Online Puja Services

ఎన్ని వత్తులతో దీపారాధన చేస్తున్నారు ?

3.135.200.211

ఎన్ని వత్తులతో దీపారాధన చేస్తున్నారు ? 
లక్ష్మీరమణ 

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని వెనకటికొక సామెత . నిత్యం మనం ఎదుర్కొనే సమస్యలకి చిన్న చిన్న క్రియలతో పరిష్కారం లభిస్తుందంటే, వాటిని పాటించడానికి మనకి  ఏముంటుంది చెప్పండి ? అటువంటి వాటిల్లో దీపారాధన ఒకటి .  దీపం వెలిగించడంలో వత్తిది ముఖ్యమైన పాత్ర దీపం లోని ఒత్తుల్లో చాలా రకాలే ఉన్నాయి.  అయితే ప్రధానంగా దూది తామర పువ్వు కాండం అరటి కాండంతో చేసిన వత్తులు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు.  దేవుడికి ఏ రకమైన వత్తితో (ఏ పదార్థంతో చేసిన వత్తితో ) దీపారాధన చేస్తున్నాము అనే అంశం మీద మనకు అందే ఫలం ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఏ పదార్ధంతో చేసిన వత్తి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

సాధారణంగా దీపారాధనకి ఎక్కువగా ఉపయోగించేది దూదితో చేసిన వత్తులు. పత్తిని తెచ్చి, గింజలుతీసి, ఆ పత్తితో వత్తులు చేసుకోవాలి.   వీటితో దీపారాధన చేయటం వలన అదృష్టం కలసి వస్తుందట. 

 గ్రామాల్లోని చెరువుల్లో చక్కని కలువ పూలు విరిసి అందంగా కనిపిస్తాయి .  ఈ తామర పువ్వు కాండంలో నారవంటి పదార్ధం ఉంటుంది . దానితో వత్తిని చేసి ఉపయోగించినట్లయితే సిరి సంపదలకి విద్యా జ్ఞానాలకు రూపాలైన  లక్ష్మీ సరస్వతిల కటాక్షం సిద్ధిస్తుందని పెద్దల నమ్మకం. అంతేకాకుండా ప్రతికార్యమూ కూడా ఆ సిద్ధి , బుద్ధిల అనుగ్రహంతో నిర్విఘ్నంగా , విజయవంతంగా పూర్తవుతుంది . 

 జిల్లేడు పూలు ఎండిపోయాక వాటి గింజలతో పాటు ఉండే దూది లాంటి పదార్థంతో కూడా వత్తులు చేసుకోవచ్చు. ఇటువంటి వత్తులతో  దీపాన్ని వెలిగిస్తే,  వినాయకుడి ఆశీస్సులు అందుకుంటారు . వినాయకుడు అర్కమూలంలో ఉంటారు . ఆ అర్కదూదితో వెలిగించే దీపం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం . ఇలా వినాయకునికి దీపం పెడితే, సర్వకార్యసిద్ధి, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తాయి . 

 పార్వతీదేవిని ప్రసన్నం చేసుకుంటే మాంగల్యబలం సిద్ధిస్తుందని మహిళల విశ్వాసం.  ఆమెని ప్రసన్నం చేసుకోవాలంటే పసుపు వస్త్రంతో వత్తులు చేసి ఆ వత్తులతో దీపారాధన చేయాలి. వివాహ జీవితం సాఫీగా ఉండడానికి పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించే వారు, ఎర్రని వస్త్రంతో వత్తులు చేసి వాటితో దీపారాధన చేయాలి.  దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితంలో ఆప్యాయత అనురాగాలు నెలకొంటాయని పెద్దల మాట

 దీపము ఏ వత్తులతో పెడుతున్నాము అనేదే కాకుండా ఎన్ని వత్తులతో వెలిగిస్తున్నామనే విషయాన్ని కూడా పరిశీలించుకోవాలి.    రెండు వత్తుల దీపం  కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించి, శాంతి నెలకొనేలా చేస్తుంది.  సంతానప్రాప్తి కోసం మూడు ఒత్తులతో దీపాన్ని వెలిగించి, దైవాన్ని ఆరాధించాలి.  నాలుగు వత్తులతో చేసే దీపారాధన వల్ల పేదరికం దూరమవుతుంది.  సంపద సిద్ధించాలంటే ఐదు వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టం.  ఆరు వత్తులతో చేసే దీపారాధన వల్ల విజ్ఞానం ప్రాప్తిస్తుంది.  

ఈ విధంగా దీపారాధనలో ఎన్నో విశేషాలూ , దీపారాధన వల్ల ఎన్నో ప్రయోజనాలూ ఉన్నాయి. రోజూ మనం చేసే ఈ దీపపు  జ్యోతిలో మన జ్ఞాన జ్యోతి దీప్తించాలని కోరుకుందాం .

శుభం .  

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha