Online Puja Services

గోరింటాకు ఎలా పుట్టిందో తెలుసా ?

18.188.152.162

గోరింటాకు ఎలా పుట్టిందో తెలుసా ?
-లక్ష్మీ రమణ 

అరచేత గోరింట మొగ్గ తొడిగితే, ఆ శోభే వేరుగా ఉంటుంది. ఇప్పటికీ, పెళ్ళిళ్ళకీ, పేరంటాలకీ, ఆషాఢమాసంలోనూ  అతివలు చక్కగా చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు . చేతి నిండా గోరింటాకుని పెట్టుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయంటుంది ఆయుర్వేదం. అదలా ఉంచితే, మన పురాణాలు గౌరమ్మకీ, గోరింటాకుకీ ఉన్న సంబంధాన్ని చెబుతూ గొప్ప గాథని వినిపిస్తాయి. 

కొన్ని పూలరెక్కలు , ఇన్ని తేనెచుక్కలు కలిపితే, గోరింట దిద్దిన చిన్నారి చేతులు ! గౌరమ్మ పర్వతుని కుమార్తె. ఆమె చిన్నారిగా ఉన్నప్పుడు, చక్కగా చెలికత్తెలతో కలిసి చుట్టుపక్కల ఉన్న వనాలలో ఆడుకుంటోంది. ఆ సమయంలోనే ఆమె రజస్వల అయ్యింది. ఆ దేవి రక్తపు చుక్క నేల తాకగానే, అక్కడ ఓ మొక్క పుట్టింది. ఆ వింటిని మహారాజుకి చేరవేశారు గౌరీదేవి చెలికత్తెలు. 

పర్వతరాజు , వెంటనే సతీసమేతుడై పరుగుపరుగునా వచ్చేశారు . అంతలోనే ఆ చెట్టు పెద్దగా ఎదిగిపోయింది . అప్పుడు ఇలా మాట్లాడడం  ఆరంభించింది. ‘అయ్యా ! నేను సాక్షాత్తూ నేను పార్వతీ దేవి రుధిరాంశతో జన్మించాను.  నా వలన లోకానికి ఎటువంటి ఉపయోగం కలుగుతుంది. నేను లోకానికి ఏవిధంగా ఉపయోగపడతాను ?’ అని ప్రశ్నించింది . అమ్మ ప్రక్రుతి కదా ! 

అపుడు పార్వతిదేవి చిన్నతనపు చపలతతో ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆ చెట్టు విశిష్టమైన గుణం వల్ల, ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. ‘అయ్యో బిడ్డచేయి ఇలా కందిపోయిందేమిటా ‘ అని ఆ తల్లిదండ్రులు బాధపడేలోపలే, ఆ చిన్నారి తల్లి ‘దీనివలన  నాకు ఏ విధమైన బాధా కలుగలేదు. పైగా, చక్కగా ఎర్రగా పండి ఎంతో  అందంగా , సువాసనలు వెదజల్లుతోంది’ అన్నది .

దాంతో పర్వతరాజు ‘ఇకపై గౌరమ్మ పేరుతొ గోరింటాకువై భువిలో స్త్రీ సౌభాగ్యానికి  చిహ్నంగా ప్రసిధ్ధమవుతావు’ అని ఆ చెట్టుకి చెబుతారు. ఇంకా , తన కూతురు రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు, స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుందని వరమిస్తారు. ఆ విధంగానే, ఇప్పటికీ గోరింటాకు, స్త్రీలలో అతిఉష్ణం తొలగించి వారి  ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాననాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింతచేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయబాధలు నయం ఔతాయి. అంతేకాక , తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతోంది .

కానీ ఇక్కడ ఇంకో విశేషం చెప్పుకోవాలి. పర్వతరాజు గోరింటాకును ఇచ్చిన వరాన్ని పురస్కరించుకొని గౌరమ్మ, ఆమె చెలులూ ఎంచక్కా గోరింటాకుని చేతులకూ, కాళ్ళకూ తీర్చి దిద్దుకున్నారట. అప్పుడు కుంకుమ బాధపడి, ‘ ఏం  గౌరమ్మ, ఇక బొట్టుగా కూడా, గోరింటాకునే పెట్టుకునేలా ఉన్నారే మీరు! ఇక నా కిక్కడ స్థానం లేనట్టే కనిపిస్తోంది మీ సంబరం చూస్తుంటే !’ అన్నాదిట . అప్పుడు గౌరమ్మ ‘లేదు కుంకుమా ! నీ ప్రాధాన్యత నీదే ! గోరింటాకు నుదుటన పండదు’అన్నారట. అందుకే ఇప్పటికీ గోరింటాకు నుదుటన పండదు.

అలా గోరింట ఆడవారి చేతుల్లో గులాబీగా, సూర్య చంద్రుల, ఎలా గంటె అలాగే ఒదిగిపోయి అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తోంది మరి ! అందుకే, చక్కగా కెమికల్స్ కాకుండా చక్కని గోరిటని తీరుగా తీర్చుకొని , గోరింట ప్రయోజనాలతో పాటు , గౌరమ్మ అనుగ్రహాన్ని పొందండి . శుభం . 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore