Online Puja Services

గుడిలో ఉండే రావిచెట్టుకి పూజలెందుకు చేస్తారో తెలుసా ?

18.190.156.212

గుడిలో ఉండే రావిచెట్టుకి పూజలెందుకు చేస్తారో తెలుసా ?
లక్ష్మీ రమణ 

రావి వృక్షం. తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దల మాట. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. మన సంప్రదాయంలో రావి చెట్టుకున్న ప్రాధాన్యతని మాటల్లో వర్ణించలేం . అయినా ఈ పెద్దోళ్లున్నారే ! ఏదీ ఊరికే చెప్పారన్నమాట ! ఇందులో కేవలం ఆధ్యాత్మిక విశేషం మాత్రమే ఉందనుకునేరు ! బోలెడన్ని ఆరోగ్య రహస్యాలూ దాగున్నాయి . మరింకెందుకాలస్యం వివరంగా తెలుసుకుందాం పదండి . 

గంగానమ్మో ! పోలేరమ్మో ! గంగరావి చెట్టుకింది ఆంకాలమ్మో ! అని గ్రామాల్లో గ్రామదేవతలకు చద్ది నైవేద్యాలు అదేనండీ బోనాలు సమర్పించేప్పుడు పాటలు పాడుతుంటారు . ఇవి అందరికీ తెలిసినవే కదా ! అదే విధంగా మీరు గమనించారంటే, కచ్చితంగా గ్రామదేవతల ఆలయాల్లో , రావి చెట్లుంటాయి. ఇలా ఈ ఆలయాల్లోని ఉండడానికి కారణం గ్రామ రక్షణకి వాటిని ఉపయోగించాలన్న సందేశం కావొచ్చు . ఎందుకంటె రావిలో ఉన్న ఔషధ గుణాలు అటువంటివి మరి ! 

  రావిమండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితో కలిపి కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనేతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశవ్యాధులు నివారణ అవుతాయి. అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను వాడుతారు. రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం. దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు. రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. రావి చర్మరోగాలను, ఉదరసంబంధ వ్యాధులను నయం చేస్తుంది, రక్తశుద్ధిని చేస్తుంది.

ఇక ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని గురించి చెప్పుకోవాలంటే, రావి చెట్టు పైన దేవుళ్లే కాకుండా పూర్వీకులు కూడా నివాసముంటారట.  రావి చెట్టు కాండం మీద బ్రహ్మ, కొమ్మలో విష్ణువు, పైభాగంలో శివుడు ఉంటాడని నమ్ముతారు. ఆచారం ప్రకారం ఈ చెట్టును పూజించడం ద్వారా జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయని నమ్ముతారు. రావి చెట్టు ఆరాధన వలన జీవితానికి సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోయి, అనంతమైన పుణ్యం లభిస్తుంది అని పెద్దలు చెబుతారు . 

రావి చెట్టు క్రింద శివుణ్ణి, హనుమంతుణ్ణి పూజించడం వలన ఆ దేవతలా అనుగ్రహం త్వరగా పొందే అవకాశం ఉంటుంది . శనివారం నాడు లక్ష్మీ దేవి రావిచెట్టులో ఉంటుందట . అందువల్ల ఆదేవిని ప్రసన్నం చేసుకొని సంతోషాన్ని, సంపదని , సౌభాగ్యాన్ని పొందాలనుకుంటే, ఆరోజు రావిచెట్టుకి నీరుపోయాలి .  అదేవిధంగా గురు వారం ఆచరించడం వలన కూడా జీవితానికి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయి.శనివారం నాడు రావి చెట్టు కింద ఆవనూనె దీపాన్ని వెలిగించడం ద్వారా శని దేవుడు ప్రసన్నుడై సాధకుల బాధలను తొలగిస్తాడని నమ్ముతారు.

అయితే రావి చెట్టుని పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలని గుర్తుంచుకోవాలంటున్నారు పండితులు . అవేంటంటే, సూర్యోదయం అయ్యాకే , రావిచెట్టుకి పూజలు చేయాలి . అంతేకానీ చీకటి వేళ, అలక్ష్మికి (దారిద్ర్య లక్ష్మికి) రావిచెట్టు ఆవాసంగా ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో పూజలు చేయకూడదు . ఆదివారం పూట , రావి చెట్టుకి నీళ్లు పోయకూడదు . అలాగే ఆచెట్టుని పెకిలించడం , నరకడం చేయకూడదు . 

ఈ నియమాలు పాటిస్తూ రావి చెట్టుని ఆరాధిస్తే, మంచి ఫలితాలుంటాయట ! కల్పవృక్షంగా మారి, కోరిన వరాల్ని విష్ణుస్వరూపము , తద్వారా లక్ష్మీ స్వరూపమైన రావిచెట్టు అనుగ్రహించగలదని విశ్వాసం .  

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi