Online Puja Services

గడ్డాలు నెరిసినా అన్నం తినడం రాదేమిటర్రా !!

3.12.36.30

బామ్మోవాచ !’గడ్డాలు నెరిసినా  అన్నం తినడం రాదేమిటర్రా !!’ 
-లక్ష్మీ రమణ 

‘అన్నం కూడా అలా తినాలి , ఇలాతినాలి అని నోట్లో ముద్దలు పెట్టి నేర్పించండి అత్తయ్యగారూ !! వీళ్ళు కాలేజీకెళుతున్నా ఒక్కరూ సరిగ్గా తినరు. ఎంతసేపూ ఆ సెల్లుఫోనూ , టీవీ తప్ప, వడ్డించిన గంటసేపటికి గానీ భోజనానికి లేవరు. వీళ్ళకి తోడు మీ అబ్బాయిగారు ! తిన్నాక అన్ని సర్దుకుని పడుకునేసరికి రాత్రి 12 దాటిపోతోంది “. అత్తగారితో ఒకింత సౌమ్యంగానే వెళ్లబోసుకుంది అమ్మ ! దీనికి మా బామ్మోవాచ మాకు ‘వామ్మో’ అనిపించేలా చేసింది. అదేంటో చదవండి మరి ! 

ఒరేయ్ అన్నం తింటానికి కాళ్ళుకడుక్కుని కూర్చుంటే, కాళ్లకున్న తడి ఆరిపోయే సమయానికల్లా , అన్నం తిని లేవాలి. అదీ పధ్ధతి . అంతేగానీ మీఅమ్మని ఇలా కాల్చుకొని తినడంకాదు. అంది బామ్మ .  ఆ గిన్నెలు అక్కడ పెడితే, మేమె ఆకలి వేసినప్పుడు పెట్టుకుని తింటాంగా ! అన్నాడు చిన్నోడు . 

అమ్మ చేత్తో పెట్టినప్పుడు, ఆ ఆహారంలో అమ్మ అనురాగం అనే గొప్ప పదార్ధం కలిసి పిల్లలకి ఆయువు వృద్ధి చెందుతుందిరా ! అయినా పదార్థాలు చల్లారిపోయాక తినకూడదు. వేడివేడిగా ‘ చెయ్యికాలా , నోరుకాలా (కాలేలాగా)’ తింటేనే రుచి, పుష్టి కూడా ! అదలా ఉంచితే,  అన్నాన్ని వడ్డించాక, వండాక  ఆలస్యంగా తినడం , పదార్థాలమీద మూటలు తీసేసి, అక్కడ పడేసి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు .   

ఎందుకంటె, మన చుట్టూ ఎన్నో సూక్ష్మ శరీరాలుంటాయి. అవి అన్నం లోని సారాన్ని తీసుకోవడానికి ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాయి.  అందుకే దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినడం ,  అన్నం కంచంలో వడ్డించేశాక  చాలా సేపటికి తినడం,  కంచం పెట్టి  అన్నం పెట్టాను రమ్మని గట్టిగా అరిచి పిలవడం,  మూతలు పెట్టకుండా ఉంచడం,  ఎండిపోయినవి తినడం చేయకూడదు . 

 అయితే ఏమౌతుంది? అవి కూడా జీవులే కదా! అని మీలాంటి ఈ తరం కుర్రాకాయలు అనుకోవచ్చు.  అయితే అవి అన్నం లోని సారమంతా తీసుకున్నాక,  మనము ఏవ్ పదార్థాన్ని తింటే శక్తి లభించదు . పైగా మన మనసు పై వాటి ప్రభావం పడి, పాపపు ఆలోచనలో,  లేక మానసిక ఒత్తిడికో దారి తీయొచ్చు.  అందుకే ఎప్పుడూ అన్నం భగవంతుడికి  నైవేద్యంగాపెట్టి, కాకి కి ఒక ముద్ద పెట్టి తినడం మంచిది . కాకికి పెట్టడం వలన పితృదేవతలు కూడా సంతృప్తిని పొందుతారు . 

అన్నం తినే ముందు తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అదే తడి కాళ్లతో పడుకోకూడదు. కాసేపు అటూ ఇటూ నడిచాక పడుకోవడం మంచిది.  

అయినా వంటచేయడానికి మీ అమ్మ పడే కష్టం , ఆ ముద్ద మీరు తినడంతో మరిచిపోతుందిరా ! ఆవిడకి మీరు చేసే సాయం ఏమీ లేకపోయినా , కాస్త తినయినా కష్టపడండి . లేటుగా తింటే, ఆ కడుపులోది అరక్క , ఒంటిగంటవరకూ ఆ పక్కమీద అటూ ఇటూ పొర్లాడమే సరిపోతుంది. పైగా చేతుల్లో ఆ వెధవ ఫొనులొకటి  ఏడుస్తాయ్ !! లేవండి ! అని ఉపన్యాసం ఏకబిగిన దంచేసింది బామ్మ . 

నాన్నతో సహా, నో టాకింగ్స్ , ఓన్లీ ఈటింగ్ అంతే !! ‘దెబ్బకి దయ్యాలు దిగొచ్చాయని’ మా అమ్మ గొణుక్కుంది.  అయితే , అది వేరే సంగతి . 

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba