Online Puja Services

ఇక్కడ హనుమంతుని పేరు పలకాలంటే

18.119.160.154

ఇక్కడ హనుమంతుని పేరు పలకాలంటే , చాలా దమ్ముండాలి . 
-లక్ష్మీ రమణ 

హనుమంతుడి పేరు పలుకకపోవడానికి ఇదేమీ లంక కాదు. శాకినీ, డాకినీ లాంటి దయ్యాలున్న చోటుకాదు . అయినా వాటినైతే ఆయన ఒక్క తోక తాపుతో అవతలకి తోసేసేవాడే ! కానీ ఇక్కడ హనుమంతుడు దొంగతనం చేశారు మరి ! హనుమంతుడు దొగతనం చేయడమేమిటా అని ఆశ్చర్యపోకండి , ఏకంగా ఇక్కడివాళ్ళు ఆయన్ని తమకి ద్రోహం చేసినట్టుగా భావిస్తారు . ఆయన పేరు చెప్పినా వెలేస్తారు . ఆ కథేమిటో చూద్దాం పదండి . 

 హనుమంతుడిని పూజిస్తే సర్వ భయాలు దూరమవుతాయని,  అన్ని ఆపదలనుంచి రక్షించేవాడు హనుమంతుడని, అభయప్రదాత అని పూజలు చేస్తాం. కాని ఆ ఊర్లో మాత్రం పూజలు కాదుకదా కనీసం హనుమంతుడ్ని తలవను కూడా తలవరు. పైగా ఎవరైనా ‘హనుమంతుడు’ అని ఉచ్చరిస్తే చాలు విరుచుకు పడిపోతారు. మనల్ని కొట్టినంత పనిచేస్తారు. పొరపాటున ఎవరైనా హనుమంతుడ్ని ఆరాదించినట్టు తెలిస్తే, ఇక అంతే సంగతులు ఏకంగా ఊరినుంచే బహిష్కరిస్తారు. ఎందుకలా...? ఆ ఊరి ప్రజలు ఆంజనేయుని ఎందుకంత ద్వేషిస్తారు? అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే. 

అంజనేయుడు తమ ఊర్లో దొంగతనం చేసాడు. అందుకే అతడిని ద్వేషిస్తాం అంటారు. ఇంతకీ ఆయన ఏం దొంగతనం చేశాడు అంటే, తమ మూలికల కొండ దొగలించాడని సమాధానమిస్తారు . దీని నేపధ్య వివరణని ఇలా వివరిస్తారు కూడా ! రామరావణ యుద్ధం జరుగుతున్నపుడు రావణాసురుని కొడుకు మేఘనాధుడు చేసిన ఆయుధ ప్రయోగానికి లక్ష్మణుడు మూర్చపోతాడు . అప్పుడు  లక్ష్మణుడిని బతికించడానికి అంజనేయుడు గంధమాధన పర్వతం/ద్రోణగిరి  మీదున్న సంజీవినీ పర్వతాన్ని తీసుకుపోయి లక్ష్మణుడిని బతికించాడు. ఆ గంధమాదన పర్వత ప్రాంతమే  ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని, ఆల్మోరా జిల్లాలో ఉన్న ఈ ద్రోణగిరి ప్రాంతం .

ఆంజనేయుడు ఆ పర్వాతాన్ని తీసుకెళ్లారే గానీ , వెనక్కి తెచ్చి మళ్ళి  దానిని ద్రోణగిరి ప్రదేశానికి చేర్చలేదు . అలా హనుమంతుడు ఆ గిరిని ఎత్తుకుపోక ముందరి నుండీ ,  దానిని గ్రామంలోని భూటియా తెగ ప్రజలు దేవతగా భావించి పూజించేవారట.  తాము దేవతగా పూజించుకునే సంజీవినీ పర్వతాన్ని దొంగతనంగా తీసుకుపోయిన అంజనేయుడంటే ఇప్పటికీ వారికి విపరీతమైన కోపం, ద్వేషం. అందుకే, ఆ ఊరిలో అంజనేయుడికి సంబంధించిన పేర్లు వినబడినా, పూజలు చేసినా చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా హనుమంతుడికి పూజలు చేసినట్టు తెలిస్తే వారిని ఏకంగా ఊరినుంచే బహిష్కరిస్తారు.

పాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఈ ప్రదేశంలోని కొండ పై తపస్సు చేశాడు కనుకనే ద్రోణగిరి అన్న పేరొచ్చిందని స్థానికులు చెబుతారు. పాండవులు వనవాస సమయంలో కొద్దీ రోజుల పాటు ఇక్కడ గడిపినట్లు మహాభారతంలో పేర్కొన్నారు. 

ఈ పర్వత ప్రాంతానికి  దునగిరి, దూణగిరి అనే పేర్లుకూడా ఉన్నాయి . ఈ పేర్లు ఇక్కడున్న రుణగిరి మాత పేరుమీదుగా వచ్చాయి . ఈ గ్రామం సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తున కుమవొన్ పర్వత శ్రేణులలో ఉంటుంది . ద్రోణగిరి లో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠం కలదు. గుడిలో కొలువైన దేవతను 'దునగిరి దేవి' గా కొలుస్తారు.

దున గిరి దేవి ని మహామయ హరిప్రియ గా అభివర్ణిస్తారు. ఈ శక్తి పీఠానికి గల మరో పేరు 'ఉగ్ర పీఠ'.

దేహరాడూన్ నుండీ బస్సు సౌకర్యం ఉంది . కథోడ్గం రైల్వే స్టేషన్, అల్మోరాకు 90 కిలోమీటర్ల దూరంలో కలదు. జమ్మూ తావీ, శ్రీనగర్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుండి స్టేషన్ కు రైళ్లు వస్తుంటాయి. ఉధం సింగ్ నగర్ లోని పంటనగర్ ఎయిర్ పోర్ట్ దునగిరి కి సమీపాన, అల్మోరా కు 127 KM ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం ఢిల్లీ నుండి నేరుగా కనెక్ట్ చేయబడింది. న్యూ ఢిల్లీ నుండి కేవలం గంట ప్రయాణం లో పంటనగర్ ఎయిర్ పోర్ట్ చేరుకోవచ్చు.  అక్కడి నుండీ టాక్సిలుంటాయి  . 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore