Online Puja Services

రామాయణము అనే మాటలో దాగిన ఈ దివ్య విశేషం తెలుసా !!

3.19.31.73

రామాయణము అనే మాటలో దాగిన ఈ దివ్య విశేషం తెలుసా !!
- లక్ష్మి రమణ 

రామాయణం లేకుండా మన భారతదేశం మనలేదు అంటే అతిశయోక్తి కాదు.  అటువంటి గొప్ప ముద్రని ఈ జాతి మీద వేసిన మహనీయుడు రాముడు. ఆ రామ అనే శబ్దం చాలు , హృదయం నాదస్వరం విన్న మిన్నాగులా ఉప్పొంగి నాట్యమాడడానికి . ఆ ఒక్క రూపం చాలు, అప్పుడే వచ్చిన వసంతంలో విరిసిన మల్లెల్లా మాది పులకించడానికి.  ఆ ఒక్క రామాయణ గాథ చాలు మనిషి మనిషిగా సాగించాల్సిన పయనాన్ని నిర్దేశించడానికి.  ఆ మహనీయ గాథ అప్పుడూ, ఇప్పుడూ , ఎప్పుడూ అజరామరం . తరగని తేనెని నింపుకున్న మధుర కథనం. ఆ దివ్యమైన కథ పేరులోనే దాగిన అద్భుతాన్ని గురించి తెలుసుకుందాం రండి . 

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

రామాయణము:

అయనము అంటే నడక అని అర్థం . రామాయణము అంటే రాముని యొక్క నడక అని అర్థం. శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో మరే అవతార విశేషానికీ ఈ ఆయనము అనే మాటని వాడలేదు. కేవలము రామాయణము లో మాత్రమే ఆయనము అనే పదాన్ని వాడారు. ఎందుకు ఇంతటి విశేషత ఆ రాముని నడకకి వచ్చిందో తెలుసా ? 

రామావతారంలొ స్వామి పరిపూర్ణముగా మనవుడే.  అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడి నని కాని , దైవత్వమును ప్రకటించడము కాని చేయరు. ఆయన ఆ అవతారంలో కేవలం మానవునిగానే జీవించారు.  ఇక్కడ విశేషం  “రామస్య ఆయనం రామాయణం” కావడమే.  రాముని కదలిక కి అంత ప్రాధాన్యత రావడం వెనుక మానవుడై నడయాడిన పరమాత్ముని నడత దాగుంది . 

శ్రీరామచంద్రుడు అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం. అలా ముందుకు సాగే ప్రతి అడుగూ సత్య మార్గం . అలా రాముని నడత కేవలం సత్యము -ధర్మములే! అందుకే మరి , “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు .

అందుకే పెద్దలు తరుచు ఒక విషయం చెప్తారు. రామాయణాన్ని నరుడి కథ గా చదవండి అని.  ఎందుకంటే రామాయణాన్ని నరుడి కథ గా మనం చదివినప్పుడు రాముని నడువడిని చూసినప్పుడు ఒక నరుడు సత్యాన్ని ధర్మాన్ని పట్టుకొని ఇలా జీవించ గలడా, అని మనం కూడా ఆ గుణాలని అలవర్చుకొనే వీలుంటుంది. అదీ రాముని కథ రామాయణం చెప్పే గొప్ప విశేషం !! 

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha