పెళ్లి ముహూర్తాలు రాత్రి పూట పెట్టడం ఎందుకు ?

3.230.142.168

పెళ్లి ముహూర్తాలు రాత్రి పూట పెట్టడం ఎందుకు ? 
లక్ష్మీ రమణ 

పెళ్లంటే ఎంచక్కా పట్టుచీరలు కట్టుకొని, రకరకాల నగలు వేసుకొని అందరితో సరదాగా గడపొచ్చు. బంధువులు, మిత్రులు, అందరూ ఒకే దగ్గర కలుస్తారు. కానీ ఈ ముహూర్తాలు ఒకటి ఉన్నాయిగా ! అవేమో ఏ రాత్రి పూటో , లేదంటే, తెల్లవారి ఝామునో ఉంటాయి. అలాంటప్పుడు పెళ్ళికి వెళ్ళినా , రాత్రంతా మేలుకొని ఉండలేక అటు వధూ వరులకి, ఇటు బంధువర్గానికీ బాగా ఇబ్బందిగానే ఉంటుంది . అసలు ఉదయంపూట సూర్యుడున్న సమయంలో ముహూర్తాలు పెడితే ఏమవుతుందట ?

పూర్వం పెళ్ళనుకోగానే పురోహితుడెవరు? ఆయన సాంప్రదాయ బాధగా చేయిస్తారా? మంచివాడేనా ? ఇలా ఉండేవి ఆలోచనలు. ఇప్పుడంతా మేకప్పులు , ఫొటోలూ , వీడియో గ్రాఫర్లదే పెళ్లి వేడుక . వాళ్ళ హడావుడీనే పెళ్ళంతా !రాత్రిపూట ప్లడ్లైట్లు వేసినట్టు ముఖాలమీద లైట్లు వేసి, చుట్టూ ఆ లైట్లకి గొడుగులు పట్టి బ్రహ్మాండమైన ఫోకస్ వేదికమీద పెట్టేస్తారు. వాళ్ళు జరగమన్నప్పుడు మనం జరగాలి తప్ప , మనకి ఆ వేదిక కనిపించట్లేదు అని మొత్తుకున్నా, మన గోడు వినేవారు ఎవరూ ఉండరు. 

ఇదంతా ఒకెత్తయితే, రాత్రంతా మేలుకొని ఉండడం వలన కళ్లు వాచిపోయి ఫోటోలు బాగా రావని ఇప్పుడు కాస్త ఉదయం పూత జరిగే పెళ్లిళ్లు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ పెళ్ళికి రాత్రిపూట లేదంటే, బ్రహ్మ ముహూర్త కాలం చాలా శ్రేష్ఠమైనది . వధూవరులు జీలకర్రా బెల్లం పెట్టుకున్నాక, సప్తపది పూర్తయ్యాక పురోహితులు వారికి అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు . ఆ నక్షత్రాన్ని చూపించడం వెనుక వారి దాంపత్యం నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాకంక్ష , ఇద్దరూ ఒకరికి ఒకరి ఒకే ప్రాణంగా ఉండాలన్న నియమం దాగున్నాయి . 

ఒకసారి యజ్ఞం చేస్తున్న సప్తరుషులూ తమ భార్యలతో సహా, ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణాలు చేశారు . ఆ సమయంలో వారిని చూసిన అగ్నిహోత్రునికి  సప్తఋషుల భార్యలపైనే మొహం పుట్టింది . ఆ సమయంలో భర్త బాధని చూడలేని స్వాహాదేవి , వారందరి రూపాలనీ తానె ధరించి, భర్తని సంతోషపెట్టింది . కానీ, మహా పతివ్రత అయిన వసిష్ఠుని భార్యయైన అరుంధతీ దేవి రూపాన్ని మాత్రం ఆమె పొందలేకపోయింది. అందుకే పెళ్ళిలో , సప్తఋషి మండలంలో ఉన్న అరుంధతీదేవి, వసిష్ఠుల జంటని పురోహితులు చూపిస్తారు. 

ఈ అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం, శిశిర, వసంత, గ్రీష్మ రుతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత, లేదా  తెల్లవారుజామున కనిపిస్తుంది. మాఘమాసాది పంచ మాసాల కాలములో  తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కనిపించదు . ఈ నక్షత్ర దర్శనం ఆ జంటకి నిండు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ కథ వారు ఎలా మసులుకోవాలో, ఎంతటి అన్యోన్యతని, నల్లకాన్ని, గౌరవాన్ని ఒకరిపట్ల ఒకరు కలిగి ఉండాలో చెబుతుంది . అందువలనే ముహూర్తాలు ఆ నక్షత్రం కనిపించే సమయాలలో పెట్టడం అనేది సరైన ఆనవాయితీగా మారింది . 

ఇంకొక అద్భుతమైన విషయం ఈ నక్షత్రాన్ని రాత్రిసమయంలో దర్శించడం వలన కంటి చూపు కూడా మెరుగవుతుందట. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. ‘?’ మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్న పిల్లాడిని ? మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చాలా చిన్నగా ఉంటుంది.


  

Quote of the day

The season of failure is the best time for sowing the seeds of success.…

__________Paramahansa Yogananda