ముత్తైదువుగా సౌభాగ్యం నిండు నూరేళ్ళూ వర్ధిల్లాలంటే

3.230.142.168

ముత్తైదువుగా సౌభాగ్యం నిండు నూరేళ్ళూ వర్ధిల్లాలంటే, ఇలా చేస్తే చాలు . 
లక్ష్మీ రమణ 

ఐదోతనం కోసం తపించని స్త్రీ ఎవరుంటారు. దైవం అనుకూలించి , తన భర్తని  కాపాడాలని, తానూ సుమంగళిగా వెళ్లిపోవాలని కోరుకోని భారత స్త్రీలు ఉండరంటే, అతిశయోక్తి కాదు. సుమంగళిగా ఉండేందుకు ఎన్నో నోములూ వ్రతాలూ ఆచరిస్తుంటారు భారతీయ ఆడపడుచులు . సువాసినీ పూజలు, కుంకుమార్చనలు, దేవతార్చనలు ఇలా వీటికి అంతం లేదు .  అంతులేని ఐదోతనాన్ని కోరుతూ ఎంతటి శ్రమకైనా వెనుతీయని తత్త్వం మనది. కానీ ఈ సౌభాగ్యం కోసం ఒక చిన్న పని చేస్తే చాలంటుంది మన మంత్రం శాస్త్రం. 

ఆకాశం పరమాత్మని, నాధునిగా పొందిందనుకుంటా! ఉదయాన్నే తలంటుకుని , కురులు ముడేసుకున్న నిండు ముత్తైదువులా , నీలి మబ్బుల ముడి వేసుకొని సూర్యుణ్ణే తన కుంకుమగా ధరించి వెలిగిపోతూ కనిపిస్తుంది. భారతీయ ఆడపడుచులూ అంతే కదా ! నిండు పసుపు కుంకుమలతో ఎదురుగా నిలిచిందంటే ఆ అమ్మవారి స్వరూపం రూపుకట్టి ఎదురుగా నిలబడ్డట్టే .  

కలకాలం పసుపు కుంకుమలు నిలుపుకుని, ముత్తైదువుగా ఉండాలంటే ఏంచేయాలి ? సుమంగళిగా ఉన్న ప్రతి స్త్రీ ప్రశ్న ఇది. వాళ్ళందరి తరఫునా , ఆ అమ్మలగన్న అమ్మ పార్వతమ్మ  వకాలతు పుచ్చుకొని పరమేశ్వరుణ్ణి ఆ ప్రశ్నే అడిగింది.

ఆయన చాలా సులువైన ఉపాయాన్ని చెప్పారు. అదేమిటంటే, పెళ్లయిన తర్వాత ఆ ఇల్లాలు భర్త పేరిట , తన శరీరంలోని ఐదు చోట్ల కుంకుమ ధరిస్తే చాలు .  వైధవ్యం దూరంగా ఉంటుందట . ఎక్కడెక్కడంటే, 

1.పాపిట్లో
2. కనుబొమల మధ్యన అనగా భృమధ్య భాగంలో
3. ముచ్చెలి గుంటలో అనగా కంఠం కింద భాగంలో
4. వక్షస్థలం మీద
5. నాభి ప్రాంతంలో . 

ఇదే మహాపూజ. ఇల్లాలికి పతియేకదా ప్రత్యక్షదైవము. అందువల్ల ఇలా ఆవిడ చేస్తే, ఆయన నిండైన ఆయుష్షుతో వర్ధిల్లుతారని ఈశ్వరుడు చెప్పారు. ఇది మంత్రశాస్త్రానుగతం అని కూడా వివరించారు. కాబట్టి ఆవిధంగా చేసి మన ధర్మాన్ని కాపాడుకుందాం. 

శుభం. 

Quote of the day

The season of failure is the best time for sowing the seeds of success.…

__________Paramahansa Yogananda