Online Puja Services

కోరిన కోర్కెలు తీర్చే లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి దర్శనం

3.128.199.162

కోరిన కోర్కెలు తీర్చే లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి దర్శనం !!
- లక్ష్మి రమణ 

భగవంతుడు భక్తుల కోసం నడిచి వస్తాడా ? అంటే, అవుననే ఉదంతాలు ఎన్నో ఈ వేదికలో మనం ఇదివరకూ చెప్పుకున్నాం . ఒక చోట కనకమహాలక్ష్మీ దేవి తనవద్దకు రాలేని భక్తుల కోసం కదిలి వెళ్ళింది . అలాగే, కలియుగ వేంకటేశ్వరుడు తన భక్తుల కోసం కదిలి ఏడుకొండలూ దిగి కదిలి వెళ్లారు. నిజమైన భక్తి ఉన్నచోటికి భగవంతుడు స్వయంగా కదిలివెళతాడని నిరూపించడానికి అదేబాటలో అనంతపద్మనాభుడు కూడా పయనించాడు .  ఆయన అనుగ్రహించి పాలించిన భక్తుని నిలయం ఇప్పుడు మహిమాన్వితమైన కోవెలగా మారి బ్రహ్మోత్సవాలని జరుపుకుంటోంది . ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం .     

తెలంగాణా రాష్ట్ర రాజధాని  హైదరాబాద్  అతి సమీపంలోనే ఉన్న వెలిమెల గ్రామంలో  కొలువైన దేవదేవుడు  లక్ష్మీ అనంతపద్మనాభస్వామి. ఈ  ఆలయానికి సుమారుగా 400 ఏండ్ల చరిత్ర ఉన్నది. నిజాం కాలంలోనే గ్రామంలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించడానికి రాజాధిరాజులో, మహర్షులో కారణం కాదు.  ఒక సామాన్యమైన భక్తుని నిజమయిన భక్తి ప్రపత్తులు కారణమవ్వడం విశేషం . 

దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం నాటి కథ ఇది .  విద్యావకాశాలని ఈ ప్రాంతంలోని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో అప్పటి  గ్రామపెద్దలు మేడ్చల్‌ ప్రాంతానికి చెందిన వెంకట్‌రెడ్డి గారిని తమ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించేందుకు గాను ఒప్పించి తీసుకువచ్చారు .   వెలిమెలలో  పాఠశాలతో పాటు ఆయనకు కావాల్సిన వసతి సౌకర్యాలు కూడా  కల్పించారు. గ్రామంలోని చిన్నారులకు వెంకట్‌రెడ్డి గారు  పాఠాలు బోధించేవారు. 

అలా చిన్నారులకి గురువైన వెంకటరెడ్డి గారు లక్ష్మీ అనంత పద్మనాభస్వామి వారికి మహా భక్తుడు. ఏటా వికారాబాద్‌లో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆయన  కాలినడకన వెళ్లేవారు. కాలం తన గమనంతో వెంకటరెడ్డిగారినీ కలుపుకు పోయింది . వయసు మీదపడింది . వృద్ధుడై నడవలేని పరిస్థితుల్లోనూ , ఒక ఏడాది అనంతపద్మనాభుని మీదున్న భక్తితో , ప్రయాసపడుతూనే  బ్రహ్మోత్సవాలకి నడిచి వెళ్లారు. కానీ ఇక భవిష్యత్తులో మళ్ళీ ఇలా స్వామి దర్శనానికి రాగలనో లేదో నని బెంగపెట్టుకున్నారు. ఆ బాధలో  స్వామివారికి తన బాధను నివేదించుకొని, కరుణించమని వేడుకొని వదలలేక వదలలేక స్వామిని వీడి తిరిగి వెలిమెలకి బయలుదేరారు . 

అలా ఆయన కాలినడకన వస్తుంటే ఉన్నట్టుండి ఆయన మెడలో పూలమాల పడడంతో పాటు, స్వామివారి సాలగ్రామం (విగ్రహం) దొరికింది. ఆ సాలగ్రామం తీసుకొని ఆయన గ్రామానికి వచ్చారు. తనకోసం ఆ లక్ష్మీ పద్మనాభులే కదిలివచ్చారని , ఇంట్లోనే  సాలగ్రామం ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు పూజలు చేసేవారు. ఈ విషయం గమనించిన గ్రామపెద్దలు వెంకట్‌రెడ్డి గారి ద్వారా  జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు.

 ఆ తర్వాత గ్రామపెద్దలు స్వామివారి ఆలయాన్ని నిర్మించి, ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టినప్పటి నుంచి గ్రామం అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని, స్వామివారు కోరిన కోర్కెలు తీరుస్తాడని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.

కొత్తగా మల్లికార్జున ప్రతిష్ఠ:

శ్రీహరి కొలువైన చోటకి తానుగా విచ్చేయాలని ఆశించారేమో ఆ మల్లికార్జనుడు ! శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా ! ఆ విధంగా , ఆ స్వామీ సంకల్పానుసారంగా  కొత్తగా ఇక్కడి పద్మనాభస్వామి ఆలయంలో శ్రీ మరాంభామల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన జరిపారు .  

ఐదురోజులపాటు ఇక్కడి అనంతపద్మనాభునికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి . విద్య, ఉద్యోగం, వ్యాపారాల దృష్ట్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న గ్రామస్తులు బ్రహ్మోత్సవాలకు ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.  ప్రస్తుతం ఇతర రాష్టాల నుండీ కూడా ఇక్కడి స్వామి వైభవం, అనుగ్రహ విశేషం తెలియడంతో భక్తులు ఇబ్బడి ముబ్బడిగా రావడం విశేషం . కోరిన కోర్కెలు తీర్చే ఈ లక్ష్మీ పద్మనాభుని దర్శించే ప్రయత్నం చేయండి మరి !! శుభం !! 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi