విశ్వరూపాన్ని భగవానుడు కేవలం భారతంలోనే చూపించారా?

3.239.129.91

విశ్వరూపాన్ని భగవానుడు  కేవలం భారతంలోనే చూపించారా?
-లక్ష్మీ రమణ 

విశ్వరూపాన్ని భగవంతుడు కేవలం భారతంలోనే చూపించారా? అంతకుముందర ఆయన విశ్వరూపప్రదర్శన చేయలేదా ? అంటే, రామాయణ కాలం నాటి కధనాన్ని వినిపిస్తున్నారు . ఉత్తరరామాయణంలో రావణాసురునికి చూపించిన ఆ విశ్వరూప కధనం ఇక్కడ మీకోసం . 

రావణాసురుడు నరునితో తప్ప ఇతరుల చేత మరణం లేకుండా వరం పొందాడు . ఆ వరగర్వంతో విర్రవీగుతూ బలవంతులనందరినీ జయించాలన్న ఉద్దేశ్యంతో తిరుగసాగాడు  .  కపిలమహర్షి ఆ సమయంలో పశ్చిమ సముద్ర తీరంలోని ఒక అరణ్యములో పద్మాసనస్థితుడై , ఆత్మా యోగములో మునిగి ఉన్నారు . ఆత్మా పరమాత్మలో లీనమైనప్పుడు , ప్రకృతి - పరమాత్మని కూడి నప్పుడు, అంతా పరమాత్మ స్వరూపమే కదా ! రావణుని కంటికి ఆ మహర్షి , విశ్వరూపమై కనిపించారు . ఒక అగ్ని శిఖలా దర్శనమిచ్చారు .  అనేకమైన చేతులతో , వాటిల్లో రకరకాల ఆయుధాల్ని ధరించి,  కడుపులో సముద్రాలు,కన్నులలో సూర్యచంద్రులు, దాత , విధాత, రుద్రులు శరీరముగా, తొడపైన కూర్చొని ఉన్న లక్ష్మీ దేవితో కపిలమహర్షిని దర్శించాడు రావణాసురుడు . 

తాను చూస్తున్నది వాస్తవమో , మాయో లేక శత్రువులెవరైనా తనపై పన్నిన పన్నాగామో అర్థంకాలేదా ధైత్యేంద్రునికి.యుద్ధోన్మాదంతో ఉన్న రావణుడు ఇది ఖచ్చితంగా తన శత్రువుల పన్నాగమేనని నిర్ధారించేసుకొని , యుద్హానికి దిగాడు . యోగానుభూతిలో అలోకిక స్థితిలో ఉన్న ఆ కపిల మహర్షి పైన నానారకాల శస్త్రాస్త్రాలని ప్రయోగించాడు . 

దాంతో ధ్యానభంగమైన కపిలుడు మహోగ్రంతో        

"ఓరీ !అధమా! నన్ను సాధించేందుకు వచ్చావా ?" యని పిడికిలి బిగించి ఒక్క గుడ్డు గుద్దాడు . ఆ తాప్సి ఒక్క పిడికిలిపోటుకే , గొడ్డలివేటుకు మహా వృక్షం కిందపడినట్టు,  రావణుడు మూర్ఛపోయాడు . అయినప్పటికీ, మిగిలిన రాక్షసులు ఆయనతో పోరాడాలని చూశారు .కానీ, కపిలిది వారిని గట్టిగా ఉరిమి చూసి, ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. రావణుడికి ఆయన చేతి దెబ్బ రుచి చూసినా,బుద్ధిమాత్రం రాలేదు.  తిరిగి ఆ మహర్షిని ఎదుర్కోదలచి, ఆయన ప్రవేశించిన గుహలోకి వెళ్ళాడు . 

ఆ గుహలో ఆ రాక్షసరాజుకి మహావీరులు, దేవసుతులు, సిద్ధులు, శంఖచక్రాదులు ధరించి చతుర్భుజులైన పురుషులు కనిపించసాగారు . వారందరినీ దాటుకుని కపిలుని వెతుకుతూ ఇంకా ముందుకు వెళ్ళాడు . అక్కడ  దివ్యసౌరభములు పరిమళిస్తుండగా,  రత్నాలంకారములు ధరించిన అందమైన స్త్రీలు వింజామరలు వీస్తుండగా , సౌందర్యనిధియైన ఒక  స్త్రీ పాదములొత్తుతుండగా , కపిలమహర్షి చక్కగా నిదురిస్తూ కనిపించారు . 

ఆ దృశ్యాన్ని చూసిన రావణుడు చకితుడయ్యాడు . ఆయన ఎవరో తెలుసుకోవాలని, ఆ మహనీయుని ముందర నిలబడి చేతులు జోడించి, ‘స్వామి , ఎవరు నీవని’ అడిగాడు. అప్పుడు కపిలమహర్షి నూరు తెరిచి రావణుడికి చూపాడు. ఆందులో పూర్తి బ్రహ్మాండమే  రావణునికి కనిపించింది .  రావణుని తర్వాత ఆ మహద్భాగ్యం పొందింది యశోధమ్మే నెమో ! అప్పుడా రావణుడు "మహాత్మా ! నీ చేతిలో చనిపోవుటకంటె శుభము వేఱొకటి లేదు. నేను నీకోసమే నిన్నీ విశ్వములో విసుగు విరామములు లేక వెదకుతున్నా" నని ఆయనని పరిపరివిధాల ప్రార్ధించారు . ఇంతలోనే ఆ కపిలుడు గిరితో, తానున్న గుహలో సహా అంతర్ధానమయ్యారు .  రావణుడు మరింత విస్మయానికి లోనై ఆ ప్రదేశాన్ని వదిలి అప్పటికి వెళ్ళిపోయాడు . 

మహావిష్ణు అంశ అయినా ఆ కపిల మహర్షి, అప్పుడు వెళ్ళిపోయినా , రాముడై , రావణాసురుని కోరిక తీర్చాడు . ఆయనతో యుద్ధముచేసి, యుద్ధంలో కడతేర్చి రావణుణ్ణి తనలో ఐక్యం చేసుకున్నాడు .  

కపిలమహర్షిగా ఆ భగవానుడు ఈ విధంగా కూడా ఉత్తరరామాయణంలో మనకి దర్శనమిస్తారు . కపిలాచార్యుని రచనగా ప్రఖ్యాతిని పొందినది సాంఖ్యతత్త్వము.కాబట్టి ఇది కూడా భగవానుడు ఉపదేశించిన వేదమనే ఖ్యాతినిపొందింది . కృష్ణుడు కూడా గీతలో సాంఖ్యా యోగాన్ని బోధిస్తారు . ఈ కథని  బట్టి కపిలమహర్షి విష్ణుస్వరూపుడనే విషయం తెలుస్తుంది. దాంతోపాటుగా రావణాబ్రహ్మ జ్ఞానస్వరూపం విశిదమవుతుంది . ఆయన సీతమ్మని అపహరించడంలోని ఆంతర్యం అర్థమవుతుంది.  విష్ణుపాదాన్ని చేరేందుకు విష్ణువుతో  కలహం పెట్టుకున్నారన్న విషయం తేటతెల్లమవుతుంది కదూ ! 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi