నైమిశారణ్యం

44.192.25.113

యుగాల చరిత్ర, అంతులేని ఆశ్చర్యాల కలనేత ‘నైమిశారణ్యం ‘ 
-లక్ష్మీ రమణ 

ప్రతి పురాణంలోనూ ‘నైమిశారణ్యంలో శౌనకాది మహాములకూ సూతమహర్షి ఇలా వివరించసాగారు’ అని కథ మొదలవుతుంది. గమనించే ఉంటారు .  ఇంతకీ ఆ నైమిశారణ్యం ఏ దేశంలో ఉంది ? దాని ప్రత్యేకతలేంటి ? అని శోధిస్తే, కొన్ని యుగాల చరిత్ర, అంతులేని ఆశ్చర్యాల కల నేతలా ఒక మహా అరణ్యమై మన ముందు నిలుస్తుంది. ఆ విశేషాలని మీతో పంచుకోవాలన్న చిరుప్రయత్నం , అవధరించండి . 

ఇది దధీచి మహర్షి తన ఎముకల్ని వజ్రాయుధంగా చేసిన చోటు . రాములవారు సీతమ్మని ఇక్కడే, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో విడిచి రమ్మని లక్ష్మణస్వామికి చెప్పారు . ఈ ప్రదేశమే రాముని పుత్రులు లవకుశులకి జన్మనిచ్చింది .    రాముడు అశ్వమేథయాగం చేసిన చోటిది. ప్రహ్లాదుడు పూజలు చేసిన పుణ్య ప్రదేశమిది . ఈ అరణ్యంలోనే రామాయణం , మహాభారతం వ్యాసుని నోట పురుడు పోసుకున్నాయి . ఆయా ప్రదేశాలని ఇప్పటికీ చూడవచ్చు . 

అదే ఉత్తరప్రదేశ్ లోని లక్నోకి 94 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైమిశారణ్యం . ఇది సీతాపూర్ అనే జిల్లాలో ఉంటుంది . సీతా దేవి పేరుతో రాముడు బ్రాహ్మణులకు దానం చేసిన ప్రాంతమే నేటి ఈ  సీతాపురం/ సీతాపూర్  అని చెప్పుకుంటారు. శివపురాణంలోనూ నైమిశారణ్య ప్రస్తావన ఉంది.

పేరు వెనకున్న చరిత్ర :

ఈ ప్రాంతానికి నైమిశారణ్యమనే పేరు రావడానికి సంబంధించిన కథలు వరాహపురాణం , వాయుపురాణాలలో కనిపిస్తాయి . 

వరాహ పురాణం ప్రకారం ఇది విష్ణుమూర్తి  అసురులను సంహరించిన ప్రాంతం. లిప్తకాలంలో విష్ణువు అసురులను అంతమొందించిన అటవీ ప్రాంతం కాబట్టి నైమిశారణ్యంగా దీనికి పేరు వచ్చింది.

ఇక వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన మరో కథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధ అనంతరం కలియుగ ఆరంభ సమయంలో శౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణ కోసం చూపించమని బ్రహ్మను ప్రార్థిస్తారు

దీంతో బ్రహ్మదేవుడు దర్భలతో ఓ పెద్ద చక్రాన్ని సృష్టించి ఆ చక్రం వెంట కదిలివెళ్లాల్సిందిగా సూచిస్తాడు. ఈ మనోమయ ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనదని, యాగం చేయడానికి అర్హత కలిగినదని చెబుతారు.

దీంతో చక్రం ప్రస్తుతం నైమిశరణ్యం ఉన్న చోటుకు రాగానే పెద్ద శబ్దంతో విరిగిపోతుంది. ఆంతేకాకుండా చక్రం విరిగిపోయిన చోటు నుంచి ఉదృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది.

దీంతో మునులు ఆ ఆది పరాశక్తిని పూజించగా ఆ జల ఉదృతిని మహాశక్తి ఆపివేస్తుంది. కాల క్రమంలో ఆ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది, లింగధారిణి శక్తి రూపంలో లలితా దేవి ఆలయంగా పేరుగాంచింది. ఆ చక్రం ఆగి విరిగిపడిన ప్రాంతం చక్రతీర్థం అయ్యింది. అదిశంకరులు ఇక్కడి లలితా దేవిని దర్శించి లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు.

బలరాముని బ్రహ్మహత్యాపాతకాన్ని సైతం పోగొట్టగలిగిన అమృత తీర్థం ఇక్కడి చక్రతీర్థం.  కాబట్టి, నైమిశారణ్యాన్ని దర్శించేవారు, తప్పక ఇందులో స్నానం ఆచరిస్తుంటారు . 

నైమిషారణ్యంలో ఇతర ప్రత్యేక ఆకర్షణలు:

 సూతగద్దె (సూతమహర్షి సౌనకాది మహామునులకీ పురాణ గాథలని వివరించిన ప్రదేశం ), దేవరాజేశ్వర మందిరం, అనందమయి ఆశ్రమం, సేతుబంధరామేశ్వరం, రుద్రావర్తము అనే ఆలయాలు ఇక్కడ ప్రసిద్ధి చెందిన దేవాలయాలు.చక్ర తీర్తం, వ్యాసపీఠం, సూరజ్ కుండ్, పాండవుల కోట, హనుమాన్ గఢీ, లలితాదేవీ మందిరం వంటి ముఖ్యమైన పూజా స్థలాలు భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. తీర్థయాత్రలు చేస్తున్న వారికి నైమిషారణ్యంలో ప్రతి ఏటా మార్చిలో నిర్వహించే ప్రదక్షిణలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది
 

ఇలా చేరుకోవచ్చు :

లక్కో-బాలాము మధ్య గల శాండిలా స్టేషన్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో నైమిశారణ్యం రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడకు వివిధ నగరాల నుంచి నేరుగా బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి. నైమిశారణ్యం స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో అనేక సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. 

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna