Online Puja Services

సృష్టి రహస్యాన్ని విప్పి చెప్పే దేవాలయం !

3.145.59.187

ఆ నెయ్యి కరిగిందా , అది ప్రళయ సంకేతమే ! సృష్టి రహస్యాన్ని విప్పి చెప్పే దేవాలయం ! 
లక్ష్మీ రమణ 

పరమాత్మ లీలా విలాసాలని అర్థం చేసుకోవడం అంత సామాన్యమైన విషయం కాదుకదా ! ఒకచోట తాను అపరిమితమైన వేడితో జ్వలిస్తుంటాడు. మరో దగ్గర నిలువెత్తు మంచే తానని పూజలందుకుంటాడు .  ఒకచోట నెయ్యిని  వెన్నగా మారుస్తాడు. ఇంకొకచోట మూడడుగుల కరగని నేతిగుట్టలో దాగి ఆశీర్వదిస్తాడు . ఇలా ఆ పరమేశ్వరుని లీలలు ఎన్నని చెప్పడం . ఇప్పటికీ కేరళలో ఉన్న ఈ ఈశ్వరుడు అద్భుతమైన లీలావిలాసంతో ఆకట్టుకుంటాడు . 

 కేరళ రాష్ట్రం, త్రిచూర్ జిల్లాలో  వడక్కునాథన్ ఆలయం ఉంది. ఈ ఆలయం దాదాపు తొమ్మిది ఎకరాల విస్తారమైన భూభాగంలో కన్నుల పండుగగా ఉంటుంది. సంప్రదాయ శైలిలో నిర్మితమైన ఈ ఆలయంలో ఎన్నో వింతలూ విశేషాలూ ఉన్నాయి .  గర్భగుడిలో ఉంది శివలింగమా ? సుబ్రహ్మణ్యుడా అనేది మనకి అర్థం కాదు. ఎందుకంటె, గర్భాలయంలో సుబ్రహ్మణ్యుని చేతిలో ఉండే శూలం వంటి నిర్మాణం దర్శనం ఇస్తుంది . కానీ నిజానికి అక్కడ నేతి గుట్టకింద కొలువై ఉంటాడు శివయ్య . అది యుగాలుగా పేరుకున్న నెయ్యి. చుట్టూ దీపాలు వెలుగుతున్న, బయట సూర్యుడు అగ్నిహోత్రంలా వెలుగుతున్నా , ఈశ్వరుని అభిషేకించిన నెయ్యి మాత్రం కరగదు .  అంతేకాకుండా ఆ నెయ్యి ఎలాంటి దుర్వాసన కూడా రాదు. ఈ నెయ్యిని ఏం చేస్తారో తెలుసా ? భక్తులకి ప్రసాదంగా ఇస్తారు . వడక్కునాథన్ పైన అభిషేకించిన ఈ నెయ్యికి అనేక ఔషధగుణాలు ఉంటాయట .  కేరళలో వినియోగించే కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలలోనూ దీనిని  వినియోగిస్తారు . 

ఇక్కడ శివయ్య కొలువుదీరడానికి కారణం పరుశురాముడు. ప్రపంచం మీద దండెత్తి రాజులందరినీ నిర్మూలన చేసి, తిరిగి ఆ పాప ప్రక్షాళన కోసం తానూ జయించిన భూమినంతా ధారబోస్తాడు పరుశురాముడు.  నిలువడానికి చోటన్న ఉంచుకోకండా దానం చేసేసి , చివరికి సముద్రుణ్ణి తనకి తపస్సు చేసుకొనే నిమిత్తం కొంత భూమినిమ్మని అడుగుతాడు . అలా సముద్రుడిచ్చిన భూమి కేరళ. అక్క ఉండేందుకు రమ్మని ఆ ఆది దంపతులని ఆహ్వానిస్తారు పరశురాముడు. అలా వచ్చిన స్వామి ఇక్కడ ఒక మర్రి చెట్టుకింద శిలారూపంగా నిలిచారు. దీన్నే మూలస్థానం అంటారు . 

ఆ తర్వాత త్రిచూర్ రాజు స్వవానికి దేవాలయాన్ని నిర్మించారట .  ఈ ఆలయంలోని విశేషాలు ఇంతటితో ముగియలేదు. ఎక్స్ రే పుట్టడానికి వెయ్యేళ్ళ ముందర నిర్మించిన ఈఆలయంలోని శిల్పకళని ఖచ్చితంగా పరిశీలించి తీరాలి. ఇవి పురాణకథలు కాదు. శృంగార చిత్రాలు కాదు. ఇవి గర్భస్థ శిశువు ఎలా తయారవుతుంది ? ప్రతి నెలా ఆ శిశువు యొక్క అవస్థ (పరిణితి, స్థితి/ ఆకారం  ) ఎలా ఉంటుందనేది స్పష్టంగా చెక్కి ఉంది. ఇవాళ మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చూస్తున్న చిత్రాలు, ఈ ఆలయ కుడ్యాలమీద ఉన్నాయి . ఇదెలా సాధ్యం అని ఆశ్చర్య చకితులైన శాస్త్రవేత్తలు ఈ కాలంలోనే ఉన్నారంటే, చూడండి మన సనాతనుల వైజ్ఞానిక ప్రతిభ. వైద్య రంగంలో భారతదేశం సాటిలేనిది అని చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహణ ఇంకా ఏంకావాలి ?

ఇక ఇక్కడ మరో ఉపాలయంలో బాల సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటారు. సంతానానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉన్న ఆలయంలో ఆయనకీ విశేషమైన పూజలు జరగడంలో విశేషమేమీ లేదుకదా ! అసలు ఆదిశంకరాచార్యులవారు ఇక్కడి శివయ్య అనుగ్రహముతోటే పుట్టారని చెబుతారు . ఇంకా శివయ్యతోపాటు , పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ఇలా శైవ కుటుంబమంతా చక్కగా దర్శనమిస్తారు. వీరితోపాటు రాముడు , కృష్ణుడూ కూడా ఉంటారు. ఇక్కడే ఉన్న శంకరనారాయణ స్వామి ఆలయంలో స్వామికి 18 కిలోల అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు . 

ఇక్కడ జరిగే మరో అద్భుతం ఏనుగులకు ఆహారాన్ని పెట్టె ఉత్సవం . బంగారు జలతారులని ఏనుగులకు అలంకరించి , వాటికి ఆహారాన్ని తినిపించే ఉత్సవం కోలాహలంగా ఏప్రియల్ / మే నెలల్లో జరుగుతుంది. ఈ ఆలయానికి ఉత్సవానికి సంబంధం లేకుపోయినా ఈ సంబరం ఈ ఆలయ ప్రాంగణంలోనే జరగడం విశేషం . 

ఇలా చేరుకోవచ్చు :
రైలులో వచ్చే వారికి, వాయు మార్గంలో వచ్చేవారికి తిరుచ్చురు దగ్గరి ప్రాంతం . అక్కడినుండి ఆటోలు , బస్సులు ఉంటాయి. 
బస్సులో వచ్చే వారికి కర్ణాటక, తమిళనాడు, కేరళ నుండీ బస్సులు అందుబాటులో ఉన్నాయి .      

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gautama Buddha