Online Puja Services

సీతాపహరణానికి కారణం ఈ యుద్ధమేనా?

18.191.211.66

రావణాసురుడు  దొంగచాటుగా సీతమ్మని ఎత్తుకురావదానికి కారణం ఈ యుద్ధమేనా ? 
- లక్ష్మీరమణ 

చెప్పుడు మాటలు మహాచెడ్డవి . ఎంతగొప్పవాడికైనా , కాస్త ఏమరుపాటు, మరికొంచెం ఆ మాటల మహత్యం తలకెక్కడం జరిగాయో బుద్ధి పెడత్రోవనపోవడం ఖాయమే .  నిజానికి సీతమ్మని ఎక్కురావాలనే ఆలోచన అకంపనుడు అనే అసురుడిది . ఆ అసురుడు చూసిన రాముని పరాక్రమం అతనితో అలా మాట్లాడించింది .  అకంపనుడు చూసిన యుద్ధం ఒక ప్రాంతంలో శాంతిని నింపింది . అక్కడి జీవనస్రవంతిలో కొత్త కాంతులు నింపింది . ఆ యుద్ధం గురించి పెద్దగా ఎవ్వరూ ఇప్పటిదాకా మాట్లాడలేదనే  చెప్పాలి . 

ఒక మహా సంగ్రామానికి  దారితీసి,ఒక మహావీరుణ్ణి ఒక పిరికి పనికి పురికొల్పిన ఆ యుద్ధం గురించి మాట్లాడుకునే ముందు రామ రావణుల గురించిన అవగాహన అవసరం . వారిగురించి చెప్పుకుందాం . 

రావణుడు -
మహాబలుడు. తపోసిద్ధుడు. ఒంటి వేలి మీద నిలుచుండి సూర్యుడికేసి చూస్తూ బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తూ, వేయి సంవత్సరాలకొక తలని బలి ఇచ్చేవాడట. అలా తొమ్మిది తలలు బలి ఇవ్వడం పూర్తయాయి. పదవ తలని కూడా హోమం లో వ్రేల్చడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. రావణుడి తపస్సులోని వేడికి మూడు లోకాలూ బెంబేలెత్తాయి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైయ్యా డు. వరం కోరుకొమ్మన్నాడు. రావణుడికి మనుషులంటే చిన్నచూపు . అందువల్ల  వాళ్లని వదిలివేసి ఇంకెవరివల్లా మరణభయం లేకుండా వరం పొందాడు. వరం పొందాక గర్వం ఉదయించింది .  జగజ్జేతనని అనిపించుకోవాలనుకున్నాడు .  మూడు లోకాలపైనా దండెత్తాడు .  కైలాసాన్ని కదిలించాడు. శివానుగ్రహానికి పాత్రుడైయాడు.

కుబేరుడు, ఇంద్రుడు వంటి వాళ్లమీద యుద్ధాలలో గెలిచాడు.అందరితో కయ్యానికి కాలుదువ్విన రావణుడు  వాలి, కార్తవీర్యార్జునుడు, కపిలుడు వంటి వాళ్ల చేతిలో ఓడిపోయాడు. బ్రహ్మదేవుడి జోక్యంతో కొన్ని యుద్ధాలలో సంధి కుదుర్చుకున్నాడు. లంకానగరాన్ని వశం చేసుకున్నాడు. దక్షతతో పాలిస్తూ ,  మందోదరిని పెళ్లి చేసుకున్నాడు. నచ్చిన స్త్రీలను బలాత్కరించాడు. వేదవతి వంటి వాళ్ల విషయంలో ఎదురుదెబ్బతిన్నాడు . అయినా తన బలహీనతని మానుకోలేదు . రంభ వంటి వాళ్లని బలవంతంగా వశపరచుకున్నాడు . కొందరు దేవతాస్త్రీలను లంకకూ అపహరించుకుని తీసుకునివెళ్లాడు.

రాముడు -
సీత రాముని చూసి వరించింది . రాముడు గురువు ఆదేశంతో సీతని వివాహం చేసుకున్నాడు . తండ్రిమాట కోసం ఆర్ణయాలకి వెళ్ళాడు . భరతుడు రాజ్యం నీదే అన్నా , వెనకకి రమ్మని కోరినా నిరాకరించాడు . అడవుల్లోని మున్యాశ్రమాలని దర్శించి వారి ఆశీసులు పొందాడు. వారి అనుగ్రహంతో  దివ్యాస్త్రాలని పొందాడు . కానీ వాటిని ఎక్కడా వినియోగించలేదు . సీతని అపహరిస్తానన్న విరాధుడనే ఒకే ఒక రాక్షసుడిని చంపాడు. పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని భార్య, తమ్ముడుతో నివశిస్తూ , కందమూలాని ఆరగిస్తూ తపస్సు చేసుకుంటున్నాడు . 

అప్పుడు వచ్చింది శూర్పణఖ.

శూర్పణఖ వచ్చే వరకూ రాముడి జీవితానికీ, రావణుడి జీవితానికీ సంబంధం లేదు. అసలు రాముడెవడని అడుగుతాడు రావణుడు శూర్పణఖని తరువాత. అంటే రాముడి వివరాలు రావణుడికి తెలీవు. రాముడిని , ఆయన కాదంటే లక్ష్మణుణ్ణి తనని చేపట్టమంది .  ఆమె ప్రవర్తనకి చిరాకుపడిన లక్ష్మణుడు ముక్కూ చెవులూ కోసేసాడు.

శూర్పణఖ లక్ష్మణుడు తనకి చేసిన పరాభవాన్ని తన సోదరుడైన ఖరుడితో చెప్పుకుంది. ఖరుడు రావణుడి ఆజ్ఞ మేరకు జనస్థానాన్ని రాజధానిగా చేసుకుని దండకారణ్యప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాక్షసుడు. రావణుడి తమ్ముడు. రావణుడంతటివాడు. శూర్పణఖ చెప్పినవాళ్లని చంపడానికి ముందు పదునాలుగుమందిని పంపాడు. వాళ్లతో శూర్పణఖ కూడా వెళ్లింది. రాముడు ఆ పద్నాలుగు మందినీ పద్నాలుగు బాణాలతో చంపాడు. శూర్పణఖ మళ్లీ వచ్చింది. ఖరుడ్ని ప్రేరేపించింది. యెంతగా అంటే, స్వంతంగా మహాబలవంతుడైనా, సర్వసైన్యాన్నీ వెంటబెట్టుకుని కేవలం ఇద్దరి మీదకి ఖరుడు దండెత్తేటంతగా. ఆమె మాటల మహత్తుని మనం అర్థం చేసుకోవాలిక్కడ . 

పద్నాలుగు వేల మంది మహాభయంకరాకారులైన రాక్షసులు ఒక కారుమబ్బు కమ్మినట్లు రాముడు నివాసముంటున్న ప్రాంతాన్ని కమ్మివేసారు. ఇదే ప్రమాదమనుకుంటే, వస్తున్న మహాసైన్యాన్ని చూసిన రాముడు సీతాదేవిని వెంటబెట్టుకుని ఒక గుహలోకి వెళ్లమనీ, ఆమెను కాపాడపనీ లక్ష్మణుడికి అనుజ్ఞ ఇచ్చాడు. ఆ మహాసేనకి యెదురుగా నిలబడ్డాడు. ఒకేఒక్కడు .  అతడే మహా సైన్యమై . 

ధనుస్సూ, బాణాలూ తప్ప వేరే ఆయుధం లేదు. ఒంటిమీద రక్షణగా ఒక కవచం మటుకు ఉంది. యెదురుగుండా ఉన్నవారు పదులసంఖ్యలో ఉన్నవారు కాదు. అచ్చంగా పద్నాలుగు వేలమంది. అల్లాటప్పావారూ కాదు. మహాబలవంతులు. వారి దగ్గర శూలాలున్నాయి. గదలున్నాయి. ధనుర్బాణాలున్నాయి. కత్తులూ, కటార్లూ, గండ్రగొడ్డళ్లూ, సమ్మెటలూ ఉన్నాయి. చేతిలోకి తేలికగా బండరాళ్లూ, మహావృక్షాలూ రానే వస్తాయి.

రాముడు యుద్ధం చేసాడు. యుద్ధంలో కేవలం బాణప్రయోగం మాత్రమే చేసాడు. వాళ్లు బాణాలు వందల సంఖ్యలో రాముడి మీదకి ప్రయోగించారు. వాటికి ప్రతిగా రాముడు బాణాలే వేసాడు. శూలాలూ, సమ్మెటలూ, గొడ్డళ్లూ అన్నీ రాముడి మీదకి విసిరారు. వాటికి ప్రతిగా రాముడు బాణాలే వేసాడు. మీదకి విసిరిన చెట్లకీ, బండరాళ్లకీ ప్రతిగా బాణాలే వేసాడు. గుంపులు గుంపులా వందలకు వందల మంది రాముడి మీదకి పరుగున వచ్చారు. వారి మీదకీ రాముడు బాణాలేవేసాడు.

కొన్ని పదులు, కొన్ని వందల బాణాలు. ఆగకుండా, అలసిపోకుండా. యెప్పుడు బాణాన్ని తీస్తున్నాడో, ధనుస్సుకు యెక్కుపెడుతున్నాడో, ఆకర్ణాంతం యెపుడు లాగుతున్నాడో, మీదకి గురితప్పకుండా యెపుడు విడిచిపెడుతున్నాడో తెలుసుకోలేనంత వేగం.

మధ్యలో ఒకచోట తన ధనువు పడిపోగా, దాన్ని మార్చవలసి వచ్చింది. అదే రాముడు చేసిన పని. దెబ్బలు తిన్నాడు. రక్తమూ కారింది. అది సాధారణమే. పెద్దగా కోలుకోని దెబ్బ యెక్కడా తినలేదు. కానీ కేవలం బాణప్రయోగమనే విద్యతో రాముడు అన్ని వేలమంది రాక్షసులని పీనుగులని చేసాడు. జెండాలు విరిగిపోయి; గుర్రాలూ, గాడిదలూ, రథసారథులూ నేలకూలి, రథాలు పక్కకి ఒరిగి, కొందరికి చేతులూ, కొందరికి కాళ్లూ , కొందరికి మొండెమూ పీలికలై తెగి పడిపోయి, కొందరికి శరీరంలోపలి భాగాలు బయటికి వచ్చి - ఇలా రకరకాలుగా యుద్ధరంగాన్నంతా శవాల గుట్టలు, రక్తపు ధారలూ నింపివేసాయి. అన్ని వేలమంది చనిపోగా, యుద్ధరంగంలో ఒకప్పుడు కేవలం రాముడూ, ఖరుడే మిగిలారు. తరువాత ఖరుడు నూతనోత్తేజంతో రాముడి మీదకి ఉరికాడు. అంత యుద్ధం చేసినా అలసిపోని రాముడు అంతయుద్ధమూ మళ్లీ ఖరుడితో చేసాడు.

యుద్ధం పూర్తయాక పద్నాలుగు వేలమందిలో యే ఒక్కడూ ప్రాణాలతో లేడు. ఖరుడు, అతని సేనాధిపతియైన దూషణుడు, ఇంకొక ముఖ్యుడైన త్రిశిరుడితో సహా.

ఈ యుద్ధంతో జనస్థానం రాక్షసుల నుండి విముక్తిని పొంది, కొత్త ఊపిరులూదింది. దండకారణ్యమంతా భయాన్ని విడిచిపెట్టింది. భారతదేశంలో ఉన్న రావణుడి పేరు సర్వనాశనమైపోయింది.

ఆ యుద్ధం యెవరూ చేయలేనిది. ఇతరుల ఊహకి కూడా అందనిది. రాముడే , ఒక్క రాముడు మాత్రమే చేయగలిగింది.

ఆ రాముడు శత్రుభయంకరుడు . అప్పటివరకూ సీతమ్మ కి  బేలగా ఉన్న రాముడే తెలుసు . ధర్మమంటూ వల్లెవేసే రాముడే తెలుసు. భర్త శక్తి పట్ల నమ్మకమున్నా,మౌనంగా  కందమూలాలు తింటూ తపస్సులో ఉన్న స్వామినే చూసింది ఆ క్షణం వరకూ . కానీ ఈ యుద్ధం ఆమెకి అసలైన రామ దర్శనం చేయించింది .  ఆ రామదర్శనం యెంత గొప్పదంటే, ఆ యుద్ధమే సీతాదేవికి రాముడు రావణుడ్ని సంహరించగలడని నమ్మకాన్నిచ్చింది .  తాను పదినెలలు రావణుడి చెరలో బందీగా ఉన్నపుడు ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతోనే హనుమంతుడు ఆమెను తనతో పాటు రమ్మన్నప్పుడు రాననీ, రాముడే వచ్చి తనను తీసుకునివెళ్ళడమే ఉచితమనీ చెప్పడానికి కారణమయ్యింది .

 ఈ యుద్ధాన్ని చూసిన అకంపనుడు భయంతో వణికిపోయాడు.  పరుగున రావణుడి దగ్గరకు వెళ్లాడు. అకంపనుడు రావణుడికి మావయ్య వరస. జరిగింది చెప్పాడు. రావణుడు రాముడ్ని చంపడానికే బయల్దేరాడు.  కానీ అకంపనుడి మాటలతో రామపరాక్రమాన్ని విని, రాముడ్ని జయించలేనన్న నిశ్చయానికి వచ్చాడు. రాముడిని యెదుర్కోవడం కష్టమనీ, సీత గొప్ప సుందరి అనీ, సీతని అపహరించమనీ, రాముడికి సీతంటే పంచప్రాణాలనీ, సీతలేకుంటే రాముడు ఆత్మహత్యకి పాల్పడతాడనీ అకంపనుడు నూరిపోశాడు .

రావణుడు ఆ ఆలోచనని ఒప్పుకుని సహాయం కోసం మారీచుడిదగ్గరకి వెళ్లాడు. మారీచుడు రాముడు ధర్మస్వరూపుడనీ, పరభార్యలని అపహరించడం తప్పనీ, స్వంతభార్యలతో సుఖించమనీ హితవు చెప్పి రావణుడ్ని వెనక్కి పంపేసాడు. అపుడు శూర్పణఖ మంత్రుల మధ్యలో ఉన్న రావణుడ్ని సమీపించి, సీత అందచందాలని పొగిడి, మళ్లీ రెచ్చగొట్టింది. సీతలేని బ్రతుకు బ్రతుకే కాదని, ఆమెని భార్యగా పొందినవాడు ఇంద్రుడ్ని మించిపోతాడనీ అందరిలోనూ నూరిపోసింది. ముందు సీతని యెత్తుకురమ్మనీ, తరువాత రామలక్ష్మణులని సంహరించమనీ, నీ తమ్ముళ్లు చనిపోయాక రాముడిని దెబ్బకొట్టకపోతే యెందుకూ పనికిరావని నిందించింది.

సీతాదేవిని అపహరించాలని రావణుడు నిర్ణయానికి వచ్చాడు. అయితే అది రాముడ్ని యెదుర్కొని ,చంపి తేవడమా, మోసం చేసి తేవడమా అని ఒంటరిగా బేరీజు వేసుకున్నాడు. రామపరాక్రమాన్ని విన్న వాడు గనుక పన్నాగమే సుళువని, తగిన పని అనీ నిర్ణయానికి వచ్చాడు.

తరువాత మళ్లీ మారీచుడి దగ్గరికి వెళ్లడం, బంగారు లేడివి కమ్మని అడగడం, మాయాపన్నాగంతో సీతని యెత్తుకురావడం తరువాతి కథ.

ఇంతకీ, సీతాపహరణానికి రావణుడికి సీతాదేవిపై వాళ్లూ వీళ్లూ చెప్పగా కలిగిన మిథ్యామోహం ప్రధానకారణం. రాముడు తనవాళ్లకి యెదురువచ్చి పరోక్షంగా తనని దెబ్బకొట్టడం రెండవ కారణం. మోసం చేసి యెత్తుకురావడమనే అగత్యానికి మాత్రం ఖరదూషణాదులతో జరిగిన యుద్ధంలో రాముడు చూపించిన పరాక్రమమే కారణం.

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha