Online Puja Services

పితృకార్యాలు నిర్వర్తించే ఇంటి ముందర ముగ్గు వేయొచ్చా?

3.145.173.112

పితృకార్యాలు నిర్వర్తించే ఇంటి ముందర, ఇంట్లోనూ  ముగ్గు వేయొచ్చా? 
-లక్ష్మీ రమణ 

ఏ ఇంటిముందు ఉదయాన్నే కళ్లాపిచల్లి ముగ్గుపెట్టి వుంటుందో ఆ ఇంటికి రావడానికే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఈ కారణంగానే ఉదయాన్నే వాకిలి శుభ్రంగా ఊడ్చి ఆవుపేడతో కళ్లాపిచల్లి బియ్యపు పిండితో ముగ్గు పెడుతుంటారు. ఈ ముగ్గులో మరో విశేషం కూడా దాగి ఉంది. ముగ్గు వేసేప్పుడు , గుమ్మం దగ్గర ముందుగా నాలుగు అడ్డగీతలు గీస్తారు. ఈ గీతాలు దాటుకొని లక్ష్మీ దేవి బయటకి వెళ్లోద్దని ఆ ఇల్లాలి ప్రార్ధన అది. అలాగే జేష్టాదేవి ( దారిద్ర్య లక్ష్మి ) ఆ గీతలు దాటుకొని లోపలికి రావద్దన్న ప్రార్థన కూడా . 

ఇక పండుగ రోజుల్లో ఈ ముగ్గు మరింత అందంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటూ వుంటారు. దానివల్ల వాకిలికేకాదు, ఆ ఇంటికే పండక కళ , లక్ష్మీ కళ వచ్చేస్తుంది. ఆ ముగ్గులో చేరిన బియ్యపు పిండి భూతబలిగా పనికి వస్తుంది. శుభ కార్యాలలో , యజ్ఞయాగాదులలో కొన్ని రకాల ముగ్గులని ప్రత్యేకించి వేయడం కూడా మన సంప్రదాయంలో ఉన్న మరో విశేషం . ముగ్గు, పసుపు, కుంకుమలు , సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా శుభ సూచకాలు. శుభకార్యాలలో ఇవిలేకపోతే, దేవతలు నిలిచి ఉండరు . 

అయితే, అశుభం జరిగిన ఇంట్లో, పితృకార్యాలు నిర్వర్తించే ఇంటి ముందర ముగ్గు వేయొచ్చా  ? అనేది చాలామందికి ఒక సందేహం. జరిగేది ఖచ్చితంగా దేవతార్చనే. పితరులు దేవతలే. వారి ఆశీర్వాదం మనకి శుభాన్ని, సంతోషాన్ని, సంపదల్ని చేకూర్చేదే. అయినప్పటికీ వారు ఏలోకంలో ఉన్నారో, ఏ స్థితుల్లో ఉన్నారో మనం చెప్పలేం కదా! అటువంటి వారిని ఆహ్వానిస్తున్నప్పుడు, ముగ్గుగా వేసిన గీతని దాటి వారు లోపలి రాలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు వారు వెనుతిరిగి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది . అందుకని పితృకార్యాలు నిర్వహించేప్పుడు మాత్రం ముగ్గు వేయకూడదు. కోడళ్ళు బొట్టు పెట్టుకోకూడదు. 

కానీ,  వాకిట్లో ముగ్గులేని ఇళ్లలోకి ప్రవేశించడానికి దుష్టశక్తులు సిద్ధంగా ఉంటాయని అంటారు. అందువలన పితృకార్యం నిర్వహణ పూర్తి అయిన తరువాత, బొట్టు పెట్టుకోమని, వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గుపెట్టాలని చెబుతుంటారు పండితులు . దీనిని బట్టి ముగ్గు అనేది ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాదు, ఇంటికి రక్షణని కూడా ఇస్తుందని గ్రహించాలి. 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore