Online Puja Services

ఇదే అసలైన గీతగోవిందం

3.23.103.87

అష్టపదులు - ఆ గోవిందునికి ఇష్టపదులు - ఇదే అసలైన గీతగోవిందం 
లక్ష్మీ రమణ . 

‘శృంగారం’ అనగానే అదేదో వినకూడని మాటైనట్టు ఖంగారుపడిపోయే కాలమది . ఆకాలంలో మధుర భక్తితో మాధవుణ్ణి ప్రేమించి , అష్టపదులతో ఆరాధించి , అవాజ్యమైన భక్తి రసగంగలో మునిగి తేలిన భక్తాగ్రేశ్వరులలో జయదేవుడు ఒకరు . గీతగోవింద కావ్యం- జయదేవుని అష్టపదులు . రాధా మాధవుల - బృందావనమది . భక్తుడే, రాధమ్మగా మారితే, భగవంతుడు భర్తగా మారి సాగించిన శృంగార కేళి అది . అర్థం శృగారరసపానం . అంతరార్థం -  ఆధ్యాతికానంద సాగరం . ఆ లీలామనోహరుని దివ్యరూప సందర్శనం , మోక్షమార్గం . రండి, ఈ రోజు ఆ మధుర రస పానాన్ని ఆస్వాదిద్దాం . 

మనసు ఒక కోతి . మతులెన్ని చెప్పినా, తిరిగి వద్దన్న చోటికే వెళతానంటుంది . దానికి పగ్గం వేసి ఆధ్యాత్మికబాటలో పయనించేలా చేయాలి . కానీ మనం చెప్పినమాట అది వినేలా చేయడం ఎలా ? పిల్లాడికి చదువుకోవడం ఇష్టం ఉండదు .  మిఠాయి ఇస్తానని ఆశపెట్టిన అమ్మ మాటకి కట్టుబడి , ఆ తాయిలం కోసం కుదురుగా కూర్చిని చదువుతాడు . అలాగే మనసుకు అది కోరుకునే తాయిలం ఇవ్వాలి . ఆ తాయిలం దాని కోరిక అయితే, అందులోని భావన భగవంతుడు .  ఆయన్నే ప్రియుడిగా చేసి నిలబెట్టి , ఆ మధుర రసగంగంలోనే మునకేసి , ముక్తికాంతని చేరుకొనే ప్రయత్నమే -మధురభక్తి చూపే మోక్షమార్గం . అదిగో , అలాంటి మధుర భక్తి , అన్నమయ్య పాటల్లో , మీరాబాయి కీర్తనల్లో , జయదేవుని అష్టపదుల్లో మనకి కనిపిస్తుంది .  
 
అష్టపదులు - ఆ గోవిందునికి ఇష్టపదులు. అవి జయదేవ కృతాలు . ఈయన 12వ శతాబ్దానికి చెందిన కవి .  ఒరిస్సాలోని పూరీ క్షేత్రానికి దగ్గరలో ఉన్న , బిందుబిల్వ అనే గ్రామంలో జన్మించారు . ఈ ఊరికి ‘కెందువి ‘ అని మరోపేరు కూడా ఉంది . తండ్రి భోజదేవుడు . తల్లి రమాదేవి . చిన్ననాటినుండే , జయదేవులు ఎక్కువ సమయం ధ్యానంలో గడుపుతూ ఉండేవారు . శ్రీ పురుషోత్తమ స్వామివారి లీలా వైచిత్రి కారణంగా, పద్మావతి అనే నర్తకిని జయదేవులు వివాహం చేసుకున్నారు . క్షేత్ర  మహాత్యమేమో తెలీదుగానీ, భార్యాభర్తలిద్దరూ అపరిమితమైన కృష్ణ భక్తులు . కృష్ణ లీలలు గానం చేస్తూ , అన్యోన్యతానురాగాలతో జీవితాన్ని సాగించే ధన్యజీవులు . 

పూర్వకాలంలో యక్షాగానాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉండేది .శ్రీ జయదేవకవి రచించిన గీతగోవిందము  బహుశా భారతీయ సాహిత్యములో మొదటి యక్షగానము అని చెప్పుకోవచ్చు. సరళమైన సంస్కృత పదాలతో నిండిన పద్యాలలో, పాటలలో శ్రీజయదేవుడు గీతగోవింద కావ్యాన్ని రాశాడు. రాధాకృష్ణుల విరహము, కలయికల శృంగార వర్ణనలతో నిండిన కావ్యము ఇది. పన్నెండు సర్గలలో ఇరవైనాలుగు అష్టపదులు ఉన్నాయి. అష్టపదిలో ఎనిమిది చరణాలుంటాయి. సంస్కృతములో ప్రబంధము అని పిలువబడే అష్టపది పాట రూపంలో ఉంటుంది. గీతగోవిందములో ముచ్చటగా మూడే పాత్రలు – శ్రీకృష్ణుడు, రాధ, రాధ ఇష్టసఖి.

భారతదేశములో అన్ని ప్రాంతాలలో ఎవరికి తోచిన రాగాలలో, తాళాలలో ఈ అష్టపదులను పాడారు. తెలుగులో ఎన్నో చలన చిత్రాలలో అష్టపదులను పాడారు (ఉదా. విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, మేఘసందేశం). శాస్త్రీయ సంగీత కచేరీల చివరలో కూడా అష్టపదులను పాడడము వాడుక. తెలుగువారికి బాగా పరిచయమైన అష్టపది, విప్రనారాయణ చిత్రంలో భానుమతి పాడిన ‘సా విరహే తవ దీనా’.

ఒక్కొక్క గీతములో 8 పాదములు ఉండడం చేత ఆయన రచనలు అష్టపదులుగా ప్రసిద్ధమయ్యాయి.  శృగార రసరమ్య ప్రబంధం మైన ఈ జయదేవుని గీతగోవిందంలోని 19వ అష్టపది చాలా ప్రత్యేకమైనది . దీనిని దర్శనాష్టపది, సంజీవని అష్టపది  అనికూడా అంటారు . 

కవి రచన చేసేప్పుడు భావం  దృశ్యరూపాన్ని ధరించి అతని మది వేదికమీద నర్తనం చేస్తుంటుంది . ఆ నర్తనమే ఆకారమై అక్షరమై సాకారమవుతుంది . అలా జయదేవులు 19 వ అష్టపదిలోని చరణాలని రాస్తున్నప్పుడు ఒక విచిత్రమైన భావన ఆయన మదిలో మెదిలింది .  ఆ అష్టపదిలో ఆయన 

“స్మరగల ఖండన మన శిరసి మండనం 
దహి పదపల్లవ ముదారం”
అని రాశారు . 

అంటే,  “ రాధా ! నీ ప్రేమ అనే విషం నా తలవరకూ పాకిపోయింది .  నీ చల్లని, కోమలములైన, పద్మాల వంటి చరణాలని నాతల మీద పెట్టు ! అప్పుడు  ఈ విషం శాంతిస్తుంది ” అని అర్థం . ఇలా భావన చేశాక ఆయనకీ అది తప్పనిపించింది . పరమాత్ముడైన శ్రీకృష్ణుని  శిరసున యెంత ప్రేయసి అయినప్పటికీ రాధ తన పాదాలని పెట్టడమేమిటి ? అపచారం చేసేశాను అనుకున్నారు. వెంటనే వాటిని కొట్టేసి , పద్మావతీ, అభ్యంగన స్నానం చేసొస్తానని , వంటికి నూనె రాసుకొని నదికి వెళ్లారు . 

అంతలోనే మళ్ళి  తలుపు శబ్దం కావడంతో , వెనుతిరిగి తలుపుతీసింది పద్మావతి .  జయదేవులు ఎదురుగా నూనె కారుతున్న శరీరంతో నిలుచున్నారు . ఏమయ్యింది ? అడిగారామె, ఏమీలేదు, ఆ వ్రాతప్రతిని   ఇలా తీసుకురమ్మన్నారు .  కొట్టేసిన వాక్యాలే మళ్ళీ  రాసి , వెళ్లిపోయారు . ఆవిడికిదేమీ అర్థంకాలే . 

స్నానాదికాల అనంతరం జయదేవుడు, అష్టపదిని పూరించేందుకు కూర్చొని , ఆ కొట్టేసిన పంక్తులు మళ్ళీ రాసి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు . పద్మావతిని పిలిచి ఎవరీపంక్తులు పూరించారని అడిగారు . భర్త ప్రశ్నకి ఆవిడ మరింత విస్తుపోతూ, “మీరేకదా ! రాసివెళ్లారు . చూడండి ఇంకా మీవంటికి రాసుకు వెళ్లిన నూనె చుక్కలు ఆ ప్రతిమీద అలాగే ఉన్నాయి” అని సమాధానమిచ్చారు . 

అప్పుడు అసలు సత్యం బోధపడిందా భక్తకవికి . వచ్చింది వేరెవరోకాదు , స్వయంగా ఆ గోపీలోలుడేనని తెలిసొచ్చింది. తన భావన ఎంతమాత్రం అపరాథం కాదని అర్థమయ్యింది .   ఆ మాధవుని కృపకి కన్నీటిపర్యంతమవుతూ , ఆ వచ్చింది మరెవరో కాదని గోవిందుడే స్వయంగా తన రూపంలో దర్శనమిచ్చి , వాటిని పూరించారని భార్యకి చెప్పారు జయదేవులు . 

ఆ మురళీలోలుని దర్శనాన్ని పొందిన పద్మావతికి కూడా ఈ దర్శనాష్టపదిలో చోటు కల్పిస్తూ , మిగిలిన చరణాలని ఇలా పూర్తిచేశారు.

 “జయతు పద్మావతీ రమణ జయదేవకవి 
భారతీ ఫణితమితి గీతం”


అలా భగవంతుని దర్శనాన్ని పద్మావతికి ప్రసాదించిన గీతం కనుక దీనికి దర్శనష్టపది అని పిలుస్తారు . 

ఇక్కడితో , ఆ అష్టపదుల వైభోగం ఆగలేదు . అన్నమాచార్యులు కీర్తనలు ఆలపిస్తుంటే, శ్రీదేవీ భూదేవిలతో కలిసి వేంకటేశుడు నాట్యం చేసినట్టు , రామదాసు కీర్తనలకి రాముడే తానీషాకి కప్పం కట్టినట్టు , ఇలా భగవంతుడు భక్తుని భక్తికి పరవశించనిదెప్పుడని ? అందునా , కదిలే పాదం పద్మావతియైన ఆ రాధది, రాసే కలం జయదేవుడైన ఆ జగన్నాధుడిది . మరి అటువంటి విశిష్ఠత కలిసినప్పుడు పుటిన అష్టపది సంజీవని కాకుండాపోతుందా ? 19వ అష్టపది ఆ పేరుని సొంతం చేసుకుంది . దాని వెనుక ఆయన జీవితంలో జరిగిన మరో ఆశ్చర్యకర ఘటనే ఉంది . 

పద్మావతిని లక్షనసేన మహారాజు గొప్పగా గౌరవించేవారట . అది రాజుగారి భార్యకి సహింపరానిదిగా ఉండేది . తగిన సమయం కోసం రాణి ఎదురుచూసింది  . ఒక రోజు రాజు, జయదేవునికూడా వెంట తీసుకొని వేటకి వెళ్లారు . ఇదే తగిన అదననుకొని రాణిగారు పద్మావతికి ‘జయదేవ కవి ప్రమాదవశాత్తూ చనిపోయారని చెప్పింది’ . పరమ సాధ్వి పద్మావతి . తన స్వామిలేరనే మాటనే సహించలేకపోయింది .  దుఃఖ సముద్రములో మునిగి, ప్రాణాలు విడిచింది.  

ఇటివంటి సంఘటనని ఊహించని రాణి భయంతో వణికిపోయింది . జయదేవకవి వేటనుండీ తిరిగి వచ్చాక , జరిగిన సంఘటన తెలుసుకొని, ఏమిచేయాలో తోచని అయోమయంలో తన గోవిందున్నే నమ్ముకున్నారు . 19 వ అష్టపదిని పాడి , ముఖముపై నీళ్లు చిలకరించారు.  ఆమె నిద్ర నుండి మేల్కొనినట్లు లేచి కూర్చున్నారు. ఈ అష్టపదిలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన స్వహస్తములతో వ్రాసిన పంక్తులు ఉన్నాయి. కనుక ఆమె మరల పునరుజ్జీవము పొందినది. దీంతో ఈ అష్టపది "సంజీవని అష్టపది" అని పేరుపొందింది .

జయదేవుడు స్వయముగా దేవాలయములలో అష్టపదులను ఆలపిస్తుంటే,  పద్మావతి వాటికి నాట్యము చేసేవారట . నిజానికి మొదటి శ్లోకములోనే "పద్మావతీ చరణ చారణ చక్రవర్తి" అని జయదేవ కవి ప్రకటించుకున్నారు . గీతగోవిందం అంటే, ఆ గోవిందునికి యెంత ప్రీతో తెలియజేసే మరో సంఘటనని కూడా మనమిక్కడ ప్రస్తావించుకోవాలి . 

ఒడిషా రాజైన పురుషోత్తదేవుడు కూడా జగన్నాధుని భక్తుడు , రచయితా. ఆయనకు జయదేవునిపై ఎడతెగని ఈర్ష్య. అందువల్ల జయదేవుని "గీత గోవిందము"ను పోలి ఉన్న 'అభినవ గీత గోవిందం" అనే  గ్రంధాన్ని రచించారు. కానీ అష్టపదులు సంస్కృత ప్రబంధాలే అయినా , వాటిల్లో ఉన్న వాక్యాల సొబగు వల్ల ప్రజల నోళ్ళల్లో జయదేవ కృతులే ఎక్కువగా పల్లవించాయి . రాజు కదా పురుషోత్తముడు , తన గ్రంథములోని రచనలనే పాడాలని  ప్రజలను నిర్బంధించాడు . అయినా అది ఆచరణలో సాధ్యం కాలేదు . బలవంతం చేయడం వల్ల  గుర్రాన్ని నీటిదాకా తీసుకెళ్లగలం.  కానీ, నీరు తాగించలేము కదా ! అయినా సరే, ఆయన రాచరికం - ఒక సామాన్యకవి (ఆయన దృష్టిలో ) ప్రతిభని అంగీకరించలేకపోయింది. దాంతో ,  తన గ్రంథము గొప్పదో లేక జయదేవుని "గీతగోవిందం" గొప్పదో పరిశీలించేందుకు పూనుకున్నాడు .  ఇద్దరి గ్రంథములను శ్రీ జగన్నాధస్వామి సన్నిధిలో పెట్టి తలుపులు మూసేశారు. మరునాడు ప్రాతః కాలమున తలుపులు తెరచి చూసేసరికి జయదేవుని గ్రంథము శ్రీ స్వామి చేతిలోనూ, రాజుగారి గ్రంథము గర్భగుడిలో ఒకమూలకి పడి కనిపించాయి  .  రాజు ఖిన్నుడై "గీత గోవిందము" గొప్పదనాన్ని  కొనియాడారు  . ఈ అష్టపదులు రచింపబడిన స్థలమే , అప్పటి నుండీ జయదేవపురముగా ఖ్యాతిని పొందింది .

జయదేవుని కృతి ‘ గీతగోవిందం’ అప్పటికీ ఇప్పటికీ రసరమ్య గీతామాలికే ! ఆ సంస్కృత పదాలకి ప్రస్తుతం అర్థాలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు .  వాటిని ఎవరికి అనువైన సంప్రదాయంలో, రాగాలలో  వారు ఆలపిస్తూ ఉండొచ్చు. కానీ ఆ శబ్దాలు సరాసరి చెవి నుండీ హృదయాన్ని తాకుతాయి . చల్లని మలయా మారుత సమీరంలా ! ఏ నృత్య సంప్రదాయంలో వాటిని ప్రదర్శించినా , రాధామాధవుల అమలిన ప్రేమ రాగ సుధలు జాలువారి, ఆ పవిత్ర జలంతో మనల్ని నిలువునా తడిపేస్తాయి. అందుకే , మూల ప్రతి సంస్కృతంలో ఉన్నా దాదాపు ప్రతీ భారతీయ భాషలోకీ జయదేవుని గీతగోవిందకావ్యము అనువదించబడింది. సాహిత్య పరంగా వీటికొక ప్రత్యేక స్థానం వుంది. ఎంతో మంది కవిత్వానికి ఈ అష్టపదుల్లోని సాహిత్యం ప్రేరణగా నిలిచింది. Love song of the Dark LorD – Jayadeva’s Gita Govinda అనే పేరుతో Barbara S. Miller అనే ఆవిడ జయదేవాష్టపదుల్ని ఇంగ్లీషులో చాలా చక్కగా అనువదించారు. అలాగే వుయ్యూరు సంస్థనానికి చెందిన బొమ్మకంటి వీరరాఘవాచార్యులు, శతావధాని పిచ్చయార్య, యతిశ్రీ తెలుగులోకి గీతగోవిందాన్ని అనువదించారు. 

అద్భుతమైన అష్టపదులని అందించిన జయదేవుడు 1153, డిసెంబరు 28 న, (శ్రీముఖనామ సంవత్సర మర్గశిర బహుళ ఏకాదశి నాడు)  కైవల్యమును  పొందారు . నిజానికి జయదేవుడు శ్రీ కృష్ణుని పరబ్రహ్మ స్వరూపముగా పూజించారు . ఇందులో  రాధ నాయకి-జీవాత్మ, కృష్ణుడు నాయకుడు-పరమాత్మ, సఖి - ఈ సఖి జీవాత్మను ముక్తి పథములో నడిపించి పరమాత్మలో లీనము చేయుటకు తోడ్పడు శరీరము . ఇదియే గీత గోవిందములోని సారాంశము.

శుభం .

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha