Online Puja Services

నాగదోషం/ సర్పదోషం నుండీ బయటపడే మార్గాలేంటి ?

3.133.131.168

నాగదోషం/ సర్పదోషం నుండీ బయటపడే మార్గాలేంటి ?
-లక్ష్మీ రమణ 

నెలరోజుల గుడ్డు , ఆ పాపని పక్కనేసుకొని ఆరుబయట మంచం వేసుకొని, పడుకున్నది ఆ ఇల్లాలు. భర్త పొలం వేళ్ళాడేమో, ఇంకా తిరిగి రాలేదు. ఇంతలో ఎదురుగా ఉన్న దడి మీద ఏదో అలికిడి వినిపించింది. సంపెంగలో, మల్లెలో , మొగలిపూలో తెలియని ఒక గమ్మత్తైన పరిమళం అక్కడంతా వ్యాపించింది . తెల్లని ప్రాణి ఏదో జరాజరా మళ్ళి శబ్దం చేసింది . భర్తకోసం వేయికన్నులతో ఎదురుచూస్తున్న ఇల్లాలు చివ్వున తలెత్తి చూసింది. అదే సమయంలో ఆ ప్రాణికూడా పడగవిప్పి ఆమెవైపు చూసింది . 

బెదిరిపోయిందా ఇల్లాలు. పక్కనే ఉన్న పసిగుడ్డుని గట్టిగా పొదువుకుని, చుట్టుపక్కలున్న అన్నలు , తమ్ముల పేర్లన్నీ ఊరంతా వినిపించేలా గగ్గోలుగా అరిచింది. పడగవిప్పిన ఆ తెల్లని నాగుపాము కూడా , ఆమె చేసిన అలికిడికి మరింత రెచ్చిపోయి తోకమీదలేచింది. కానీ ఆమె పెనిమిటి అదేసమయంలో వెనకపాటుగా దాని తలమీద పిడుగులాంటి దెబ్బలవర్షం కురిపించాడు. అంటే, రక్తం కక్కుతూ కిందికి వాలిపోయింది. చుట్టుపక్కలవాళ్ళు వచ్చి దాని శరీరాన్ని నేలమీద పరిస్తే, ఎడడుగుల మేర స్థలాన్ని ఆక్రమించింది. అక్కడే ఉన్న పూజారిగారు, అయ్యో ఇది దేవతా సర్పం నాయనా , నమస్కరిస్తే, వెళ్లిపోయేదానికి కర్రతో సమాధానం చెప్పి శాపాన్ని మూటగట్టుకున్నావు కదా ! అన్నారు . ఆ సర్పం నోటిలో రాగి కాసుంచి, దహనం చేయించారు .  

ఇలాంటి కథలు మన జీవితాల్లో చాలామందివి . చాలా మంది పేర్లలో నాగ అనే శబ్దం చేరడానికి, ఆ నాగదేవతల పేర్లు పెట్టుకోవడానికి ఇటువంటి కారణాలు ఎన్నో ఉంటాయి . ఇటువంటి నాగశాపాన్ని తొలగించుకోవడం ఎలా ? ఆ పాముల శాపాలు మనల్ని, మన వారసులని కూడా వెంటాడతాయి . తరాలపాటు జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా చేస్తాయి .  

నాగదోష పరిహారంకోసం శుక్లచవితి, శుక్లపంచమి తిథులలో , శుక్రవారము, ఆదివారము నాడు నాగదేవతగా పూజలు నిర్వహించడం విశిష్టమని వారు సూచిస్తున్నారు. సర్ప మంత్రాధిష్ఠాన దేవత , నాగమాత అయిన మనసా దేవిని అర్చించడం వలన సర్పదోషాలు ఉపశమిస్తాయి . కాలసర్పదోషాలు కూడా తొలగిపోతాయి . సర్పహత్యాదోషం , సర్పబంధన విచ్ఛిన్న దోషాలు కూడా ఈదేవతని అర్చించడం వలన తొలగిపోతాయని శాస్త్రం  . 

అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహములో  అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుందని పురోహితులు అంటున్నారు.

అయితే ,ఈ సర్ప దోష పరిష్కారం దాని తీవ్రతని అనుసరించి జ్యోతిష్కుల సలహా తీసుకొని కూడా చేసుకోవచ్చు . సాధారణంగా ఆ పరిష్కారాలు ఇలా ఉంటాయి . 

నాగ దోషం తీవ్రమైనది అయినట్లయితే, ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి రోజు శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజ, ధానదికములు చేసినట్టయితే నివారణ జరుగుతుంది .

ఆరు ముఖాలు గాని,గణేశ్ రుద్రాక్ష గాని,ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించుటతో పాటు ఏనుగు వెంట్రుకల తో చేసిన రింగ్ గాని చేతికి కడియం గాని ధరించడం శుభప్రదం.

ప్రతీ శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిధులల్లోగానీ, శనివారం నాడుగానీ గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టడం ,పక్షులకు ఆహారం పెట్టడం  వలన కూడా దోష నివారణ కలుగుతుంది .

నాగ ప్రతిమ(సుబ్రహ్మణ్య ప్రతిమ )ని  27రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానము ఇవ్వడం వలన సర్పదోష నివారణ సాధ్యమవుతుంది .

ప్రతీ సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకం చేసి, క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయుట వలన దోషం పోతుంది .

నవగ్రహములకు ఇరవైఒక రోజులు ప్రదక్షిణలు చేయుట వలన శుభం జరుగుతుంది . రాహు కాలంలో రాహుకాల దీపాలు పెట్టటం వలన కూడా నివారణ జరుగును.

ప్రతీ ఆదివారం ఉపవాసముంటూ, నాగదేవతాలయం చుట్టు ప్రదక్షినలు చేస్తు, లలితా సహస్రనామావళి గాని, దుర్గాసప్త శ్లోకి పఠిస్తే శుభం జరుగుతుంది .

అధికదోష ప్రభావం కలవారు దేవాలయమునందు సుబ్రహ్మణ్య లేదా నాగదేవతా విగ్రహ ప్రతిష్ఠాపన చేయుట వలన పూర్తి దోష నివృత్తి అగును.

అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వలన కూడా దోషశాంతి జరుగుతుంది . 

నిత్యం దేవి సప్తశతి పారాయణం చేయట కూడా ఒక పరిహారమే. మంగళవారం రోజు గాని,ఆదివారం రోజు గాని ఉపవాసం ఉన్న కూడా దోషం నివారణ జరుగుతుంది .

రాహు కేతువులకు మూలమంత్ర జపములు తర్పనములు హోమము దానము చేయుటచేత కూడా దోష నివారణ అవుతుంది .

ఇక ప్రతీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించుట అభిషేకించుట కూడా సత్ఫలితాలనిస్తుంది .

వెండి నాగ ప్రతిమ చేయించి పదకొండు దినములు మూలమంత్ర సహితముగా పూజించి బ్రాహ్మణునకు దానము చేయుట వలన కూడా దోష నివారణయగును.

మినుములు.నువ్వులు.ఉలువలు.. ప్రతీ మంగళవారం దానము చేయుచు ఉన్న దోష నివృత్తియగును.

పైన చెప్పిన అన్ని పరిహారాలూ చేయలేకపోయిన కొన్ని అయిన శ్రద్దగా చేసినట్టయితే,  దోష నివృత్తి జరుగుతుంది . 
 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore