షణుడు అయితే ఒక్క భాగవతమును మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ సాక్షాత్తు వేదవ్యాసుని కుమారుడు. ఆయన పుట్టుకచేతనే అపారమయిన జ్ఞాన వైరాగ్యములు, భక్తి కలిగినవాడు. ఎంత వైరాగ్య భావన కలిగినవాడు అంటే – ఆయన మంచి నిండు యౌవనములో ఉండే రోజులలో తండ్రిగారు ఆయనను వివాహం చేసుకోమని అడిగారు. అపుడు ఆయన ‘నాకు వివాహం అక్కరలేదు...ఈలోకం అంతా దుఃఖ భూయిష్ట మయిపోయింది. నేను ఆనందమును అనుభవించాలి. అందుకని నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను’ అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనకనుంచి వ్యాసుడు పుత్రునిమీద వున్న కాంక్షచేత ‘హాపుత్రా హాపుత్రా’ అని అరుస్తూ వెంటవస్తున్నారు. శుకుడు ‘ఓయ్’ అనలేదు. అంతటా ఆత్మతత్త్వమును చూడడానికి అలవాటయిపోయిన శుకునికి బదులుగా వ్యాసునికి అరణ్యములో వున్న చెట్లు అన్నీ ‘ఓయ్ ఓయ్’ అని జవాబు చెప్పాయి. అంతటి బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడై యౌవనమునందే ఒంటిమీద బట్టలేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు.

శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తిని గురించి మనకి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్కనుంచి వెళ్ళిపోతున్నారు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. అక్కడి సరోవరంలో అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు. అందులో ఒకరు శుకుడు వస్తున్నాడు అన్నారు. శుకబ్రహ్మకు వచ్చి నమస్కారం చేయాలని వారు వివస్త్రలై ఒంటిమీద వస్త్రం కట్టుకోకుండా లేచివచ్చి శుకునికి నమస్కరించారు. అపుడు శుకుడు నిండు యౌవనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్సరసలు స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించండి అన్నారు. అపుడు వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించారు. ఈ సంఘటనకు వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. ‘నా కుమారుడు యౌవనంలో ఉన్నాడు. నేను వార్ధక్యమునందు ఉన్నాను. నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు. నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు ఏమిటి ఈ తేడా’ అని వ్యాసుడు అప్సరసలను అడిగారు. అడిగితే అప్సరసలు అన్నారు – ‘నీ కుమారునికి స్త్రీ పురుష భేదము తెలియదు. అతడు అంతటా బ్రహ్మమునొక్కదానిని మాత్రమే చూస్తాడు. నీకు స్త్రీపురుష భేదము తెలుసు. అందుకే నీకు మేము బట్టలు కట్టుకొని నమస్కరించాము’ అని బదులు చెప్పారు. అదీ శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తి అంటే!

శుకుడు చాలా గొప్పవాడు. అందుకే ఒక్క భాగవతమును మాత్రం వ్యాసుడు వేరోకరిచేత చెప్పించకుండా శుకునిచేత మాత్రమే చెప్పించారు. భాగవతం చెప్పడానికి ఈశ్వరుడు ఒక సమర్ధత చూశాడు. ‘కుశ’ అంటే దర్భ. దర్భ చేతిలో పట్టుకున్నంత సేపు కర్మాచరణం చేస్తాడు. కర్మాచరణం ఎందుకు చేస్తారంటే – కర్మ చేయగా చేయగా ఇంటిని తుడుచుకుని తుడుచుకుని బూజులన్నీ దులుపుకుని పండగ వచ్చే ముందు శుభ్రపరుపబడిన ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చెయ్యగా చెయ్యగా లోపల ఉండేటటువంటి మనస్సుకు పట్టిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చొనడానికి, సత్కర్మాచరణమును పూనికతో సంతోషముతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధియందు ఆనందప్రదమయిన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దానివలన జ్ఞానము కలుగుతుంది. జ్ఞానముచేత మోక్షము కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము. ఈ సత్కర్మాచరణము చెయ్యడం అనేదానికి దర్భాలతో సంబంధం ఉంది. తిరగేస్తే – ‘శుక’ అయింది. అంటే ఇప్పుడు ఆయనకు కర్మాచరణము లేదు. అనగా ఆయన కర్మాచరణమును కావాలని మానినవాడు కాదు. ఆయన చెయ్యడానికి కర్మలేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయిన వాడు. ఆయన ఇరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. బ్రహ్మము తప్ప వేరొక వస్తువు ఆయనకు తెలియదు ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు. బ్రహ్మముతో కలిసిఉంటాడు. బ్రహ్మమును పొందుతూ ఉంటాడు. ఇంత ఆనందస్థితిని అనుభవించే వ్యక్తి శంకర భగవత్పాదులు. ఆయన ‘కౌపీనపంచకము’ అని ఒక పంచకము చేశారు. అందులో – ‘అసలు కౌపీనము పెట్టుకున్న వాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడ వున్నాడు’ అన్నారు. ఎందుకని? వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగియై ఈశ్వరుని పాదారవిందములను సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వానికి ఇంద్రపదవి లభించినా సరే దానిని తిరస్కరిస్తాడు. తనకు అక్కర్లేదు అంటాడు. ఇందులోనే తనకు తృప్తి ఉన్నది అంటాడు.

అటువంటి మహానుభావుడయిన శుకుడు నిరంతరమూ ఆనందమును అనుభవించేవాడు. ఆయన ఏదయినా ఒక ప్రదేశమునకు వస్తే ఒక ఆవుపాలు పితకడానికి ఎంతసమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు వాడు కాదు. ఎందుకు? ఒకవేళ ఎక్కడయినా అంతకన్నా ఎక్కువసేపు నిలబడితే ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులతో తనకు పరిచయం ఏర్పడితే ఆ పరిచయం వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి, వీరు ఫలానా వీరు ఫలానా అని గుర్తుపెట్టుకొని వీళ్ళందరినీ లోపలపెట్టుకుంటే ఈశ్వరుడితో సంగమము తగ్గిపోయి లోకముతో సంగమం పెరిగిపోతుందని ఆయన ఎక్కడా ఎక్కువసేపు ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి కూర్చుని ఏడురోజులు భాగవతములు ప్రవచనము చేశాడు.

పూజ్యగురువులచే చెప్పబడిన శ్రీమదాంధ్ర భాగవతం

Quote of the day

Man learns through experience, and the spiritual path is full of different kinds of experiences. He will encounter many difficulties and obstacles, and they are the very experiences he needs to encourage and complete the cleansing process.…

__________Sai Baba