Online Puja Services

‘గంగవిడువుము, పార్వతి చాలున్’

18.116.90.141

‘గంగవిడువుము, పార్వతి చాలున్’ అని పరమేశ్వరునికి చెప్పిన కవిసార్వభౌముడు . 
లక్ష్మీ రమణ 
 
శ్రీనాథకవి తెలుగు కవితా జగతిలో సార్వభౌముడని పేరొందినవాడు .  తెలుగు సాహిత్యం, తెలుగు సాహితీ ప్రియులు, వున్నంత వరకూ శ్రీనాధుడు చిరంజీవే! ఆయన రాసిన కావ్యాలన్నీ చాలా గొప్పవే.  వాటిలో శృంగార నైషధం అత్యుత్తమైనదని పండితాభిప్రాయం . ఈ కావ్య రచనతో శ్రీనాధుని కీర్తిబావుటా కావ్యాకాశంలో ఉజ్వలంగా రెపరెప లాడింది. దివ్యమైన ప్రబంధాలకి ప్రాచూర్యాన్ని కల్పించినవాడు . ఆ  తరహా రచనలని చేసి నాటి రాజుల, ప్రజల మన్ననలు చూరగొన్న కవిసార్వభౌముడు శ్రీనాధుడు .  ఆయన్ని స్మరించుకోవడం అంటే, సాహితీజల్లుల్లో తడిసి ముద్దవడమే . చీకటి వెలుగుల రంగేళి లాంటి ఆ కవినాథుని గురించి కొన్ని విశేషాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం . 

శ్రీనాధుడు ఎప్పుడు పుట్టాడో సరిగ్గా తెలీదు . చరిత్రకారుల అంచనాల ప్రకారం (1365–1441 మధ్య జీవించాడు ) 15 వ శతాబ్దానికి చెందినవాడు . కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు. ‘శ్రీనాధుడు రెడ్డిరాజుల కడనున్న విద్యాధికారి’ అన్నమాట లోక విదితం. అద్దంకి రెడ్డిరాజులు క్రమముగా కొండవీడు, రాజమహేంద్రవరములలో రాజ్యమేలినారు. శ్రీనాధభట్ట సుకవి కొన్నాళ్ళు విస్తృతముగా ఆంధ్రదేశముననే కాక కర్ణాటక ప్రాంతములో  కూడ సారస్వత యాత్రలు చేసి, తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు.

ఒక్కొక్క కవికీ ఒక్కొక్క రచనా శైలి ఉంటుంది. ఒకే కధని వేరు వేరు వ్యక్తులు, తమకి తోచిన విధానంలో రకరకాలుగా చెబుతుంటారు కదా ! ఇది కూడా అలాగే అన్నమాట. అలా శ్రీనాధుడు చెప్పిన నలదమయంతుల కథ ‘శృంగారనైషథం’. 

ప్రేమ కథలు - అప్పుడూ , ఇప్పుడూ , ఇక ఎప్పటికీ మనోరంజకాలే అనేందుకు ఉదాహరణే , ఈ కథ .  నల మహారాజు , అపూర్వ సౌందర్యవతి అయిన దమయంతిల మధ్య ప్రేమ , దానిని కధగా శ్రీనాథుడు చెప్పిన తీరు మాటల్లో చెప్పాల్సినది , చెప్పేది కాదు . అది ఆ కావ్యాన్ని చదివితేగానీ తీరని దాహం . మరొకరికి అతంటి  కథనం సాధ్యమేనా ? అనిపించే రీతిలో శ్రీనాధుడు ఆ కాదని చెప్పి ఒప్పించారు . చక్కని తేటతెలుగులో , ఇప్పటి తెలుగు విద్యార్థులు చదివినా అర్ధమయ్యేలా మనోరంజకంగా , మనోజ్ఞంగా ఉంటుంది శృంగారనైషధం .      

శ్రీనాధుడు ఆయన రచనల్లో మూర్తిమంతుడై మనకి గోచరిస్తారు . నిండైన ఆత్మవిశ్వాసంతో , చక్కని గంభీరమైన ఆకృతితో అంతులేని విజ్ఞాన సంపదతో సరస్వతీ పుత్రుడై దర్శనమిస్తారు .  

ఇక, ఒకింత శ్లేషని ఒలికిస్తూ, అప్పటికప్పుడు , జరుగుతున్న సంఘటనలను , పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఆయన చెప్పిన  చాటువులు (ఆయన పేరుతొ వేరేవారు రచించారని విమర్శకులు అభిప్రాయపడ్డప్పటికీ ) చాలా అద్భుతంగా ఉంటాయి. చాటు" అనే సంస్కృతం మాట తెలుగులో చాటువుగా మారినది. ‘చాటు’ అంటే ప్రియమైనమాట అని అర్ధం. స్వేచ్ఛ, స్వాతంత్రాలతో, ఎటువంటి నిబంధనలు లేకుండా మనసుకు నచ్చేలా, తోచేలా అప్పటికప్పుడు అల్లుకుపోవచ్చు. మనసులో పెల్లుబికిన భావాన్ని చాటువు ద్వారా చెప్పవచ్చు. అందుకే వేమనగారన్నట్టు, "చాటుపద్యమిలను చాలాదాయొక్కటి’  అని  చాటు  పద్యం ఎంతో అందంగా, భావసౌందర్యంతో  ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక చాటుపద్యాన్ని చూడండి .   

“ ఫుల్ల సరోజ నేత్ర! అల పూతన చన్నుల చేదు ద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము! నీ పస కాననయ్యెడిన్”

వికసించిన తామరపూల రేకులవంటి నేత్రములు కలిగిన ఓ శ్రీకృష్ణా ! అప్పుడెప్పుడో పూతన ఇచ్చిన విషపు చనుబ్రాలు తాగి , అడవిలో పుట్టిన దావాగ్నిని మింగి అరిగించుకున్నావని నిక్కుతున్నవే (గర్వపడుతున్నావా ?) ? గొప్పదానమంటే, అదికాదయ్య !  పల్నాటి సీమలో చింతాకుతో కలిపి ఉడికించిన బచ్చలికూరని జొన్న అన్నములో నంచి ఒక్క ముద్ద తిని చూపించు , అప్పుడు నీ పసఏంటో తెలుస్తుంది అంటారు .  పల్నాటి సీమలో తానూ ఆరగించిన భోజనం యెంత రుచికరంగా ఉంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు .  అలాగే , 

‘సిరిగలవానికిజెల్లును
తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశాగంగవిడువు పార్వతిచాలున్.’

పలనాడు సీమలో  శ్రీనాథుడు ప్రయాణిస్తున్నప్పుడు, దాహంతో  నాలుక పిడచకట్టుకు పోతే, నీరు దొరకక. పలనాటి నీటి కొరతని సున్నితంగా, ఆ పరపమేశ్వరునికి విన్నవించిన వైనం ఈ చాటువులో గమనించండి . డబ్బున్న మహారాజు ఆ శ్రీకృష్ణుడు పదహారువేలమంది గోపికలని కట్టుకున్నా చెల్లుతుందయ్యా ! నీవంటి స్మశానవాసికి , తిరిపెము స్వీకరించేవాడికి ఇద్దరు భార్యలెందుకయ్యా ? ఆ గంగమ్మని విడిచిపెట్టు , పార్వతిదేవి చాలులే అని ఒకింత అతిశయంతో , ఆ పల్నాటి సీమలో ఉన్న నీటి కరువుని  వివరించి  చెప్పిన పద్యమిది. చూడండి ఆ అలతి అలతి పదాలలో ఉన్న సొబగు , అర్థంలో ఉన్న వైచిత్రి , సౌందర్యం  ఎంత గొప్పగా ఉన్నాయో !

గౌడడింఢిమభట్టు అనే కన్నడ దేశ పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి, ఆయన గర్వానికి ప్రతీకయైన  కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఇది ఈ శ్రీనాధ కవిసార్వభౌముని కీర్తి  కిరీటంలో కలికితురాయి వంటి సందర్భం . దీని గురించి శ్రీనాధుడే ఇలా చెప్పుకుంటారు . 

‘దీనారటంకాల దీర్థమాడించితి
   దక్షిణాధీశు ముత్యాలశాల,
పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య
   నైషధగ్రంథ సందర్భమునకు,
పగులగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి
   గౌడడిండిమభట్టు కంచుఢక్క’
అంటారు . 

ఇంతటి కవితా చంద్రుని కీర్తి ప్రభలు అమావాస్య చీకటిని చూసి మసకబారక తప్పలేదు .   కొండవీటి ప్రభుల పతనంతో ఆయన వైభవం దిగజారి దక్షిణ దిశ పట్టింది. ముఖ్యంగా ఆయన చివరి రోజులు అతి దైన్యంగా గడిచాయి. 

పోషించే రాజులు లేకపోవడంతో , ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అవమానం, అపహాస్యం అడుగడుగునా ఆ కవిశ్రీమంతుని కుళ్ళబొడిచాయి . కృష్ణాతీరాన ఉన్న బొడ్డుపల్లి గ్రామాన్ని గుత్తకు తీసుకొని, శిస్తు కట్టని కారణంగా ఆయన భుజంపై ఊరిబయటనున్న శిలను ఉంచి ఊరంతా తిప్పారని ఆయన చాటు పద్యం ద్వారా తెలుస్తుంది. 

   ‘కవిరాజుకంఠంబు కౌగిలించెనుగదా
   పురవీధినెదురెండ బొగడదండ,
   సార్వభౌముని భుజాస్కంధ మెక్కెనుగదా
   నగరివాకిటనుండు నల్లగుండు’


అని ఆ సందర్భాన్ని కూడా స్వయంగా చాటువుగా చెప్పారాయన . 

ఎంతటి దయనీయమైన స్థితి!! ఒక ఉజ్వలమైన కవి, అపూర్వ విజ్ఞాన సంపన్నుడు పడవలసిన కష్టము కాదుకదా ఇది ! అందుకే అంటారేమో , జీవితంలో చీకటి వెలుగులు అమావాస్యా , పౌర్ణములవలె ఉంటాయని. కానీ ఆయన అంతిమ సమయంలో చెప్పిన మరో పద్యం గుండెని పిండేసి, ఇంతకు మించిన  ఆద్రతతో  కారు మేఘమై కమ్మేస్తుంది . 

‘కలియుగంబున నిక నుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి’
అంటాడు . 

 ఆంధ్ర సాహితీ చరిత్రలో యిటువంటి పరిస్థితి శ్రీనాధునికి మాత్రమే చూస్తాము. కావ్య జగత్తులో ధృవతారగా మెరిసి అంతిమ సమయంలో నేలపాలు కావడం యెంతటి  బాధాకరం. నిజమే కావొచ్చు ఆ పున్నమి కవి చంద్రుడు , దివిసీమల  దేవ సభలో అమరకవిత్వాన్ని వినిపిస్తూనే ఉండిఉండచ్చు . భువిపైన విరియింపజేసిన తన సుమాల పరిమళ కీర్తిని ప్రసరింపజేస్తూ , ఆ కవినాథుడు అక్కడి డిండిమభట్టుల కంచుఢక్కలు మ్రోగించుచుండొచ్చు . కానీ , ఆ కవి ఘంటం ప్రభవించిన అక్షర పరిమళాలు మాత్రం ఈ భువిపై ఎన్నటికీ పారిజాతాలై తమ సుగంధాన్ని తెలుగు భాషకి అలదుతూనే ఉంటాయి.   

 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha